ఆంధ్రా 'సినిమా చెట్టు' కూలింది, బాలివుడ్ 'బరేలీ జుంకా' నిలబడింది
వాళ్లకి మనకి ఎంత తేడా? ఉత్తర ప్రదేశ్ లో హిందీ వాళ్లు పాటకి స్మారక స్తూపం కట్టి సజీవం చేసుకున్నారు,తెలుగు వాళ్లు తెలుగు సినిమా సజీవ స్యాక్షాన్ని కాపాడుకోలేక పోయారు.
ఈ రోజు పొద్దునే పేపర్లో ఒక చెట్టు కూలిన వార్త చూశా.
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం దగ్గర గోదారి గట్టు మీద ఉన్న చెట్టొకటి నేలకు ఒరిగింది.
చెట్టు కూలడం, చెట్టుని కూల్చడం పెద్ద చావు వార్తేం కాదు ఇక్కడ.
అయితే, 150 సంవత్సరాల ఈ గోదారి చెట్టు విచిత్రమయింది.
దీన్నక్కడ సినిమా చెట్టు అని పిలుస్తారు.
ఈ చెట్టు 1964లో వచ్చిన మనసు మాంగల్యం మొదలుకుని ఇప్పటిదాకా 300 సినిమాల్లో ఏదో ఒక సన్నివేశంలో కనిపించిందట.
కూలిపోయే దాకా ఈ చెట్టు గురించి లోకల్ గా తప్ప బయటి ప్రపంచానికి పెద్దగా ఎవరికీ తెలియదు.
ఈ చెట్టుని కాపాడుకోవాలని సినిమా వాళ్లు అనుకున్నట్లు లేదు. ప్రభుత్వం ఆవిషయం పట్టించుకోలేదు. స్థానికులు ఆసక్తి చూపలేదు.
చెట్టుకూలాక లబోదిబోమంటున్నారు.
సినిమాలతో చాలా ప్రదేశాలకు అనుబంధం ఉంటుంది. వాటిని ప్రిజర్వు చేసి టూరిజం స్పాట్స్ గా చాలా రాష్ట్రాల్లో మార్చుకున్నారు.
హిందీ సినిమాల ల్యాండ్ మార్క్ లోకేషన్లను కాపాడుకోవడం బాగా జరుగుతున్నది.
కూమరదేవం సినిమా చెట్టు కూలిన వార్త చదవగానే నాకు బరేలీ జుంకా మెమోరియల్ గుర్తుకొచ్చింది.
ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జుంకా (నగ) స్మారక విగ్రహం ఏర్పాటు చేశారు.
2020 ఫిబ్రవరి నెల 4 న, నేషనల్ హైవే 24 పక్కన జీరో పాయింట్ దగ్గర, 18 లక్షల ఖర్చుతో 14 అడుగుల ఎత్తు గల కంచు జుంకా విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. రెండువందల కిలోల బరువున్న ఈ జుంకాకు రంగు రాళ్లు తాపడంచేసి, జరీ ఎంబ్రాయడరీతో అలంకరించారు. దాని డిజైను, నిర్మాణం ఆవూరి నిపుణులే చేసారు.
ప్రభుత్వనిధులు కాకుండా, సొంత విరాళాలతో ఏర్పాటు చేసిన ఈ జుంకాని అప్పటి కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ఆవిష్కరించారు. బరేలికి జుంకాకి 56 ఏళ్ళ పరలౌకిక అనుబంధం ఉంది. అది సినిమా నుంచి వచ్చిన అనుబంధం. ఒక పాట తెచ్చిన అనుబంధం. ఒక డ్యాన్స్ చుట్టిన అనుబంధం. ఆ ఫిబ్రవరిలో ఈ అనుబంధం ఒక ఆకారం తీసుకుని నిజంగా జుంకాగా ప్రత్యక్షమయింది. ఎంతో గొప్ప కళాభిమానం, ఊరి అభిమానం ఉన్నపుడే ఇలాంటిది సాధ్యమవుతుంది. ఇలాంటిది లేకనే సినిమా చెట్టు దిక్కులేనిచావు చచ్చింది.
నిజానికి బరేలికి జుంకాకు ఎలాంటి సంబంధంలేదు. అక్కడ ప్రత్యేకంగా జుంకాలేవీ తయారుకావు. అన్ని వూళ్లలోలాగే అక్కడా ఆభరణాల దుకాణాల్లో జుంకాలు దొరుకుతాయి అంతే. పైగా ఆవూరు దేనికైనా ప్రసిద్ధి అంటే, అది గాలిపటాలకు వాడే మాంజా దారానికి.
మరి ఈ జుంకా విగ్రహం కోసం ఆ పట్టణ ప్రజలు అర్దశతాబ్ధంగా ఎందుకు ఎదురు చూసారు? దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఒక సినిమా పాట ఉంది.
'మేరా సాయా' హిందీ సినిమా గుర్తుందా. 1966 లో విడుదలయింది. సునీల్ దత్, సాధనా జంటగా నటించారు. డైరెక్టర్ రాజ్ ఖోస్లా, సంగీతం మదన్ మోహన్. ఇందులో ‘సాధన’ చేత ఒక ఐటెం సాంగ్ చేయించారు. ఆ పాటే ‘జుంకా గిరారే బరేలీ కె బాజార్ మే’. (Jhumka Gira Re Bareli Ke Bazar Mein). జానపద స్టైల్లోని ఈ పాటకు దేశమంతా దరువేసింది విపరీతమైన ప్రజాదరణ వచ్చింది. సినిమాలో ఆపాట వచ్చినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు పువ్వులు, నాణేలు ఎగజల్లేవారట. ఈ పాటను రాజా మెహ్ది అలి ఖాన్ రాయగా, మదన్ మోహన్ బాణీ సమకూర్చారు, ఆశా భోంస్లే పాడారు. దర్శకుడు రాజ్ ఖోస్లా, నిర్మాత ప్రేమ్ జీ.
