ఇంతకీ ఈ జెన్-జీర్స్ ఎవరు?  ఈ తరం ప్రత్యేకతేమిటీ!!
x

ఇంతకీ ఈ జెన్-జీర్స్ ఎవరు? ఈ తరం ప్రత్యేకతేమిటీ!!

ఈ మధ్య ప్రముఖులు తెగ ఉపయోగిస్తున్న పదం జెన్-జీ. ఇంతకీ జెన్-జీ అంటే ఏంటో తెలుసా! దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా!


సుబ్బూ ఎలియాస్ సుబ్రమణ్యం. వయసు మహా ఉంటే 26,27 ఏళ్లు. పెళ్లయింది. ఒక బిడ్డ కూడా. కానీ ఈ వయసుకే అతనో మిలియనీర్. కలివిడితనం ఎక్కువ. ఎవరికేదైనా ఆపద వచ్చిందంటే పనులన్నింటినీ పక్కన బెట్టి ముందుకురుకుతాడు. భార్య బిడ్డలంటే వల్లమాలిన ప్రేమ. అడుగు తీసి అడుగు పెట్టకుండానే తన మొబైల్ లేదా పరసనల్ ల్యాప్ టాప్ నుంచే అన్ని పనులు చేస్తుంటాడు. అందరికీ తల్లో నాలుకలా ఉంటుంటాడు. అందరూ అతన్ని టెక్ సవాయ్ అంటుంటారు. తన ఈడు వయసున్న వాళ్లు మాత్రం అతన్ని జెన్- జీగా పిలుస్తుంటారు. ఇంతకీ ఏమిటీ జెన్- జెడ్?

ప్రపంచ ప్రఖ్యాత ఆర్ధిక వేత్త, 2019 నోబెల్ ప్రైజ్ గ్రహీత అభిజిత్ ముఖర్జీ ఇటీవల తన ప్రసంగాలలో ఎక్కువగా వాడుతున్న పదం ఈ జెన్-జీ. ఈ జనరేషన్ పై ప్రస్తుత ప్రపంచానికి చాలా ఎక్కువ ఆశలున్నట్టు వరల్డ్ నాలెడ్జ్ ఫోరం కూడా అంచనా వేస్తోంది. ప్రముఖులు, యోచనాపరులు ఉపయోగిస్తున్న ఈ పదం జెన్-జీ.

ఇంతకీ ఈ జెన్ జీ అంటే ఏమిటీ?

జెనరేషన్- Z. మన భాషలో చెప్పుకోవాలంటే ప్రస్తుత యువతరాన్నే జనరేషన్ జీ అనవచ్చు. 1996, 2010 మధ్య పుట్టిన వాళ్లు ఈ తరంలోకి వస్తారు. వందేళ్ల వ్యవధిని మూడు తరాలుగా భావిస్తే జనరేషన్ జీ కి ముందున్న తరాన్ని మిలీనియల్స్ అని పిలుస్తున్నారు. 2010 తర్వాత పుట్టిన వాళ్లను జనరేషన్ ఆల్ఫా అంటున్నారు. ప్రస్తుత యువతరం అంటే జెన్-జీ డిజిటల్ యుగానికి (కంప్యూటర్) సూచికలు. ఇంటర్ నెట్ తో ఆటాడుకుంటున్న ఈ తరం సామాజిక మార్పుకి సారథులుగా భావిస్తున్నారు. మారుతున్న ఆర్థిక దృశ్య నేపథ్యంలో ప్రత్యేకించి COVID-19 తర్వాత ఈ తరం ప్రాధాన్యత బాగా పెరిగిందన్నది ఆర్థిక వేత్తల అంచనా. ఇంటర్నెట్‌తో ఎదిగిన మొదటి తరం ఇది.

ఏమిటి వీళ్ల గొప్పంటే...

