
వాలంటైన్ డే వెనకున్న కథలు తెలుసా?
ప్రేమకు పర్యాయపదమయిన వాలెంటైన్స్ డే కొందరు ఎందుకు వ్యతిరేకిస్తారు
మాటలకందని మధుర భావన. చెతల్లో చూపలేని అనుబంధం. కనులకు కనిపించని అనుభూతి. అర్థం చేసుకోవడమే కానీ అర్థం లేని అద్భుత భావన.. అదే ప్రేమ. రెండు లోకాలను, ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసే ఈ మనోహర అనుభూతిని స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న జరుపుకునే దినోత్సవమే ‘‘వాలంటైన్స్ డే’. ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటుంది. ఫిబ్రవరి 14కు వారం రోజుల ముందు నుంచే వాలంటైన్ వీక్ పేరుతో ప్రత్యేక క్రతులను కూడా చేసుకుంటారు ప్రేమికులు.
ఫిబ్రవరి 14 వారు ఒకరిపై ఒకరి ప్రేమను పరస్పరం వ్యక్తం చేసుకుంటారు. దీనిని కొన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి? మరికొన్ని అందులో తప్పేముందని వెనకేసుకుని వస్తున్నాయి. అయితే ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల వచ్చిందంటే అంతా మాట్లాడుకునే ఈ వాలంటైన్ డే వేనకున్న కథలు తెలుసా? ఈ ప్రేమికుల రోజును కొన్ని సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో తెలుసా? ఈ వాలంటైన్ డే మూలాలు చాలా పురాతన కాలానికి చెందాయి.
రోమన్‌లో మొదలైన కథ
వాలెంటైన్ డే మూలాలు ప్రాచీన రోమ్ వరకు వెళ్తాయి. ఫిబ్రవరి మధ్యలో అక్కడ ‘లూపర్కేలియా’ అనే పండుగ జరుపుకునేవారు. ఇది వసంతఋతువు ఆరంభానికి సంకేతం. సంతానోత్పత్తి, శుద్ధి సూచికగా భావించబడేది. ఈ పండుగలో యువకులు, యువతుల పేర్లు చీట్లు వేయించి జంటలుగా జత చేసే ఆనవాయితీ ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు. తరువాత క్రైస్తవ మతం విస్తరించడంతో ఈ పండుగను రద్దు చేసి, దాని స్థానంలో క్రైస్తవ స్మారక దినాన్ని ప్రవేశపెట్టినట్లు భావిస్తున్నారు.
సెయింట్ వాలెంటైన్ ఎవరు?
వాలెంటైన్ పేరుతో రోమన్ కాలంలో ముగ్గురు క్రైస్తవ మతగురువులు ఉన్నట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అయితే ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ ఒకరికి సంబంధించినదే. ఆ కాలంలో చక్రవర్తి క్లాడియస్–II యువ సైనికులు పెళ్లి చేసుకుంటే యుద్ధానికి పనికిరారని భావించి వివాహాలను నిషేధించాడు. దీనికి వ్యతిరేకంగా వాలెంటైన్ రహస్యంగా ప్రేమజంటలకు వివాహాలు జరిపేవాడని కథనం చెబుతుంది.
విషయం తెలిసిన తర్వాత చక్రవర్తి అతన్ని అరెస్ట్ చేసి మరణశిక్ష విధించినట్లు చెబుతారు. మరణానికి ముందు జైలు అధికారి కుమార్తెకు లేఖ రాసినట్లు ఒక కథనం ఉంది. ఆ లేఖ చివరలో తన వాలెంటైన్ నుంచి అనే భావంతో సంతకం చేశాడని విశ్వసిస్తారు. ఫిబ్రవరి 14న శిక్ష అమలు చేసినట్లు చెబుతారు. తర్వాత ఆయనను ప్రేమకు ప్రతీకగా స్మరించడం ప్రారంభమైంది.
మధ్యయుగ యూరప్‌లో రూపాంతరం
14వ శతాబ్దంలో ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఫిబ్రవరి మధ్యకాలం పక్షులు జతకట్టే సమయమని నమ్మకం ఉండేది. ఈ నమ్మకం ప్రేమతో అనుసంధానమైంది. కవి జెఫ్రీ చాసర్ రచనల్లో వాలెంటైన్ డేను ప్రేమతో కలిపి ప్రస్తావించారు. అక్కడి నుంచి ప్రేమలేఖలు, కవితలు పంపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. క్రమంగా ఈ రోజు ప్రేమ వ్యక్తీకరణకు చిహ్నంగా మారింది.
