సఫారీకి ఇదే బెస్ట్‌ టైం..

పిల్లలతో కలిసి జూ పార్క్‌కు వెళ్లడం సహజం. కాని ఎప్పుడైనా టైగర్‌ సఫారీకి వెళ్లారా? అవి ఎక్కడున్నామో తెలుసా? సెలవులు కలిసొస్తే.. ఈ ప్రాంతాలకు తప్పక వెళ్లండి.


సఫారీకి ఇదే బెస్ట్‌ టైం..
x
FILE

శేఖర్‌ రావు. నా బెస్ట్‌ ఫ్రెండ్‌. 1 నుంచి 10 తరగతి వరకు ఒకే స్కూల్‌లో చదువుకున్నాం. శేఖర్‌ తండ్రి హవాల్దార్‌. మిలిటరీలో పనిచేస్తారు. ఉద్యోగరీత్యా శేఖర్‌ ఫ్యామిలీ మధ్యప్రదేశ్‌కు షిప్ట్‌ అయిపోయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్‌లో మాట్లాడుకోవడం తప్ప కలిసింది లేదు. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్యనే నాకు ఫోన్‌ చేశాడు. తన కొడుకు పెళ్లికి ఖచ్చితంగా రావాలని. సెలవులు కూడా కలిసి రావడంతో ఎంపీ (మధ్యప్రదేశ్‌)కి వెళ్లాం. రైల్వే స్టేషన్‌ వచ్చి మమ్మల్ని రిసీవ్‌ చేసుకున్నాడు. భార్యపిల్లల్ని వాడికి పరిచయం చేశా. కార్లో వెళ్తూ..ఎంతో అప్యాయంగా మాట్లాడుకున్నాం. కబుర్లు చెప్పుకున్నాం. మర్నాడు పెళ్లి. ఘనంగా జరిగింది. ఇక తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. అరె అప్పుడే వెళ్తారా? 35 ఏళ్ల తర్వాత కలిశాం. మళ్లీ ఎప్పుడొస్తారో ఏమో.. అన్నట్లు చెప్పడం మరిచిపోయా.. ఇక్కడికి దగ్గర్లో టైగర్‌ పార్కు (Tiger Park) ఉంది. వెళ్లి సఫారీ చేసిరండి.. అంటూ తన బంధువొకరిని పిలిచి కారు తాళం చెవి ఇచ్చాడు. మేం కారులో బాంధవ్‌గర్‌ నేషనల్‌ పార్క్‌కు చేరుకున్నాం. అక్కడికి వెళ్లాక తెలిసింది ఇండియాలో ఉన్న టైగర్‌ సఫారీలో ఇదొకటని గైడ్‌ చెబితే తెలిసింది. ఉమారియా జిల్లాలో ఉన్న ఈ పార్కు గురించి మాకు చాలా విషయాలు చెప్పాడు.

‘‘దేశంలోని మిగతా టైగర్‌ (Tiger) జోన్లకంటే ఇందులో పులుల జనాభా ఎక్కువ. బాంధవ్‌ఘర్‌ చరిత్ర రామాయణంలో ముడిపడింది. బాంధవ్‌ అంటే సోదరుడు. ఘర్‌ అంటే కోట. ఈ రెండు పదాల కలయికే బాంధవ్‌ఘర్‌. ఇక్కడో పురాతన కోట ఉంది. దీన్ని రాముడు తన తమ్ముడు లక్ష్మణుడికి బహుమతికి ఇచ్చాడట. అందుకే ఆ పేరు వచ్చిదంటారు. 1968 వరకు బాంధవ్‌ఘర్‌ ప్రాంతం రేవా మహారాజుల వేట ప్రదేశం. ఆ తర్వాత, రాజకుటుంబం ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంతో నేషనల్‌ పార్క్‌గా మార్చారు. 1993లో ఈ పార్క్‌ను టైగర్‌ రిజర్వ్‌గా ప్రకటించారు.’’ అని జీపు సఫారీలో మాకు వివరించాడు గైడ్.

