ఓడిన పార్టీ పై బుల్డోజర్ ప్రయోగం వెనక చాలా రాజకీయం ఉంది...
x

ఓడిన పార్టీ పై బుల్డోజర్ ప్రయోగం వెనక చాలా రాజకీయం ఉంది...

ఇఫ్టూ ప్రసాద్ విశ్లేషణ: ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం మీద వత్తిడి తెచ్చి సాధించుకోవడానికి బదులు చంద్రబాబు సర్కారు ఓడిన పార్టీ పై బుల్డోజింగ్ వైఖరిని చేపట్టింది.



ఆనాడైనా, ఈనాడైనా ప్రాణం లేని నిర్జీవ భవనాల కూల్చివేతల వెనక వాస్తవ లక్ష్యం ప్రాణమున్న కోట్లాది ప్రజల బ్రతుకుల పై దాడి!
బయటకు కనిపించే ఈ రాజకీయ విద్వేషం వెనక ప్రగాఢ 'వర్గ ఐక్యత' వుంది.

-ఇఫ్టూ ప్రసాద్

2019లో ప్రజా వేదిక భవన్, 2024 లో వైస్సార్ సీపీ పార్టీ ఆఫీసు కూల్చివేతల వెనక 'రాజకీయ ద్వేషం' ఉన్న మాట నిజమే! అదే సమయంలో వాటి వెనక అంతకు మించిన 'వర్గ ఐక్యత' దాగివుందని చెప్పడం ఈ రైటప్ కి కారణం.

ప్రాణం లేని నిర్జీవ భవనాల కూల్చివేత రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఓ సంచలన వార్తగా మారింది. ఇది కొత్త రాష్ట్ర ప్రభుత్వం సాధించిన వ్యూహాత్మక విజయం. కోట్లాది ప్రజల ఎజెండాను పక్కదారి పట్టించడానికి ప్రజా వ్యతిరేక సర్కార్ పన్నిన కుట్రకి దక్కిన విజయమిది. ప్రాణం లేని ఓ భవనాన్ని కూల్చి ఐదు కోట్ల మందికి పైగా ప్రజల దృష్టిని దారి మళ్లించడం ఆషామాషీ పని కాదు. 2019 కైనా, 2024 కైనా వర్తించే సూత్రమిది.

కూలిన భవనాలూ, కూల్చిన బుల్డోజర్లూ ప్రాణం లేనివే! వాటికి స్వయంగా లక్ష్యాలు ఉండవు. ఎవరి ఆధ్వర్యంలో ఉంటే వారి ఆగ్రహానికైనా, ప్రేమకైనా గురౌతాయి. కూలిన భవనాల అధిపతులకీ, వాటి కూల్చివేతకు ఉత్తర్వులిచ్చిన ప్రభుత్వాధినేతలకి గల తక్షణ రాజకీయ ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక వర్గ ప్రయోజనాలు ఎక్కువే! ఈ చేదునిజం పీడిత ప్రజలకు ఓ సందేశం కావాలి.

కూల్చివేతల వెనక 'రాజకీయ ద్వేషం' బయటకు కనిపించేది. లోపల ఉండేది 'వర్గ ఐక్యత'! 'సామాజిక ఆధిపత్య భావం' వారి మధ్య మరో ఏకీభావ అంశమే. ఈ దోపిడీ తాత్విక సమైక్యత ఒకరి తర్వాత మరొకరు వంతుల వారీగా బుల్డోజర్లతో కూల్చివేతలకు దారి తీయిస్తున్నది.

బుల్డోజర్ల ఇనుప డెక్కల క్రింద నలిగి నిశించేది నిజానికి నిర్జీవ భవనాలు కాదు. తుది పరిశీలనలో కోట్లాది ప్రజల బ్రతుకులు బలవుతాయి. ఆ పీడిత ప్రజలకు ఆ బుల్డోజర్ల రణగొణ శబ్దాలు సందేశాత్మక సైరన్ గా మార్చాల్సి ఉంది.

