
'హనుక్కా' పండగ కథ ఏమిటీ, యూదులకు ఎందుకంత ప్రాధాన్యత?
హీబ్రూ భాషలో హనుక్కా లేదా చనుక్కా అని కూడా పిలుస్తుంటారు..
ఆస్ట్రేలియా సిడ్నీ బాండీ బీచ్ లో ఇసుక ఎర్రబారింది. దుండగులు కొందరు- యూదులు సంప్రదాయంగా నిర్వహించుకునే హనుక్కా పండగపై తూటాల వర్షం కురిపించారు. దాదాపు డజను మంది తుపాకీ గుళ్లకు నెలకొరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ ఘటన యూదుల ప్రార్థనా స్థలం సమీపంలో జరగడంతో, ఒక్కసారిగా అంతర్జాతీయ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఒక పేరు ఎక్కువగా వినిపించింది.. అదే హనుక్కా.
ఇంతకీ ఏమిటీ హనుక్కా?
తెలుగులోనూ ఈ Hanukkah పండుగ ఏమిటనే దానిపై గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో మోతమోగుతోంది. యూదుల పండుగ హనుక్కా ప్రాముఖ్యత ఏమిటి? అంటూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అసలు హనుక్కా అంటే ఏమిటి? ఎందుకు దీన్ని వెలుగుల పండుగ అంటారు?
భారతీయ సమాజానికి బాగా తెలిసిన వెలుగుల పండుగ దీపావళి. సరిగ్గా అలాంటిదే యూదులకు హనుక్కా. వాళ్లకది వెలుగుల పండుగ. యూదు మతానికి చెందిన ముఖ్యమైన పండుగ. హీబ్రూ భాషలో హనుక్కా లేదా చనుక్కా అని కూడా పిలుస్తుంటారు. దీనర్థం “పునరంకితం”.
ఇదీ పునరంకితం కథ..
సుమారు 2,200 సంవత్సరాల కిందట జరూసలేంలో యూదుల ప్రార్ధనా స్థలాన్ని విదేశీయులు ఆక్రమించుకున్నారు. దాన్ని విముక్తం చేయడం కోసం యూదుల్లోని యోధులు కొందరు- విదేశీయులను పారదోలి తిరిగి తమ ప్రార్ధనా స్థలాన్ని స్వాధీనం చేసుకుని పవిత్రంగా అంకితం చేసినట్టు ఓ కథ ప్రచారంలో ఉంది. యూదు యోధులు ఆ ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు అక్కడ వత్తులు వెలిగించడానికి నూనె చాలా తక్కువగా ఉన్నప్పటికీ, దానితో మెనోరాను (మెనోరా అనేది 7 దీపాలున్న దీపస్తంభం) వెలిగించారు.
తాల్మూద్ (యూదుల మత, సామాజిక మార్గదర్శక గ్రంథం) ప్రకారం, ఆ కొంచెం నూనెతోనే 8 రోజుల పాటు వత్తులు కాలి వెలుగులు ఇచ్చాయి. అందుకే ప్రతి రాత్రి దీపం వెలిగించే సంప్రదాయం ఏర్పడింది. నూనెలో వండే ఆహార పదార్థాలు, ముఖ్యంగా ఆలుగడ్డతో చేసే లాట్కెస్ అనే పిండి వంటకం ఈ పండుగలో ప్రత్యేకం.
తేదీలలో మార్పులు ఎందుకు వస్తాయి?
హనుక్కా ఎప్పుడూ యూదుల క్యాలెండర్‌లోని కిస్లేవ్ నెల 25వ రోజున ప్రారంభమవుతుంది. కిస్లేవ్ అనేది హీబ్రూ క్యాలెండర్‌లో 9వ నెల. ఇది సాధారణంగా నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మధ్యలో వస్తుంది. ఈ నెలలోనే ముఖ్యమైన హనుక్కా (Hanukkah) పండగ జరుగుతుంది. కిస్లేవ్‌ను చీకటి కాలంలో వెలుగు నెలగా భావిస్తారు.