అలా టైగర్‌ పార్కు (Tiger safari) గుండా వెళుతుంటే మాకు మరిన్ని విషయాలు తెలిశాయి. బాంధవ్‌గర్‌ పార్కు (Bandhavgarh National Park) విస్తీర్ణం 1536 చదరపు కిలోమీటర్లని, తెల్ల పులులకు సహజ నివాసమైన ఈ పార్కులో 22 కంటే ఎక్కువ జాతుల క్షీరదాలు, 250 జాతుల పక్షులు కూడా ఉన్నాయని బోర్డు మీద రాసి ఉంది. మీరు కూడా ఓ సారి ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం అక్టోబర్‌ 1 నుంచి జూన్‌ 30 మధ్యలోపే వెళ్లండి. టైగర్‌ సఫారీకి అదే అనువైన సమయం. జూలై నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు దాకా వర్షాల కారణంగా సందర్శకులను అనుమతించరు కనక. మొత్తంమీద బాంధవ్‌ఘర్‌ నేషనల్‌ పార్క్‌లో పులిని చూడకుండా వస్తే అది అసంపూర్ణ విహారయాత్రే.

ఈ తరహా పార్కులు దేశంలో మరో నాలుగు ఉన్నాయని గైడ్‌ వాటి వివరాలు కూడా చెప్పాడు.

‘‘రాజస్థాన్‌ (Rajastan)లోని స్వామయ్‌ మథోపూర్‌ జిల్లాలో ఉన్న రథంబోర్‌ నేషనల్‌ పార్క్‌ 392 చదరపు కిలో మీటర్లలో విస్తరించి ఉంది. 2014 లెక్కల ప్రకారం 59 పులులుండగా, 2022 కు వాటి జనాభా 86కు పెరిగింది. ఇందులో 320 రకాల పక్షి జాతులు, 35 సరీసృపాల జాతులు, 40 రకాల క్షీరద జాతులు ఉన్నాయి. పార్క్‌కు సమీపంలో 10వ శతాబ్దంలో నిర్మించిన రథంబోర్‌ కోట ఒకటుంది. అటవీ ప్రాంతంలో ఆరు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. అప్పటి రాజభవనాలు, మంటపాలను ఇక్కడ చూడవచ్చు.’’ అని కొన్ని యూట్యూబ్ వీడియోలను చూయించాడు.

అప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. సఫారీ ముగించుకుని పార్కుకు సమీపంలోని ఓ రెస్టారెంట్‌లో కాసేపు సేదతీరాం. భోజనం ఆర్డర్‌ చేశాం. వెయిటర్‌ వచ్చి మెనూ తీసుకుని 20 నిముషాలు సమయం పడుతుందని చెప్పి వెళ్లాడు. ఈ లోగా మా గైడ్‌ మరో మూడు టైగర్‌ పార్క్‌ల గురించి క్లుప్తంగా వివరించారు.

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో 1939లో స్థాపించిన జిమ్‌ కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌ అతి పురాతనమైనదట. పులుల పరిరక్షకుడైన జిమ్‌ కార్బెట్‌ పేరును ఈ పార్కుకు పెట్టారని చెప్పాడు. మధ్యప్రదేశ్‌లోని కన్హ నేషనల్‌ పార్క్‌లో రాయల్‌ బెంగాల్‌ టైగర్స్‌ సంఖ్య ఎక్కువని, 940 చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ పార్కులో 50 రకాల పక్షి, వృక్షజాతులున్నాయని వివరించాడు.

‘‘తడోబా నేషనల్‌ పార్క్‌ మహారాష్ట్ర(Maharastra)లోని అతి పురాతన పార్క్‌. విస్తీర్ణం 1727 చదరపు కిలోమీటర్లు. 2010 లెక్కల ప్రకారం ఇక్కడ 43 పులులున్నాయని’’ కాస్త లోతుగా వివరించబోయే లోపు వెయిటర్‌ భోజనంతో వచ్చేశాడు. అందరం బాగా లాగించాం. గైడ్‌కు థ్యాంక్స్‌ చెబుతూ ఐదొందల నోట్లు నాలుగు ఆయన చేతిలో పెట్టి శేఖర్‌ ఇంటికి పయనమయ్యాం.

(Venkat. Mahankali - 9441089555)

Next Story