నాడు అత్యధిక మెజార్టీతో గెలిచిన జగన్ సర్కారు మీద రాష్ట్ర ప్రజలు అత్యధిక ఆశలు పెంచుకున్నారు. అవి తుంచి వేయాల్సిన బాధ్యతని జగన్ సర్కారు తీసుకుంది.

2019 లో జగన్ ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టం హామీల అమలు కోసం, అందులో భాగంగా ప్రత్యేక హోదా వంటి డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశాడు. గెలిచాక ఆ డిమాండ్ల సాధన కోసం ఏ కేంద్ర సర్కారు మీద తను పోరాడాల్సి వుందో, ఆ కర్తవ్యాన్ని వదిలేసింది. తన ద్రోహాన్ని ప్రజల దృష్టికి రాకుండా భావోద్వేగాల్ని సృష్టించాల్సి వచ్చిన ఫలితమే ప్రజా వేదిక భవన్ కూల్చివేత తో ప్రారంభమైన నాటి పాలన!

2024 ఎన్నికల్లో ప్రధానంగా చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలిస్తూ రాష్ట్ర పర్యటన చేశాడు. పైగా జగన్ సర్కార్ వదిలేసిన ప్రత్యేక హోదాతో సహా అసంఖ్యాకంగా హామీల్ని ఇచ్చాడు. గెలిచాక తానిచ్చిన హామీల అమలుకై ప్రధానంగా ఏ కేంద్ర సర్కారు మీద వత్తిడి తెచ్చి సాధించుకోవాలో, ఆ కర్తవ్యాన్ని చేపట్టే బదులు, ఓడిన పార్టీ పై బుల్డోజింగ్ వైఖరిని చేపట్టింది.

రెండు గాడిదలు మొఖాల వైపు ఎదురైతే మూతులు ముద్దాడతాయి. వాటి వెనక భాగాలు కలిస్తే కాళ్ళతో అవి తన్నుకుంటాయి. వాటిని అవకాశవాదులని అసలేం. వాటి సహజ జంతుప్రవృత్తిలో భాగమది. కానీ వైసీపీ, టీడీపీ పార్టీలు పార్లమెంటులో ప్రజా వ్యతిరేక చట్టాల సందర్భాల్లో ఢిల్లీలో ముద్దులాడతాయి. అమరావతికి వస్తే తన్నుకు చస్తాయి. రాష్ట్ర ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుండి దారి మళ్లించడంలో ఒక సర్కారుని మించి మరో సర్కారు; ఒకటి తర్వాత మరొకటి వరసగా పోటీ పడుతున్న తీరు జుగుప్సాకరంగా వుంది.

మరో వారంలో సుమారు పదివేల కోట్ల రూపాయల చెల్లింపుల బాధ్యత కొత్త ప్రభుత్వ భుజస్కంధాల పై ఉంది. చంద్రబాబు సర్కారుకు దడ పుట్టిస్తోంది. వైఫల్యం చెందితే ప్రధాన వార్తలుగా మారతాయి. సహజంగానే ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయలేని ఏ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకైనా ప్రజల దృష్టిని దారిమళ్లించే కుట్రల అవసరం ఏర్పడుతుంది. చంద్రబాబు సర్కార్ కి నేడు ఆ అవసరం ఏర్పడిందేమో!

జగన్ ప్రభుత్వం సంక్షేమం పై బారెడు కేంద్రీకరించి, అభివృద్ధి పై జానెడు సైతం కేంద్రీకరణ చేయలేదనే విమర్శ 58 నెలల పాటు చంద్రబాబు చేశాడు. ఇలాగైతే AP మరో శ్రీలంక అవుతుందనే ఆరోపణ సైతం చేశాడు. ఆఖరి రెండు నెలల్లో సంక్షేమం గూర్చి బారన్నర హామీలనిచ్చాడు. ఫలితంగా వాటి అమలు చంద్రబాబు సర్కార్ ని ఊపిరాడనివ్వని ఇరకాట స్థితిలోకి నెట్టింది.

