స్త్రీయే సంపద సృష్టికర్త...పురుషుడు కాపలాదారు!
x

స్త్రీయే సంపద సృష్టికర్త...పురుషుడు కాపలాదారు!

రామాయణంలో నిరుత్తరకాండ-27: ప్రకృతి నుంచి సంస్కృతి దిశగా సాగిన ప్రయాణ తొలి దశకు స్త్రీ నాయకత్వం వహిస్తే, నాగరికతవైపు సాగే ఘట్టానికి పురుషుడు నాయకత్వం వహించాడు!


బ్రహ్మపురాణకథే కాక; గతంలో చెప్పుకున్నట్టు రామాయణంలోని దశరథుడి పుత్రకామేష్టీ, మహాభారతంలోని ద్రుపదుడి యాగమూ కూడా స్త్రీ-పురుషప్రాధాన్యక్రమాన్ని తలకిందులు చేశాయి. పాయసంనుంచి సంతానం కలిగినట్టు పుత్రకామేష్టి కథనం చెబితే; పురుషుడి శుక్లంతో, స్త్రీ శోణితంతో సంబంధంలేకుండా ఋత్విక్కుల మంత్రశక్తితోనే సంతానం కలిగినట్టు ద్రుపదుడి యాగం చెప్పింది. దశరథుడి భార్యలు పాయసం సేవించి గర్భవతులుయ్యారని చెప్పే మేరకైనా పుత్రకామేష్టి కథనం సంతానోత్పత్తిలో స్త్రీపాత్రను గుర్తిస్తే; స్త్రీని పూర్తిగా పక్కన పెట్టడం ద్రుపదుడి యాగకథనంలో కనిపిస్తుంది.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, జలప్రళయం గురించిన కథల్లానే, సంతానోత్పత్తిని పురుషుడికి ఆపాదించే కథలూ ప్రపంచవ్యాప్తం. ఆవిధంగా ప్రాచీనకాలంలో సంభవించిన ‘ప్రపంచీకరణ’లోకి అవి కూడా వస్తాయి. భిన్నభిన్న ప్రాంతాలకు చెందిన పురాణ, ఇతిహాసాలను, మతాలను తులనాత్మకంగా పరిశీలించి వాటి అంతస్సూత్రాన్ని, సారూప్యాలను గుర్తించడానికి ప్రయత్నించిన జోసెఫ్ కాంబెల్ తన ‘ఆక్సిడెంటల్ మైథాలజీ’(Occidental Mythology)లో యూదుల తొలి పురాణకథ ఒకదాని గురించి రాస్తాడు. క్రీ.పూ.9వ శతాబ్దికి చెందినదిగా చెప్పిన ఆ కథ ఇలా ఉంటుంది:

యెహోవా ఒకరోజున భూమినీ, ఆకాశాన్నీ సృష్టించాడు. భూమినుంచి పొగమంచు పుట్టి భూమిని తడిపింది. యెహోవా ఆ తడిమట్టితో మనిషిని తయారుచేశాడు. దాని ముక్కుపుటాల్లోకి ఊపిరి ఊది ప్రాణం పోశాడు. తూర్పు దిక్కున గల ఈడెన్ లో ఒక తోటను; అందులో ఆహ్లాదం గొలిపే అందమైన చెట్లను, ఆహారపు మొక్కలను సృష్టించి మనిషిని ఆ తోటలో ఉంచాడు. ఆ తోటను తడపడానికి ఒక నదిని సృష్టించాడు. ఆ తోటలోనే జీవవృక్షం, మంచి-చెడుల జ్ఞానవృక్షం అనే రెండు వృక్షాలను ప్రత్యేకంగా పుట్టించి, జ్ఞానవృక్షఫలాన్ని మాత్రం తినద్దనీ, తింటే చనిపోతావనీ మనిషితో అన్నాడు. ఆ తర్వాత అన్ని రకాల జంతువులను, పక్షులను సృష్టించి; నువ్వు వాటిని ఎలా పిలిస్తే, అవే వాటి పేర్లు అవుతాయన్నాడు.

