తెలంగాణ ఉద్యమ ఆశాయాలు... భ్రమయా లేక వాస్తవమా
x

తెలంగాణ ఉద్యమ ఆశాయాలు... భ్రమయా లేక వాస్తవమా

ఆశయాలు చెవికి ఇంపైనా నినాదాలు అవుతాయి. ఉద్యమాన్ని రగిలిస్తాయి. త్యాగాలకు వుసి కొల్పుతాయి. ఉద్యమాలు నెరవేరాకా ఆశయాలేమవుతాయి? తెలంగాణ కథ తిరగేయండొకసారి


--రమణా చారి


ఈన కాచి నక్కల పాలు చేసిన కథ!

ఇది కథ కాదు. జరిగిన వాస్తవాల చిత్రణ . తెలంగాణ ప్రత్యేక రాష్ట్రo ఏర్పడి దశాబ్ద కాలం దాటింది. ప్రజల స్థితిగతుల విషయంలో పెద్ద మార్పు ఏమి లేదు. ప్రజల ఆశలు, డిమాండ్లు, ఉద్యమకారుల ఆకాంక్షలు మాత్రం అలాగే మిగిలిపోయాయి. ఓట్లు దండుకునేందుకు మాత్రమే రాజకీయ పార్టీలు నినాదాలుగా వాడుకుంటున్నాయి . తరువాత పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉండిపోతుంది. ఆ

చారిత్రాత్మక తెలంగాణ విద్యార్థి ఉద్యమం (1969), తరువాత చరిత్రను తెలియజేసేందుకు ఏర్పడినది తెలంగాణ స్టడీ సర్కిల్. త్యాగాలతో గాయాలతో , నిత్య నిర్బంధంలో ముందుకు సాగిన తెలంగాణ మహాసభ, తెలంగాణ జన సభ (1997-98). రాజకీయ ద్రోహానికి బలికాకుండా ప్రజా సంఘాల కూటమితో ఏర్పడిన తెలంగాణ ఐక్యరాచరణ కమిటీ (1996), టఫ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ (2010) ఉద్యమాన్ని ఊరకలెక్కించాయి.


ఈ ప్రాంత ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారమైన ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష మరుగున పడిపోయింది. ప్రజా సంఘాల చరిత్రలను కనుమరుగు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సకలజనుల సమ్మె,సాగర హారాలు, మిలియన్ మార్చ్, వంటావార్పు, ఆటపాట, ధూమ్ ధామ్, ధర్నాలు, నిరాహార దీక్షలు, బందులు, రాస్తారోకోలు ఇలా పోరాట రూపాలు ఎన్నో.

నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడారు..ఉద్యమ కాలంలో పోలీసుల కాల్పులలో చనిపోయారు. రాజ్య హింసకు బలయ్యారు. తీవ్ర నిర్బంధానికి, అణిచి వెతకు గురయ్యారు. బలిదానాలకు బలయ్యారు. అక్రమ కేసులలో ఇరికించబడ్డారు. అన్ని సమస్యలను ఎదుర్కొంటూ ప్రజలను చైతన్యపరిచారు. ఊరు వాడలను ఉప్పెనలా కదిలించారు. రాజకీయ పార్టీలు అన్నింటిని ఒక తాటి పైకి తీసుకొచ్చారు. ఆత్మగౌరవ పోరాటంలా, స్వీయ పాలన కోసం తెగించి పోరాడారు.ఉద్యమాలను గల్లీలో రగిలించి,ఢిల్లీ పాలకులను వణికించారు. తప్పనిసరిగా పార్లమెంటులో బిల్లు పెట్టేలా చేసి, ఆమోదింప చేశారు.


అమరుల త్యాగ ఫలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేలా ఒప్పించ గలిగారు. తెలంగాణ ఉద్యమకారుల చైతన్యాన్ని, త్యాగాల చరిత్రను దేశ ప్రజలను ఆదర్శంగా నిలిపారు. ఇంతలా పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, భౌగోళికంగా ఏర్పడినా,ప్రజల భౌతిక పరిస్థితులలో మార్పు రాలేదు. పాలకుల సాచివేత ధోరణి అందుకు ప్రధాన కారణం. ఇప్పటికీ పాలకులు ఉద్యమకారుల ఉసెత్తక పోవడం శోచనీయం.

ఉద్యమకారుల ప్రధాన డిమాండ్లు : 1)తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యాంశాలలోబోధన అంశంగా చేర్చాలి. 2) మేధావులు, ఉద్యమకారులతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలి. 3) విద్యారంగ బలోపేతానికి నిధులు కేటాయించి, ప్రైవేటు విద్యా సంస్థలను అరికట్టాలి 4) ఉద్యమ కారులను రాష్ట్ర సాధన సమరయోధులుగా గుర్తించాలి. 5) ఉద్యమకారులపై మోపిన అక్రమ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలి. 6) ఉద్యమ కాలంలో నిజాయితీగా పాల్గొని అరెస్టఅయినా, కాకపోయినా( కేసులు,జైలు లేని ) ఉద్యమకారులందరినీ కూడా గుర్తించి సముచిత గౌరవం అందించాలి.


రాజకీయ పార్టీలు గాని, పాలకులు గాని ఉద్యమాల, ఉద్యమకారుల ఊసు లేకుండా కాలయాపన చేస్తున్నారు. కుంభకర్ణుడి నిద్ర నటిస్తున్న పాలకులను, ఉద్యమ కార్యాచరణ చైతన్య అంకుశం తో మేలుకొలపాల్సిన పరిస్థితి ఏర్పడింది.మాఫియా వనరుల దోపిడీ నుండి రక్షణకు, ప్రభుత్వ రంగ సంస్థలు తెరిపించేందుకు,నిరుద్యోగ సమస్య నుండి విముక్తి కోసం, రైతన్న సమస్యలు,విద్యా ఉద్యోగ రంగ సమస్యలు,సింగరేణి రక్షణకు, కేంద్ర -రాష్ట్ర ప్రభుత్వాల వాగ్దానాల అమలుకు, పౌర,ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలే శరణ్యం. తెలంగాణలో ప్రజాస్వామ్యం పరిఢమిల్లాలంటే,చిత్తశుద్ధితో కూడిన విశాల ఐక్య ఉద్యమాల నిర్మాణం కార్యాచరణ అనివార్యం. పాలకుల వాగ్దానాలు ఎండమావులైన వేళ, అమరుల స్ఫూర్తి ని ఎత్తిపడుతూ, మన భవిష్యత్తును మనమే నిర్మిoచుకుందాం.ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ముందుడుగేయాలి.

Read More
Next Story