
దేశంలో అందరి కంటే ముందు జనగణమన పాడిన కాలేజీ ఏది?
మదనపల్లె జిల్లా ఏర్పాటువుతున్న సందర్భంగా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం
అది 1919 ఫిబ్రవరి 26. బుధవారం. సమయం రాత్రి 8.30.
మదనపల్లె బిసెంట్ థియోసాఫికల్ కాలేజీ ఆవరణలో సందడి
బుధవారం రాత్రి భోజనాల తర్వాత విద్యార్థులంతా కాలేజీ లివింగ్ రూంలో సమావేశమై సరదాగా అడుతూ పాడుతూ గెంతులేస్తూ గడపడం ఆనవాయితీ. ఆరోజు ప్రోగ్రాం ఆర్ట్ రూం కు మారిపోయింది,
ఆర్ట్ రూమ్ చాలా మంది విద్యార్థులతో నిండిపోయింది. అంతా అడుతున్నారు. పాడుతున్నారు. తన వంతు రాగానే ప్రిన్సిపల్ జేమ్స్ హెన్రీ కజిన్స్ తన మాతృభాష ఐరిష్ లో పాట పడారు. అదిగో సరిగ్గా అదిపూర్తవగానే హాలు తలుపుతెరుచుకుంది. అంతా అటువైపు తిరిగారు. ఎదురుగా మహర్షి లాగా మెరిసిపోతున్న ఒక ఎత్తయిన వ్యక్తి నిలబడుకుని ఉన్నాడు, ఆయనెవరో అక్కడ అందరికి తెలుసు. ఆయన 25వ తేదీన కాలేజీకి వచ్చాడు. జబ్బు నుంచి అపుడే కోలుకోవడంతో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే, ఈ ఆటపాటల సందడి విని తన కాటేజీ నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అనుకోని అతిధి ప్రత్యక్షం కావడంతో అంతా అవాక్కయ్యారు,
‘నేనూ ఒక పాట పాడతా,’ అన్నాడు. పిల్లలంతా చప్పట్లు కొట్లారు. ప్రిన్సిపల్ కజిన్స్ అలా చూస్తూ ఉండిపోయాడు. వద్దు, మీకు ఆరోగ్యం బాలేదు, అని వారించలేకపోయాడు.
వచ్చిన మహర్షి తన పాట పాడాడు. అందులోనుంచి సమస్త భారత దేశ ప్రాంతాలు, ప్రజలు, మతాలు నదులు,... దూకి వచ్చి కళ్ల ముందు నిలబడ్డాయి.
ఆ పాట ఎమిటో ఎవ్వరికి తెలియదు. అంతకు ముందు ఎపుడూ ఎక్కడా వినలేదు.
పాట ఆగిపోయింది. విద్యార్థులంతా తేరుకునేందుకు కొంతటైం పట్టింది. అందరిని మంత్రముగ్గులను చేసిన ఆ పాటే జనగణమన.... ఆ వచ్చిన వ్యక్తి విశ్వకవి రవీంధ్రనాథ్ ఠాగూర్.
భారతదేశానికి కంటే జనగణమన జాతీయ గీతం తొలిసారి వినే భాగ్యం మదనపల్లె బిటి కాలేజీ విద్యార్థులకు దక్కింది. తన జాతీయ గీతాన్ని ఠాగూర్ తొలి సారి జనం మధ్యకు తెచ్చింది కూడా మదనపల్లెలోనే. అంతేకాదు, తొలిసారి జనగణమణ రాగయుక్తంగా బృందగానమయింది కూడా ఈ కాలేజీలోనే. అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు ఇది తమ భాష గేయమని భావించే ఈ బెంగాలీ గేయం ఇంగ్లీష్ లోకి అనువాదమయింది కూడా బిటి కాలేజీలోనే. అంతేకాదు, ఆ గేయానికి సంగీతం కూర్చింది కూడా ఇక్కడే. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు అందిస్తే, ప్రిన్సిపాల్ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ దానిని లయబద్దం చేశారు. కజిన్స్ ఐరిస్ లో బాగా పేరున్న కవి, జర్నలిస్టు, రచయిత, సంఘ సేవకుడు. ఆయన భార్య పాశ్చాత్య సంగీతంలో దిట్ట. జనగణమన స్వరకల్పన చేసేందుకు జరిగిన ఈ ముగ్గురి కలయిక మదనపల్లె చరిత్రకు వన్నె తెచ్చిన చారిత్రక ఘట్టం.