మనిషికి ఒక తోడు కావాలి కదా అనుకుని, అతనికి నిద్ర ఆవహిల్లేలా చేసి, అతని పక్కటెముకను ఒకదాన్ని తీసి, ఆ ప్రదేశాన్ని తిరిగి మాంసంతో పూరించి, ఆ ఎముకను స్త్రీగా మార్చాడు. చివరికి వాళ్ళిద్దరూ తను వద్దన్న పని చేయడంతో వారిని ఆ తోటనుంచి బహిష్కరించాడు. ఆ ఆదిదంపతులకు కెయిన్, ఎబెల్ అనే ఇద్దరు కొడుకులు కలిగారు. కెయిన్ వ్యవసాయదారుడు, ఎబెల్ గొర్రెల కాపరి అయ్యారు. కెయిన్ తను పండించిన పంటలోంచి, ఎబెల్ తన గొర్రెల మందలోంచి ప్రథమఫలం కింద దేవుడికి సమర్పించుకున్నారు. దేవుడు కెయిన్ నివేదనను తిరస్కరించి ఎబెల్ నివేదనను స్వీకరించాడు. కెయిన్ అసూయతో తమ్ముణ్ణి చంపేశాడు. దేవుడు ఆగ్రహించి, నువ్వు సాగు చేసే భూమి నిస్సారమైపోతుందనీ, తగినంత పంట ఇవ్వదనీ, పారిపోయిన నేరస్థునిలా దేశదిమ్మరి జీవితం గడుపుతావనీ శపించాడు. కెయిన్ యెహోవాకు దూరమై సంచారజీవులుండే ఈడెన్ తూర్పు ప్రాంతానికి వెళ్ళిపోయాడు.



ఇలాంటి కథలు ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా, మెలెనేసియా, పొలినేసియా, మెక్సికో, పెరు, బ్రాజిల్ సహా వ్యవసాయసంస్కృతి నెలకొన్న ప్రతిచోటా ఉన్నాయని కాంబెల్ అంటాడు. కాకపోతే, యూదుల కథకూ, మిగతా వాటికీ మధ్య ఒక తేడా ఉందనీ; యూదుల కథలో ఉన్నట్టు ఆదిదంపతుల పతనం, లేదా పాపం, దాని ఫలితంగా బహిష్కరణ ఈ కథల్లో లేవంటాడు. వ్యవసాయదారులు, పశుపాలకుల మధ్య స్పర్థకూ; వ్యవసాయదారుల దేశమైన కనాన్ (నేటి ఇజ్రాయిల్ పురాతననామం)ను యూదులు ఆక్రమించుకోడానికీ ఈ కథను అన్వయిస్తాడు.

అదలా ఉంచితే, ఈ యూదుల కథకు మాతృకలా కనిపించే కథ మెసపొటేమియా, లేదా సుమేరు పురాణకథల్లో ఉంది. క్రీ.పూ.2050కి చెందినట్టు చెబుతున్న ఆ కథ యూదుల కథకు భిన్నంగా ‘ఇనన్న’ అనే స్త్రీదేవత గురించి చెబుతుంది. సుమేరు చరిత్రలో ‘ఉరుక్ కాలం’గా వర్గీకరించిన క్రీ.పూ. 4000-3100ల నాటికే ఉరుక్ నగరంలో ఇనన్నను ఆరాధించేవారు. సంతానోత్పత్తికి, ప్రేమకు, లైంగికతకు, యుద్ధాలకు చెందిన దేవతగా ఇనన్న గుర్తింపు పొందింది. ఇనన్న లక్షణాలే కలిగిన దేవతలు ఇష్టార్, అష్టార్త్, ఇషార, ననయ, నినెగల్ మొదలైన పేర్లతో ఇతరచోట్ల కూడా అవతరించారు. క్రమంగా మంచి-చెడుల మిశ్రమంగా ఇనన్న రూపొందింది. యూదుల కథలో వ్యవసాయదారుడు కెయిన్, గొర్రెల కాపరి ఎబెల్ యెహోవా అనుగ్రహానికి పోటీ పడితే; ఇనన్న కథలో ఎంకిమ్డు అనే వ్యవసాయదారుడు, దుముజి అనే గొర్రెలకాపరి ఆమెను పెళ్లాడడానికి పోటీ పడ్డారు. మొదట వ్యవసాయదారునివైపు మొగ్గిన ఇనన్న, చివరికి గొర్రెలకాపరిని పెళ్ళాడుతుంది.