ఈ పాటలో 'బరేలిnకి బజార్ మే' అన్న మాట పల్లవి వచ్చిన ప్రతిసారీ బరేలి పేరుకూడా ప్రజల నాలుకలమీద డ్యాన్స్ చేసింది. బరేలీకి బాజార్ మే అంటూ రచయిత ఎందుకు బరేలీ పేరు పాటలో చేర్చారో ఎక్కడా సరైన వివరణ లేదు. అయితే, ఈ పాట పాపులర్ అయ్యాక చాలా మంది నిజంగానే బరేలీ జుంకాలు అనేవి ఉన్నాయనే అనుకున్నారని ఉత్తర ప్రదేశ్ కు చెందిన జర్నలిస్టు మిత్రుడొకరు చెప్పారు . బరేలి నగరానికి వెళ్లిన యాత్రికులు, బరేలిలో ప్రత్యేకమైన జుంకా తయారుచేస్తారనే భావనతో ఈ 'బరేలి జుంకా' గురించి అడగడం మొదలు పెట్టారని ఆయన చెప్పారు.
జుంకావల్ల తమ వూరికి అంత ప్రాచుర్యం వచ్చింది గాబట్టి కృతఙ్ఞతగా ఏదైనా చేయాలని అప్పుడే అనుకున్నారట. ఊర్లో ఒక జుంకా విగ్రహాన్ని ఏర్పాటు చేసి, జుంకాల మార్కెట్ పెంచుకుంటే బావుంటుందని నిర్ణయించుకున్నారు.
బరేలీ జుంకాలు విడుదలయ్యాయి. మెమోరియల్ కార్యరూపం దాల్చడం లేదు. ఎప్పటికప్పుడు బడ్జెట్ పెరిగి, విరాళాలు సరిపోక జుంకా విగ్రహం ఏర్పాటు జాప్యం అవుతూ వచ్చింది. మొత్తానికి అయిదున్నర దశాబ్దాల తర్వాత 2020 తర్వాత వాళ్ల కోరిక ఈడేరింది.
ఈ తరానికి ఈ పాట అసలు గుర్తుండక పోవచ్చు. అయితే, ఒక సినిమా పాట తమ వూర్లో సజీవం కావడం వాళ్లు చూశారు.
ఇలా తెలుగు వాళ్లు గోదారి గట్టున ఉన్న చెట్టును ఎందుకు కాపాడుకోలేకపోయారనేదే ప్రశ్న.
పల్లెటూరి వాళ్లైన ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన ప్రణయకలహం, ఆ కలహంలో బరేలి బజార్లో పడిపోయిన ఆమె జుంకా. ఈ విషయాన్ని ఆమె తరువాత తనవాళ్లకు సిగ్గుపడుతూ వివరిస్తుంది. ఇదీ పాట మెసేజ్.
దొంగలముఠాలోని మొరటు అమ్మాయి పాత్రలో, జానపద నృత్యం చేస్తూ, తన ప్రేమికుడితో జరిగిన ప్రణయకలహాన్ని ఒకేసారి గడుసుగా, అమాయకంగా వర్ణిస్తున్న హావాభావాలు చూపిస్తూ ఈ పాటలో నటించిన సాధనకు ఆ రోజుల్లో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అందుకే పాపులర్ పాటతో పెనవేసుకున్న తమ బరేలీ ఊరి పేరును కూడా శాశ్వతం చేసుకునేందుకు ప్రజలు ఈ ‘జుంకా’ ఏర్పాటు చేసుకున్నారు.
ఈ పాటలో బరేలీ మాటని కేవలం ప్రాస కోసమే కవి వాడాడని మా మిత్రుడు చెప్పాడు.
యాభైనాలుగేళ్ల కిందట జుంకా గిరారే పాటను నిషా తొణికిసలాడుతూ పాడిన ఆశా భోంస్లే గాయనిగా తారాస్థాయిని చేరడానికి ఈ పాట కూడా తోడ్పడిందని ఆయన చెప్పాడు.
ఈ పాటరాసిన రాజా మెహ్ది అలీ ఖాన్ (1928 - 1966) తక్కువ పాటలు రాసినా అప్పట్లో మంచిపాటలు రాసిన రచయితల్లో ఒకరు. ఆయన రాసిన పాటలు కొన్ని సూపర్ హిట్. ఆప్ కి నజరోంనె సంఝా (అన్ పడ్), లగ్ జా గలే, నైనా బర్సె (వో కౌన్ థీ), తు జహా జహా చలే (మేరే సయా) ఒకట్రెండు ఉదాహరణలు మాత్రమే. ఆయన ఎక్కువ సినిమాలు సంగీత దర్శకుడు మదన్ మోహన్ తో కలసి పనిచేసారు.
మూడుతరాల కింద ఒక కవి ప్రాసకోసం తమవూరి పేరు ఒక సినిమాపాటలో చేర్చితే, ఆ పాట హిట్టై దేశమంతా తమవూరి పేరు మార్మోగితే, అందుకు కృతఙ్ఞతగా ఒక చిహ్నాన్ని ఏర్పరుచుకోవాలనుకోవడం వూరి ప్రజల గొప్పదనం చెబుతుంది.
దాదాపు అదే సమయంలోనే కుమారదేవం చెట్టుకూడా సినిమాల్లో కనిపించింది. దీన్ని కాపాడుకోలేకపోయారు తెలుగోళ్లు.