మార్గరెట్ కజిన్స్
ఇపుడు జేమ్స్ హెన్రీ కజిన్స్ గురించి నాలుగు ముక్కలు
అనీబిసెంట్ లాగే జేమ్స్ హెన్రీ కజిన్స్ కూడా ఐర్లండ్ దేశస్థుడే. ఆయన గొప్ప కవి.నాటక రచయిత, అర్ట్ క్రిటిక్, జర్నలిస్టు, ఉపాధ్యాయుడు. ఐరిష్ ఆధునిక కవితా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. కజిన్స్ ఎంత గొప్ప కవి అంటే ఒక దశలో ఆయనపేరును ఠాగూర్ నోబెల్ బహుమతికి సిఫార్సు చేశారు. కజిన్స్ కూడా అనీబిసెంట్ దివ్యజ్ఞాన సమాజంతో ప్రేరణపొందినవాడే, ఆమె ఆహ్వానం మేరకు కజిన్స్ ఐర్లండ్ ను వదిలేసి 1915లో భారతదేశానికి వలసవచ్చారు. మొదట అనిబిసెంట్ స్థాపించిన పత్రిక ‘న్యూ ఇండియా’కు సాహిత్య సంపాదకుడి ఉన్నారు. ఆయన భార్య మార్గరెట్ పాశ్చాత్య సంగీతంతో పాటు భారతీయ , ఇతర ఆసియా దేశాల సంగీతం మీద పుస్తకాలు రాశారు.
మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉండే విశ్వమానవ ప్రేమయే కజిన్స్ ని ఠాగూర్ దగ్గరకు చేర్చింది. 1915 లో భారతదేశానికి రాకముందే వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. భారత్ వచ్చాక 1916 కజిన్స్ భార్యతో కలసి కలకత్తా వెళ్లి టాగోర్ ను కలిశారు. మదనపల్లె కాలేజీకి వచ్చాక, టాగోర్ ను బిటి కాలేజీకి ఆహ్వానిస్తూ అనేక సార్లు ఉత్తరాలు రాశారు. అనేక వాయిదాల తర్వాత టాగోర్ 1919లో మదనపల్లె యాత్రను నిజం చేశారు. “ఈ సారి మదనపల్లిలో నేను మిమ్మల్ని ఏదిఏమైనా కలుసుకుంటాను. మీ మద్రాసు ప్రెశిడెన్సీ నాకోసం ఎదురుచూస్తున్నదని తెలసి నా హృదయం తల్లడిల్లి పోతున్నది. దక్షిణం యాత్ర చేసేందుకు నా శక్తి నంతా కూడదీసుకుంటున్నాను. మా బెంగాలీలో దక్షిణ ద్వారం మృత్యు ద్వారం. అది నన్ను కభళించదనుకుంటున్నా. అయితే, ఒక విషయం, మదనపల్లెకు వస్తానన్న నా హామీని మరీ సీరియస్ గా తీసుకోవద్దు. చాణక్యుడు మహిళలను, రాజులను నమ్మవద్దన్నాడు. నిజానికి ఆ జాబితాలో పైన చేర్చాల్సిన పేరు కవులది,” అని కజిన్స్ కు ఒక లేఖ రాస్తూ టాగోర్ చమత్కరించాడు.
ఠాగూర్ వాగ్దానం నిలబెట్టుకున్నారు. 1919 ఫ్రిబవరి 25న ఆరోగ్యం బాగా లేకున్నా బెంగుళూరునుంచి రైలులో ఆయన మదనపల్లె వచ్చారు. రైల్వే స్టేషన్ లో ఆయన్ని కజిన్స్ దంపతులు, మదనపల్లె సబ్ కలెక్టర్ ఇతర పెద్దలు ఠాగూర్ కు స్వాగతం పలికారు. ఆయన సబ్ కలెక్టర్ కారులోనే బిటి కాలేజీకి వచ్చారు. కారు దిగాక ఆయను విద్యార్థులు, సౌట్స్ బారులు తీరి స్వాగతం పలికారు. ఆయన అక్కడి ఓల్కాట్ బంగాళాలో బస చేశారు. కర్నల్ హెన్రీ స్టీల్ ఓల్కాట్ పేర ఈ బంగాళ నిర్మించారు. ఓల్కాట్ ధియోసాఫికల్ సొసైటీ ఏర్పాటులో అనిబిసెంట్ కు సహకరించారు. 1915లో బిటి కాలేజీ ఏర్పాటయింది. అప్పటి మద్రాసు గవర్నర్ లార్డ్ ఫెంట్ లాండ్ కాలేజీని ప్రారంభించారు.
ఇపుడు మళ్లీ జనగణమన లోకి వద్దాం.