అయితే, క్రీ.పూ. 2000కి వచ్చేసరికి ఇనన్న హోదా తలకిందులైంది; ‘ఎరిడు’ అనే నగరానికి చెందిన ‘ఎంకి’ అనే పురుషదేవుడు ప్రథమస్థానానికి వచ్చి ఆమెకు స్థానభ్రంశం కలిగించాడు; ఇనన్న అతనికి కూతురైంది. ఎంకి జలాలకు, చేతివృత్తులకు, సృష్టికి సంబంధించిన దేవుడు. ‘ఎంకి- ప్రపంచవ్యవస్థ’ (Enki and the World Order)అనే సుమేరు పురాణకథ ప్రకారం, ఒక ప్రళయం తర్వాత ఎంకి ప్రపంచాన్ని తిరిగి వ్యవస్థీకరించాడు. ఆ క్రమంలో ఇనన్న చేతినుంచి రాజదండా(royal scepter)న్ని తప్పించి, ఆమెను పూర్తిగా పక్కన పెట్టి, ఆమె తోబుట్టువులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాడు. దాంతో ఇనన్న దుఃఖిస్తూ అతని దగ్గరికి వెళ్ళి, “దేవదేవుడైన ఎన్ లిల్ మాలాంటి గొప్పగొప్ప దేవతల భవితవ్యాన్ని నీ చేతుల్లో పెడితే, ఎందుకిలా చేస్తున్నావు, స్త్రీనైన నన్ను ఎందుకు తేడాగా చూస్తున్నావు, నా హక్కులు ఏమయ్యా”యని అడిగింది. అప్పుడు ఎంకి ఆమెను బుజ్జగిస్తూ; గొర్రెలకాపరి దండం, దాడులు, చిన్నపాటి యుద్ధాలు, నేతపని మొదలైన అధికారాలు నీ చేతిలోనే ఉన్నాయి కదా అంటాడు.

అయితే, అప్పటికే పురుషుడి నాయకత్వంలో మానవాళి మరో మార్గం పట్టింది కనుక స్త్రీదేవత అయిన ఇనన్న అధికారాలకు కాలంచెల్లిందనీ; పురుషుడి శక్తిమంతతా, అతని సంతానోత్పత్తి సామర్థ్యమూ కూడా ఎంకి మాటల్లో వెల్లడవుతాయనీ విలియం ఇర్విన్ థామ్సన్(William Irwin Thompson) తన ‘ది టైమ్ ఫాలింగ్ బాడీస్ టేక్ టు లైట్ -మైథాలజీ, సెక్స్యువాలిటీ అండ్ ది ఆరిజిన్స్ ఆఫ్ కల్చర్’(The Time Falling Bodies Take To Light- Mythology, Sexuality & the Origins of Culture- 1981)అనే పుస్తకంలో అంటాడు.

స్త్రీ-పురుషప్రాధాన్యక్రమం తలకిందులైన తీరును మతం, పురాణం, సాహిత్యం, సంస్కృతి, కళలు, పురాచరిత్ర, చరిత్ర, లైంగికత, మానవశాస్త్రంతో సహా దాదాపు అన్ని అధ్యయనరంగాల వెలుగులో ఎత్తిచూపిన థామ్సన్ రచన అనేక విధాలుగా ఒక అద్భుతం, అసాధారణం. పూర్తిస్థాయిలో దాని గురించి చెప్పుకోడానికి సందర్భం కాదుకనుక క్లుప్తంగా చెప్పుకుందాం. సకల అధ్యయనాల సమాహారంగా రూపొందిన ఈ రచన ఏ అధ్యయనరంగాన్నీ తక్కువ చేయదు; కాకపోతే వాటి వాటి పరిమితులను చర్చిస్తుంది; వాటి స్వరూప, స్వభావాలను నిర్వచిస్తుంది; వాటి మధ్య సమన్వయానికి ప్రయత్నిస్తుంది; మతం, పురాణం సహా పై రంగాలలో ఇంతవరకూ జరిగిన అధ్యయనాన్ని క్రోడీకరిస్తూ, దానినుంచి కొత్త ప్రతిపాదనలను పిండి తీస్తుంది; సరికొత్త అవగాహనను, స్పష్టతను, సమగ్రతను ఇస్తుంది...

