శ్వేతపత్రం అంటే ఏమిటి? దాన్ని ఎందుకు ప్రవేశపెడతారు?
x

శ్వేతపత్రం అంటే ఏమిటి? దాన్ని ఎందుకు ప్రవేశపెడతారు?

ఆంధ్రలో శ్వేతపత్రాల హవా సాగుతోంది. గత ప్రభుత్వం బండారం బయటపెట్టడానికే వీటిని విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అసలు శ్వేతపత్రం అంటే ఏంటి?


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో శ్వేతపత్రాల హవా సాగుతోంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్, అమరావతి, విద్యుత్‌ రంగంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలను విడుదల చేశారు. అదే విధంగా ఆర్థిక శాఖపై కూడా శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ చూసినా ఈ శ్వేతపత్రాల చర్చలే జరుగుతున్నాయి. వీటిని గత ప్రభుత్వం పాల్పడిన అవినీతిని ప్రజల ముందు ఉంచడానికి విడుదల చేస్తున్నామని నారా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఈ శ్వేతపత్రాలను తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల మోదీ ప్రభుత్వం కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఎన్‌డీఏ ప్రభుత్వం శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే అసలు శ్వేతపత్రాలు అంటే ఏంటి? అందులో ఏముంటుంది? అది ఎప్పుడు విడుదల చేస్తారు? దాని వల్ల లాభమేంటి? అన్న అనుమానాలు చాలా మందిలో తలెత్తుతున్నాయి.

శ్వేతపత్రం అంటే

ఏదైనా ఒక అంశంపై రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే సాధికారిక నివేదిక లేదా మార్గదర్శక పత్రాన్నే శ్వేతపత్రం అంటారు. ఇందులో ఏ అంశాన్నయితే ప్రస్తావించారో దానికి సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి. ప్రభుత్వ అధికారిక సమాచారంతో రూపొందించే వాస్తవ నివేదికనే ‘శ్వేతపత్రం’ అని అంటారు. సాధారణంగా ఒక అంశంపై ప్రభుత్వం తన విధానాలు చెప్తూ.. దానిపైన అభిప్రాయాలను ఆహ్వానించడానికి శ్వేతపత్రాన్ని ఉపయోగించవచ్చు. అదే విధంగా ఒక బిల్లును ప్రవేశపెట్టడానికి మందు దానికి సంబంధించి పూర్తి వివరాలను పొందుపరిచి శ్వేతపత్రం రూపొందించి విడుదల చేస్తారు. తద్వారా సదరు బిల్లుకు సంబంధించిన వివరాలను ప్రజలకు అందించడం జరుగుతుంది.

దీంతో పాటుగా ప్రస్తుతం గత ప్రభుత్వం పాల్పడిన అవకతవకలను ప్రజల ముందు ఉంచడానికి కూడా ఈ శ్వేతపత్రాలను ప్రభుత్వాలు వినియోగిస్తాయి. ప్రస్తుతం చంద్రబాబు, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేసింది కూడా అదే. గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఏస్థాయిలో దోచుకున్నాయో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనే తాము శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని వారు బహిరంగంగానే ప్రకటించారు. ఈ శ్వేతపత్రం ఇప్పుడు కొత్తగా ప్రవేశపెడుతున్నది ఏమీ కాదు. శ్వేతపత్రం అనే కాన్సెప్ట్‌ మనకు స్వాతంత్ర్యం రాకముందు నుంచే వాడకంలో ఉంది.

తొలి శ్వేతపత్రం అప్పుడే

ఇప్పటివరకు ఉన్న రికార్డుల ప్రకారం తొలి శ్వేతపత్రాన్ని 1922లో చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసింది. చర్చిల్ ప్రభుత్వం విడుదల చేసిన తొలి సమగ్ర నివేదికను శ్వేతపత్రం అని పిలిచారు. దీన్నే చర్చిల్ మెమోరాండం అని కూడా అంటారు. ఇది యూదులపై పాలస్తీనా హింసపై రూపొందించబడింది. దీనిని ఆ దేశంలోని తొలి బ్రిటిష్ హైకమిషనర్ సర్ హెర్బర్ట్ శామ్యూల్ రూపొందించారు. ఆ తర్వాత చట్టపరమైన ప్రతిపాదనలకు బిల్లు రూపం ఇవ్వడానికి ముందు జరిగే వ్యవహారాలపై ప్రజల అభిప్రాయాలు సేకరించడానికి సిద్ధం చేసే ప్రభుత్వ నివేదికగా బ్రిటన్ పార్లమెంటు శ్వేతపత్రాన్ని నిర్వచించింది. భారత్, కెనడా, అమెరికా లాంటి అనేక ఇతర దేశాలు కూడా దీనినే అనుసరిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఇది అమలులోనే ఉంది.

దీని వల్ల ఉపయోగం

ప్రభుత్వ పనితీరును ప్రజలు అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడానికి ప్రజలు తగిన సూచనలు చేయడానికి ఈ శ్వేతపత్రం ఉపయోగపడుతంది. ప్రభుత్వం తీసుకున్న, తీసుకునే నిర్ణయాలు, అంశాల గురించి ప్రజలు తెలుసుకోగలుగుతారు. వాటిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగలుగుతారు.

Read More
Next Story