
తిరుపతి జనావాసాల్లోకి చిరుత పులులు ఎందుకు వస్తున్నాయి?
తిరుమల అడవిలో ఉండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? పశుసంవర్ధక శాఖ, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం. గోవిందరాజ భాస్కర్ ఏమంటున్నారంటే...
డా. ఎమ్ గోవిందరాజ భాస్కర్
శేషాచలం బయోస్ఫియర్ (Seshachalam Biosphere) రిజర్వులో చిరుతపులు(Leopard - Panthera pardus) లపై అధికారిక గణన జరగకపోవడం వలన చిరుతపులుల ఖచ్చితమైన సంఖ్య తెలియదు. అయితే, అటవీ శాఖ అంచనాల ప్రకారం, ఈ ప్రాంతంలో సుమారు 70 నుండి 90 వరకు చిరుతపులులు నివసిస్తున్నాయని భావిస్తున్నారు. తూర్పు కనుమలలో భాగంగా వున్న శేషాచలం బయోస్ఫియర్ రిజర్వు లో శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ (Sri Venkateswara National Park) ఉంది.
సుమారు 4,755.997 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి వున్న శేషాచల రిజర్వు అడవులలోని కోర్ ప్రాంతం లో ఉండవలసిన చిరుత పులులు ఈ మధ్య తరచుగా మనుషుల నివాసల వద్ద తచ్చాడుతున్న వార్తలు తరచుగా వింటున్నాము. దీనికి కారణాలమేమిటి?
1.డిఫారెస్టేషన్ (Deforestation) వలన చిరుతపులులు సహజ ఆవాస నష్టం, పట్టణీకరణ, మరియు వ్యవసాయ విస్తరణ వల్ల చిరుతపులుల సహజ వాతావరణం తగ్గిపోతుంది. ఈ కారణంగా, అవి ఆహారం మరియు ఆశ్రయం కోసం మనుష్యుల ఆవాసాల వైపు కదులుతున్నాయి.
2.ఇష్టమైన ఆహారం కొరత – జింకలు, అడవి పంది కోతులు లాంటి వన్యమృగాలు , శేషాచల పర్వత పాదాల చెంత వున్న పలు యూనివర్సిటీస్ మెస్ లలో లభ్యమయ్యే పడవేసిన సులభ ఆహారాలకి అలవాటు పడి, వీటి చుట్టుపక్కల స్థిరనివాస మేర్పరుచుకొని ఇక్కడే ఉండటంతో , వాటిని వెదుక్కుంటూ చిరుతపులులు కూడా రావడంతో తరచుగా వాటిని చూస్తున్నాము.
3.సులభంగా ఆహారం లభించే ప్రాంతాల అన్వేషణ. అడవుల చుట్టూ పక్కన వున్న గ్రామాలలో మనుషులు పాడి పశువులను పెంచడం, వ్యర్థ ఆహారాన్ని పారవేయడం చేస్తుంటారు. వీటిని తినేందుకు వీధి కుక్కలు ఎక్కువగా రావడం వల్ల చిరుతలు వాటిని వెదుక్కుంటూ మనుషుల నివాస ప్రాంతాలకు ఆకర్షితమవుతాయి.
4.నీటి కొరత మరొక కారణం – వేసవి కాలంలో సహజ నీటి వనరులు తగ్గిపోవడం వల్ల చిరుతలు నీటి కోసం మనిషి నివాస ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది.
5.అగ్ని ప్రమాదాల వలన అటవీ విధ్వంసం, వాతావరణ మార్పులు: అరణ్యాల్లో తరచు జరుగుతున్న అగ్ని ప్రమాదాల వలన సంభవించిన వాతావరణ మార్పులు చిరుతపులుల సహజ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. అక్కడ అవి అభద్రత అనుభవిస్తున్నాయి. అందువల్ల అవి సురక్షితమైన, తగినంత ఆహారం ఉన్న ప్రాంతాల వైపు వెళ్లేలా చేస్తున్నాయి .
మనుషులు చిరుతపులు దాడులను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు:
1. సామాజిక అవగాహన & జాగ్రత్తలు: చిరుతలు సహజంగానే మనుషులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతాయి, వాటిని మనమే ప్రేరేపిస్తే తప్ప దాడి చేయవు, కావున వాటి కదలికలను గుర్తించి మనమే దూరంగా ఉండాలి .
2. చిరుతలు ప్రధానంగా రాత్రిపూట చురుకుగా ఉంటాయి. ఎక్కువగా రాత్రిపూట తమ ఆహారాన్ని వేటాడతాయి. కాబట్టి చిరుతల సంచారం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు రాత్రివేళ ఒంటరిగా తిరగకూడదు. ఒక వేళ బయటకు వెళ్లాల్సి వస్తే టార్చ్ లైట్స్ ఖచ్చితంగా తీసుకెళ్లాలి.
3. పిల్లలను నిర్లక్షంగా ఒంటరిగా వదలకూడదు.
4. పశువులను రాత్రిపూట భద్రంగా కట్టుబట్టి ఉంచాలి .
చిరుతలను ఆకర్షించే ఆహార వనరులు అయిన కుక్కలను, పిల్లులను కేజ్ లలో ఉంచి సంరక్షించుకోవాలి , తెరిచి ఉన్న చెత్తకుండీలను తొలగించాలి.
హింసాత్మకం కాని నివారణ పద్ధతులు
కాంతి, శబ్దాలు: మోషన్-సెన్సార్ లైట్లు, పెద్ద శబ్దాలు చిరుతలను భయపెడతాయి.
కంచెలు: గొర్రెలు లేదా మేకలను పెంచేవారు దొడ్డి చుట్టూ బలమైన, పొడవైన కంచెలు ఏర్పాటుచేసుకోవడం మూలానా చిరుతల ప్రవేశాన్ని అడ్డుకోవచ్చు.
కాపలా కుక్కలు: ప్రత్యేకంగా శిక్షణ పొందిన కుక్కలు చిరుతలను దూరంగా ఉంచుతాయి.
చట్టపరమైన, నైతిక అంశాలు
చిరుత, మనిషి సంఘర్షణ గురించి బాలపల్లి రేంజ్ ఆఫీసర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమయిన విషయాలు వివరించారు. “చిరుతపులి భారత దేశంలో రక్షిత జాతి (Protected Animal) వాటిని గాయపరిచిడం లేదా చంపడం చట్టరీత్యా శిక్షార్హం. కావున చిరుతపులులు సంచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలుపాలి. వారు వన్యప్రాణి సంరక్షణ అధికారుల సాయం తో చిరుతలను భద్రంగా బంధించి, బహుదూర ప్రాంతాలకు తరలిస్తారు. దీనికి ప్రజలు సహకరించాలి,” అన్నారు.