ఒక్కమాటలో చెప్పాలంటే, కాలగర్భంలో సొరంగ మార్గాలు నిర్మిస్తూ; పైన చెప్పిన అన్ని అధ్యయనాల మూలాలు ఆధునికయుగం, మధ్యరాతియుగం, కొత్తరాతి యుగం మీదుగా 50 వేల సంవత్సరాల వెనకటి పాతరాతియుగంలోకి ఎలా వ్యాపించి ఉన్నాయో అత్యాశ్చర్యకరంగా చూపిస్తుంది.

ఎద అయినప్పుడు మాత్రమే లైంగికసంపర్కం చెందే జంతులక్షణం స్త్రీలో అంతరించి, ఎప్పుడైనా సంపర్కం చెందే స్థితికి చేరుకోవడం మానవపరిణామాన్ని విప్లవీకరించిన మౌలికలక్షణాలలో ఒకటని థామ్సన్ అంటాడు. అడవినుంచి జీవనం పచ్చికబయలుకు మారడంతోనే ఈ మార్పు సంభవించి ఉంటుందంటాడు. అప్పటినుంచీ, లైంగికత అనేది పది క్షణాల యాంత్రికకార్యానికి చెందినది కాకుండా అన్ని అనుభవాలకూ కీలకంగా మారి హోదా, అధికారాలతో పెనవేసుకుందని అంటాడు. సృష్టికథ స్త్రీపురుష జననాంగాల కథ తప్ప మరొకటి కాదంటాడు.

ఆయన ప్రకారం, ఎద అయినప్పుడు కూడే జంతులక్షణంనుంచి స్త్రీ మొదట బయటపడి పురుషుని సరికొత్త మానవసంస్కృతిలోకి ఆకర్షించడాన్నే ఆడమ్, ఈవ్ ల కథ చెబుతుంది. పురాణకథలను జాతి తాలూకు పురాస్మృతులకు అచేతన వ్యక్తీకరణలనుకుంటే మిల్టన్ ‘పారడైజ్ లాస్ట్’ ఆడమ్, ఈవ్ ల ‘పతనం’ ద్వారా జననాంగాలతో ముడిపడిన సృష్టిగాథను ఉల్లేఖిస్తుంది. ఆవిధంగా పురాణగాథలు కానీ, మతాలు కానీ లైంగికత గురించే చెబుతాయి. స్త్రీలు పురుషుల్ని తమవైపు ఆకర్షించుకుంటారు; దాంతో పురుషుడు సాటి పురుషుల కట్టునుంచి బయటికొచ్చి వారితోనే పోటీకి దిగి ఘర్షణపడతాడు; లైంగికత కల్పించే ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకోడానికి చేసే ప్రయత్నమే మతాలంటాడు థామస్. పురాణగాథలను కూడా వైరుధ్యాలమధ్య ఒక సమాధానాన్ని కూర్చేవిగానే లెవి-స్ట్రాస్(Levi-Strauss), ఎడ్మండ్ లీచ్(Edmund Leach) లాంటి మానవశాస్త్రవేత్తలు అన్వయించిన సంగతిని ఉదహరిస్తాడు. సృష్టిగాథ(Genesis), సామాజికజీవశాస్త్రం(sociobiology) రెండూ లైంగిక ప్రవర్తనలో అంతర్గతంగా ఉన్న వైరుధ్యాన్ని ఎత్తిచూపుతాయంటూ రెండింటినీ పౌరాణికకల్పనలుగానే ఆయన చెప్పడం మరింత ఆసక్తికరం. కాకపోతే ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది. ఇంతకీ ఈ పౌరాణికకల్పనల మూలాలు ఎక్కడున్నాయంటే, 50 వేల సంవత్సరాల వెనకటి ఎగువ రాతి యుగం(Upper Paleolithic Age)లో ఉన్నాయి!