ఆ బుధవారం రాత్రి అర్ట్ హాల్లో అలుముకున్న నిశబ్దంలో ఠాగూర్ మెల్లిగా మంద్రస్వరంలో పాడినా, ఒక పాదం వినేసరికి అందరి చెవులు నిక్క బొడుచుకున్నాయి. రెండో పాదం వినేసరికి ఆవేశం ఆవరించింది. గొంతు గద్గదమయింది. మళ్లీ పాడాలాన్నారు. ఆయన పాడారు. మళ్లీ పాడారు. తర్వాత అంతా గొంతుకలిపారు. అదొక బృందగానమై హాల్లో మార్ర్మోగింది.
మరుసటి రోజు గేయానికి ఠాగూర్ స్వరాలు అందించారు. వాటి ఆధారంగా మార్గరెట్ కజిన్స్ బాణీ సమకూర్చి గేయాన్ని శాశ్వతీకరించారు. ఆయనే కాలేజీలో విశ్రాంతి తీసుకుంటూ పాటని ఇంగ్లీష్ లోకి అనువదించారు. ఇంగ్లీష్ అనువాదం ప్రతిని కాలేజీలో భద్రపరిచారు. దానికి భారతీయ సుప్రభాతం గీతం , అంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా టాగోర్ పేరు పెట్టారు. “ఆరోజు రాత్రి మాయింటి వెనక రావిచెట్టు కింద కూర్చుని ఆయన తన బెంగాలీ గీతాన్ని, దాని ఇంగ్లషు అనువాదాన్ని పదే పదే పాడి వినిపించారు. మేమంతా జంకులేకుండా పాడేదాకా ఆయన మాతో అభ్యాసం చేయించారని జేమ్స్ హెన్రీ కజిన్స్ తన We Two Together అనే పుస్తకంలో రాశారు. తర్వాత కాలేజీలోని బిసెంట్ హాలులో పాఠశాల కాలేజీ విద్యార్థులు, టాగోర్ ను చూసేందుకు వచ్చిన సందర్శకులు ఈ పాటని తొలిసారిగా బహిరంగంగా పాడారు. అలా బిటి కాలేజీ జనగణ మన గేయాన్ని రాగయుక్తంగా గానం చేసిన తొలి కాలేజీ అయింది.
ఠాగూర్ కాలేజీలో బస చేసిన సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. ఒక రోజు రాత్రి ఆయన రాసిన ‘శాక్రిపైస్’ నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించాల్సి ఉంది. తీరా ప్రదర్శన మొదలయ్యే ముందు పక్కనున్న గ్రామంలో పెద్ద అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. మంటలార్పడంలో శిక్షణ పొందిన కాలేజీ స్కౌట్స్ ను అక్కడికి పంపాల్సి వచ్చింది. దానితో నాటకం వాయిదాపడింది. మార్చి 2 వ తేదీన ఆయన మద్రాసు వెళ్లిపోయారు. వెళ్లిపోతూ ఆయన బిటికాలేజీని దక్షిణ భారత శాంతినికేతన్ అని వర్ణించారు.
బిటి కాలేజీ ఏర్పాటుకు మదనపల్లెను ఎంచుకోవడం వెనక ఈ ప్రాంతపు వెనకబాటు తనం పట్ల అనీబిసెంట్ కు ఉన్న ఎనలేనిసానుభూతి యే కారణం. 1915 కు యాభైయేళ్ల కాలంలో మదనపరిసరాలన్నకరువులో మలమల మాడిపోయాయి. ఈ ప్రాంత మహాకరువుల్లో వేలాది మంది ఆకలితో, జబ్బులతో చనిపోయారు. ఒక్కొక్కసారి కరువు వస్తే రెండేళ్ల దాకా పోయేది కాదు. కరువు పోతూనే విపరీతంగా వర్షాలు వచ్చి చెరువులన్నీ తెగిపోయేవి. మదనపల్లెను కలుపుతూ పరిసర గ్రామాలకు పట్టాణాలకు రోడ్లు వేసేపనులు చేపట్టి నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉపాధి కల్పించేంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు కులమతాలకు అతీతంగా విద్యఅందిందేందుకు బిటి కాలేజీ ప్రారంభించారు. కాలేజీని మద్రాసు యూనివర్శిటికి అనుబంధం చేశారు. అయితే, అనీబిసెంట్ బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నురని భావించి కాలేజీని మద్రాసు విశ్వ విద్యాలయం నుంచి తొలగించారు. తర్వత దానిని రవీంద్రనాథ్ ఠాగూర్ కులపతి ఉన్నా నేషనల్ యూనివర్శిటీకి అనుబంధం చేశారు.
అయితే, ఇపుడ బిటి కాలేజీని ఒక చారిత్రక జ్ఞాపకంగా తీర్చి దిద్దే ప్రయత్నాలేవీ జరిగలేదు. కాలేజీ అన్ని రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లాగానే తయారయింది. దీన్ని ఒక మహోన్నత కళాశాలాగా మార్చే ప్రయత్నం జరిగినట్లు కనిపించదు.