యూదుల క్యాలెండర్ చంద్రగమనంపై ఆధారపడింది కావడంతో మనం మామూలుగా ఉపయోగించే గ్రెగోరియన్ క్యాలెండర్‌తో (ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అధికారికంగా ఉపయోగిస్తున్న క్యాలెండర్ విధానం) సరిపోదు. అందువల్ల హనుక్కా కొన్నిసార్లు నవంబర్ చివర్లో, మరికొన్ని సార్లు డిసెంబర్ చివర్లో వస్తుంది.
ఈ సంవత్సరం హనుక్కా ఆదివారం, డిసెంబర్ 14 సాయంత్రం ప్రారంభమై డిసెంబర్ 22 వరకు కొనసాగుతుంది. నిజానికి హనుక్కా యూదుల పండుగల్లో పెద్దదేమీ కాదు. కానీ క్రిస్మస్ సమయానికే ఇది రావడంతో, సాంస్కృతికంగా దీని ప్రాధాన్యం పెరిగింది.
చీకటిలోకి వెలుగు తీసుకురావడం చిన్న ప్రయత్నమే అయినా దాన్ని ఓ పెద్ద సంస్కరణ (రిఫార్మ్)గా యూదుల్లోని అన్ని వర్గాలు గుర్తిస్తాయి. గుర్తు చేసుకుంటుంటాయి.
ప్రతికూల పరిస్థితుల్లో చేసిన పని చిన్నదా పెద్దదా అనే దాంతో సంబంధం లేకుండా మార్పు తీసుకు రాగలదనే సందేశం హనుక్కాలో దాగి ఉంది. దీపాలు వెలిగించే క్రమంపై తాల్మూద్‌లో వాదనలు ఉన్నప్పటికీ, సాధారణంగా మొదటి రోజు ఒక దీపం వెలిగించి, ప్రతి రోజు ఒకటి చొప్పున పెంచుతూ, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మెనోరాలో దీపాలను కుడి నుంచి ఎడమకు అమర్చినా, వెలిగించేది ఎడమ నుంచి కుడికి- అంటే కొత్తగా పెట్టిన దీపంతోనే మొదలు పెడతారు.
హనుక్కా మెనోరాలో 8 వత్తులు వెలిగించేలా దిపస్తంభాలు ఉంటాయి. వాటిని వెలిగించడానికి ఉపయోగించే అదనపు దీపాన్ని “షమాష్” అంటారు. సాధారణంగా నిజమైన మంట ఉన్న దీపాలనే ఉపయోగిస్తారు. అయితే ఆసుపత్రులు వంటి బహిరంగ ప్రదేశాల్లో భద్రత కోసం విద్యుత్ దీపాలను కూడా ఉపయోగిస్తారు. దానం చేయడం, వెలుగును పంచడానికి సూచికగా ప్రతి ఇంట్లో మెనోరాను వెలిగిస్తారు. దేవుని వెలుగు అందరికీ పంచాలనేలా తలుపు దగ్గర లేదా కిటికీ అంచున బయటకు కనిపించేలా ఉంచడం సంప్రదాయం.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో నగర వీధులు, పార్కులు, ప్రముఖ ప్రదేశాల దగ్గర కూడా పెద్ద మెనోరాలను వెలిగించడం సాధారణమైంది. దీపాలు వెలిగించడం మాత్రమే కాదు- దానం చేయడం, సామాజిక సేవలు చేయడం కూడా హనుక్కా వేడుకల్లో ముఖ్య భాగం. ప్రపంచాన్ని అందరికీ అనువైన ప్రాంతంగా మార్చడానికి దేవుడు యూదు ప్రజలను పిలిచాడనే నమ్మకాన్ని ఈ వేడుక ప్రతిబింబిస్తుందని నమ్ముతారు.
దీన్ని వ్యతిరేకించే వారూ ఉన్నారు. అది వేరే కథ.
ఆస్ట్రేలియా ఘటన నేపథ్యంలో యూదుల ప్రార్థనలు, హనుక్కా వేడుకల భద్రతపై చర్చ జరగడంతో ఈ పండుగ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. దాంతో సహజంగానే తెలుగు పాఠకుల్లోనూ ఆసక్తి పెరిగింది.
Next Story