పాతతరం మనుషుల మాదిరిగా ఈ తరం లేదు. ఆకళింపు ఎక్కువ. టెక్నాలజీతో పుడుతున్నారు. ఇంటర్నెట్ తో ఎదుగుతున్నారు. దేన్నైనా ఇట్టే మనసుకు పట్టించేసుకుంటున్నారు. ప్రతి తరం మాదిరే జెనరేషన్ జెడ్ వాళ్లకీ మినహాయింపులు లేకపోలేదు. ఎవరి మానసిక పరిపక్వతైనా వారి పెరిగిన పరిసరాలు, ఎదిగిన సమాజాన్ని బట్టే ఉంటుందనేది అందరూ ఎరిగిందే. అయితే ఈ తరం ప్రత్యేకత మాత్రం వందా లేక అంతకుమించిన కాలంలో వచ్చిన ఉపద్రవాలన్నింటినీ జెన్-జీ చూస్తూ పెరిగింది. వీళ్లు పర్యావరణ విధ్వంసాన్ని చూశారు, చూస్తున్నారు.

ఎప్పుడో వందేళ్ల కిందట వచ్చిన కరోనా లాంటి మహమ్మారిని, అది ప్రపంచాన్ని ఎంతగా భయపెట్టిందో, లాక్ డౌన్ అంటే ఏమిటో గ్రేట్ క్రాష్, గ్రేట్ డిప్రెషన్ వంటి భయానక దృశ్యాలనూ చూశారు. వీళ్లకు ఇంటర్నెట్ లేనిదే క్షణం గడవదు. అందుకే ఈ తరాన్ని ఇంటర్నెట్‌తో ఎదిగిన మొదటి తరం అంటున్నారు. వీళ్లు వాడుతున్న భాష వీళ్లకు ముందుతరంగా భావిస్తున్న మిలీనియన్స్ కి ఏమైనా అర్థమవుతుందేమో గాని అంతకు ముందు తరంగా చెబుతున్న బేబీ బూమర్స్ కి అర్థం కాకపోవొచ్చు. అంతటి విస్తృతి జెన్-జీకి ఉందంటున్నారు. మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా జెన్-జీ వేగంగా పెరుగుతోంది. జెన్-జీ యువత 2025 నాటికి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని జనాభాలో నాలుగింట ఒక వంతు ఉంటుందని అంచనా.

ఇంతకీ ఏమిటీ తరాల మధ్య తేడా ఏమిటీ?

మన కుటుంబాలలో చాలా మంది వాడే పదం కూడా తరమే. తాతలు, తండ్రుల తరమని పిల్లల తరమని చెబుతుంటారు. ఎప్పుడు జన్మించారనే దాని ఆధారంగా ఈ తరాలు ఉంటాయి.

బేబీ బూమర్స్ ఎవరు?

సామాజిక శాస్త్రవేత్తలు వేల ఏళ్లుగా ఈ తరాలను అధ్యయనం చేస్తున్నారు. ఇటీవల, ఆగస్ట్ కామ్టే వంటి ఆలోచనాపరులు తరాల మార్పు సామాజిక మార్పుకి శోధక శక్తి అన్నారు. తరం ఏదైనా కాస్త కుడిఎడంగా కొత్త జీవిత దశలోకి ప్రవేశించడం అనేది సమాజ పరిణామక్రమంలో ఓ భాగం. ఉదాహరణకు, మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జీవించినవారు అనుభవించినన్ని బాధలు, కష్టాలు ఆ తర్వాతి తరం వారు పడలేదు. అందుకే ఆ కాలాన్ని నిరుత్సాహానికి మారుపేరుగా పిలుస్తుంటారు.