2019 జగన్ సర్కారు స్థితి కంటే 2024 చంద్రబాబు సర్కార్ స్థితి ఇంకా క్లిష్టమైనది. ముఖ్యంగా సూపర్ సిక్స్ చంద్రబాబు గుండెల మీద పేలడానికి సిద్ధమైన డైనమైట్ వంటిది. కోట్లాది రాష్ట్ర ప్రజలు ఓ భయంకరమైన పేలుడు శక్తిగా చంద్రబాబు కళ్ళకు కనిపించడం సహజమే. ఈ ప్రజా డైనమైట్ నుండి కొత్త సర్కారును కాపాడడంలో బుల్డోజర్లు ఉపకరిస్తాయని చంద్రబాబు వ్యూహమేమో!

నాటి జగన్ సర్కార్ కంటే నేటి చంద్రబాబు సర్కార్ ఢిల్లీలో అఫెన్సివ్ స్థానంలో ఉంది. మోడీ ప్రభుత్వం పై రాజకీయ వత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రజలకు ఉపకరించే అవకాశం నాటి జగన్ కంటే నేటి బాబుకి ఎక్కువగా ఉంది. చంద్రబాబు వ్యూహం ఆ వైపు కంటే తన రాజకీయ ప్రత్యర్థి నిర్మూలన కోసం మోడీ ప్రభుత్వ అండను పొందే వైపు ఉందనిపిస్తోంది. APని ప్రతిపక్షం లేని రాష్ట్రంగా మార్చి, ప్రజల్ని అణిచిపెట్టి పాలించే వ్యూహం పన్నిందని అనుమానాలు రావడానికి అవకాశం కలుగుతుంది.

నాడు, నేడు కూల్చివేతలకి కారణాల్ని లీగల్ కోణాల్లో చర్చించడం కాదు. లాజిక్ గా తర్కించడం కాదు. డిండిమ భట్టు తరహా వాదోపవాదాలకి దిగి ఏ పార్టీది కరెక్ట్, ఏ పార్టీది రాంగ్ అని చర్చోపచర్చలు చేయడం కాదు. ఆరోజైనా, ఈరోజైనా ఈ కూల్చివేతల తంతు ప్రజల్ని కళ్ళుకప్పే కుట్ర మాత్రమే! వాటిని గుర్తించి, వాస్తవ సమస్యల పైకి ప్రజల దృష్టిని మళ్లించడం ప్రజలకు ప్రాతినిధ్యం వహించే శక్తుల కర్తవ్యం. అవి తమ బాధ్యతని గుర్తెరిగి ప్రజల్ని చైతన్యవంతం చేస్తాయని ఆశిద్దాం.

సూపర్ సిక్స్ సహా రాష్ట్ర ప్రజలకిచ్చిన హామీల సంగతి ఏమిటని ప్రశ్నించే విధంగా ప్రజల దృష్టిని మళ్ళిద్దాం. ప్రజలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక పాలకవర్గాలు పన్నిన కుట్రలకు బలికానివ్వకుండా ప్రజల్ని అప్రమత్తం చేద్దాం.

దేశాన్ని ఫాసిస్టు ప్రయోగశాల గా మార్చాలని ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వ విధానాల్ని ఎదిరించకపోగా, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం నిలబడకపోగా, దాని ఎదుట సాగిలపడుతున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిద్దాం.

రెండు బందిపోటు ముఠాల మధ్య కుమ్ములాటల్లో ఎవరు మంచి, ఎవరు చెడు కంటే సూపర్ సిక్స్ సహా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అన్ని హామీల అమలు పైకి ప్రజల దృష్టిని మళ్లించి రేపటి పోరాటాల పైకి సమీకరించే ప్రయత్నం చేద్దాం.


Read More
Next Story