ఆధునిక వాలెంటైన్ డే పుట్టుక
18వ శతాబ్దం నుంచి యూరప్‌లో కార్డులు, పూలు, చాక్లెట్లు ఇచ్చే ఆనవాయితీ విస్తరించింది. 19వ శతాబ్దంలో ముద్రిత గ్రీటింగ్ కార్డులు మార్కెట్‌లోకి వచ్చాయి.
20వ శతాబ్దంలో అమెరికా ద్వారా ఈ రోజు వాణిజ్యపరంగా మరింత విస్తరించింది. నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేమజంటలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అనురాగం వ్యక్తపరచుకునే రోజుగా మారింది.
భారత్‌లోకి ఎంట్రీ
1990ల తర్వాత గ్లోబలైజేషన్ ప్రభావంతో భారత్‌లో కూడా ఈ సంబరాలు విస్తరించాయి. టెలివిజన్, సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. పట్టణాల్లో యువత పెద్దఎత్తున పాల్గొనడం ప్రారంభించారు.
పూలు, బహుమతులు, శుభాకాంక్షల మార్పిడి సాధారణమైంది. ఇది కేవలం ప్రేమజంటలకే పరిమితం కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసే రోజుగా మారింది. కాలక్రమేణా ఇది వ్యాపార పరంగా కూడా పెద్ద మార్కెట్‌గా రూపుదిద్దుకుంది.
ఎందుకు వ్యతిరేకత?
కొన్ని హిందుత్వ సంస్థలు వాలెంటైన్ డే భారతీయ సంస్కృతికి విరుద్ధమని భావిస్తున్నాయి. పాశ్చాత్య ప్రభావం వల్ల సంప్రదాయ విలువలు దెబ్బతింటాయని వాదిస్తున్నాయి. యువతను సాంస్కృతిక వికృతుల వైపు మళ్లించే పండుగగా విమర్శిస్తున్నాయి. పలు చోట్ల నిరసనలు, ఆంక్షలు విధించిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
కొందరి వ్యతిరేకతకు కారణాలు
ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న జరుపుకునే వాలెంటైన్స్ డే భారతదేశంలో చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా కొన్ని సంస్థలు ఈ వేడుకలను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. తమ వాదన ప్రకారం ఇది భారతీయ మూలాలకు సంబంధించిన పండుగ కాదని, పాశ్చాత్య సంస్కృతి దిగుమతిగా చూస్తున్నారు. విదేశీ సంప్రదాయాలను అనుసరించడం వల్ల యువత సొంత సంస్కృతి, కుటుంబ విలువలు మరిచే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు.
కేవలం ఒక రోజును ప్రేమ కోసం కేటాయించడం భారతీయ భావజాలానికి విరుద్ధమని, దేశ సంస్కృతి ‘వసుధైక కుటుంబకం’ అనే విస్తృత ఆలోచనపై ఆధారపడిందని చెబుతున్నారు. అదేవిధంగా వాలెంటైన్స్ డే వెనుక కార్పొరేట్ వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయని, గ్రీటింగ్ కార్డులు, బహుమతులు, హోటల్ వ్యాపారాలను ప్రోత్సహించే పద్ధతిగా మారిందని విమర్శిస్తున్నారు. ఇది మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి పెంచుతుందని వారి అభిప్రాయం.
బహిరంగ ప్రదేశాల్లో ప్రేమ ప్రదర్శనలు భారతీయ సామాజిక విలువలకు విరుద్ధమని సంఘ్ పరివార్ భావిస్తోంది. పార్కులు, పర్యాటక ప్రాంతాల్లో అశ్లీలతకు తావు లేకుండా నైతిక విలువలు కాపాడాలని తమ లక్ష్యమని చెబుతోంది. ప్రేమను వ్యతిరేకించడం కాదని, సంస్కృతి పరిరక్షణే ఉద్దేశమని సంస్థ పెద్దలు వివరిస్తున్నారు.
వాలెంటైన్స్ డేకు ప్రత్యామ్నాయంగా “మాతృ-పితృ పూజ దివస్” నిర్వహించాలని పిలుపునిస్తూ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ వ్యక్తపరచాలని సూచిస్తున్నారు. గతంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ, ఇటీవల కాలంలో హింసాత్మక నిరసనల కంటే అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