ఆ తరువాత, రెండవ ప్రపంచ యుద్ధంలో అనేక మంది చేసిన వీరోచిత త్యాగాలకు 'గొప్ప తరం' అని పేరు పెట్టారు. ఆ యుద్ధం ముగిసిన తర్వాత పుట్టిన పిల్లల్ని బేబీ బూమర్స్ అంటారు. వారి దృక్పథం సామాజిక తిరుగుబాట్లు. ఆ తర్వాత అంటే 1981 నుంచి 1996 మధ్య పుట్టిన వాళ్లను మిల్లీనియల్స్ అంటున్నారు. అంటే ఇప్పటికి వాళ్లు 50వ పడిలో పడి ఉంటారు. అంతకుముందు పుట్టిన వాళ్లను జెనరేషన్ ఆల్ఫా అంటున్నారు. ఈ మిలీనియల్స్ ప్రపంచాన్ని బాగానే గమనిస్తూ వచ్చారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ పై సెప్టెంబర్ 11న జరిగిన దాడుల్ని చూశారు. ఇరాన్-ఇరాక్ యుద్ధాన్ని చూశారు. వీటన్నింటికి ఇంటర్నెట్ విస్తరణ ఎంతగా ఉపయోగపడిందో కూడా చూశారు.

రానున్నది జెనరేషన్ ఆల్పా...

ఇంకో పదేళ్లలో రాబోయేది జెనరేషన్ ఆల్పా. 2010 నుంచి 2024 మధ్య పుట్టిన వాళ్లను ఈ తరంగా పిలవబోతున్నారు. రిమోట్ క్లాసులు, సర్వీసుల్ని స్ట్రీమింగ్ చేయడం, చిన్నప్పటి నుంచే చేతుల్లో ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఒకటేమిటీ సర్వస్వం టెక్నికల్ పరికరాలతోటే ఉంటారు. నిజానికి ఇవన్నీ జనరలైజ్ చేసే సూత్రీకరణలే. వాస్తవానికి ప్రతి తరానికి వారి స్వంత అభిప్రాయాలు, విలువలు, ప్రవర్తనలు, భవిష్యత్తు ప్రణాళికలు ఉండనే ఉంటాయి.

జెన్-జీ ప్రత్యేక లక్షణాలు ఏమిటి?

జెన్-జీ లోనూ గణనీయమైన తేడాలు ఉన్నప్పటికీ కొన్ని సాధారణ లక్షణాలు ఇలా ఉంటున్నాయని సామాజిక వేత్తలు చెబుతున్నారు. అవి నిజమైన డిజిటల్ యుగానికి ఈ తరం ప్రతినిధులు. వీళ్లు మాట్లాడే భాష అంతా షార్ట్ కట్. (ల్యాప్ ట్యాప్ ను ల్యాప్ అన్నట్టుగా). అంతా ఆన్‌లైన్‌లో ఉంటారు. ఫోన్లే మాట్లాడుకుంటాయి. కార్లు మాట్లాడుకుంటాయి. వీళ్ల పని అంతా ల్యాప్ ట్యాపులు, కంప్యూటర్ల మీదనే సాగుతుంటుంది. షాపింగ్ మొదలు డేటింగ్ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే. చివరకు స్నేహితుల్ని కూడా ఫోన్లలోనే సంపాయించుకుంటుంటారు.

ఏదైనా వస్తు నాణ్యతను ఫోన్లలో అంటే ఆన్ లైన్ లోనే వాకబు చేస్తారు. సైట్‌లు, యాప్‌లు, సోషల్ మీడియా ఫీడ్‌ల మధ్య తిరుగుతారు. ప్రతి ఒక్కటి ఆన్‌లైన్ నెట్ వర్క్ లోనే నడిచిపోతుంటాయి. సోషల్ మీడియాతో పెరిగిన తర్వాత జెన్-జీ తమ ఆన్‌లైన్ సెల్ఫ్‌లను మునుపటి తరాల కంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నప్పటికీ వారి వారి వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కకుండా చూసుకోవాలనుకుంటారు గాని ఆన్ లైన్ లోకి వచ్చిన తర్వాత అది కుదరకపోవొచ్చునన్నది టెక్నోస్ మాట్. ఈ తరం వారు ఆసియా దేశాలలో ప్రత్యేకించి ఇండియాలో రోజుకు తక్కువలో తక్కువగా ఆరేడు గంటలు ఫోన్లలో గడుపుతారు.

Read More
Next Story