అలాగే, పురాణం అనేక అన్వయాలకు అవకాశమిచ్చే వాఙ్మయరూపమంటాడు థామస్. ఇది మహాభారతం గురించి నన్నయ చెప్పినది గుర్తుచేస్తుంది. మహాభారతం వాళ్ళ వాళ్ళ అభినివేశాన్ని బట్టి, దృష్టిని బట్టి ధర్మశాస్త్రంగానూ, వేదాంతంగానూ, నీతిశాస్త్రంగానూ, మహాకావ్యంగానూ, లాక్షణికగ్రంథంగానూ, ఇతిహాసంగానూ, అనేక పురాణాల సంపుటిగానూ కనిపిస్తుందని నన్నయ అంటాడు. అంతేకాదు, ఒక పురాణగాథకు చెందిన అన్ని పాఠాలనూ పరిశీలనలోకి తీసుకోవాలన్న లెవిస్-స్ట్రాస్ అభిప్రాయాన్ని కూడా థామస్ సోదాహరణంగా నొక్కి చెబుతాడు. ఇది కూడా మన పురాణ, ఇతిహాసాలకూ సమానంగా వర్తించే సూత్రమే.

‘పౌరాణికకల్పన ఆత్మకు సంబంధించిన చరిత్ర, మనిషి సాముదాయిక అస్తిత్వానికి చెందిన స్మృతి; మతపరమైన తంతులు, సంస్కారాలు వాటిని గుర్తుచేసే’ వన్నది థామస్ ఇచ్చిన మరో వివరణ. ప్రకృతి, లేదా సహజత్వం గురించి ఆయన అన్నవి కూడా ఆసక్తికరంగానూ, ఆలోచనాత్మకంగానూ ఉంటాయి. మనిషికి సంబంధించి ‘సహజమైనది’ అంటూ ఏమీ ఉండదంటూ, మనిషి ‘ప్రాకృతికుడు(natural)’ కాడు కనుకనే మనిషయ్యాడన్న జర్మన్ శాస్త్రవేత్త, రచయిత గథే(Goethe) అభిప్రాయాన్ని ఉటంకిస్తాడు. ప్రకృతి నుంచి సంస్కృతివైపూ, అంతిమంగా నాగరికతవైపూ సాగిన ప్రయాణంగా మానవప్రస్థానం మొత్తాన్ని నిర్వచిస్తాడు. ప్రకృతి నుంచి సంస్కృతి దిశగా సాగిన ప్రయాణపు తొలి ఘట్టానికి స్త్రీ నాయకత్వం వహిస్తే, నాగరికతవైపు సాగే ఘట్టానికి పురుషుడు నాయకత్వం వహించాడు! ఇదీ స్థూలంగా థామ్సన్ అధ్యయనం తేల్చిన ఒకానొక సారాంశం.

అమ్మ(Mother Goddess)ఆరాధనను తొలిమతంగానే కాక, ఏకైక విశ్వజనీనమతంగా థామస్ మన ముందుకు తెస్తాడు. అమ్మ మతంలో భాగంగా సాంప్రదాయిక సంస్కృతిని, ఆచారాలను, తంతులను స్త్రీలే అభివృద్ధి చేశారు; అందులో వారిదే ప్రథమపాత్రా, ప్రధానపాత్రా. దానికి ప్రత్యామ్నాయంగా పురుషులు పెంపొందించుకుంటూ వచ్చినది ఉపసంస్కృతి మాత్రమే. అసలు మానవీకరణ(hominization) దిశగా తొలి అడుగు వేసినదే స్త్రీ. ఎద అయినప్పుడే సంపర్కం చెందే జంతులక్షణం నుంచి ఎప్పుడైనా సంపర్కం చెందే ఋతుక్రమంవైపు మళ్లడమే దీనికి ప్రారంభమని ఇంతకుముందు చెప్పుకున్నాం. దానితో సరికొత్త సమాజరూపం అవతరించింది; అంతవరకూ ఉన్న స్త్రీ-పురుష లింగభేదాలు కొత్తపద్ధతుల్లో పునర్వ్యవస్థీకరణ చెంది పరస్పరం సర్దుబాటు చేసుకున్నాయి. పురుషులు ఒక కట్టుగా(all-male band)ఏర్పడి వేట దారి పట్టి, ఆయా సాధనాలు, సంకేతాల రూపంలో ఆదిమసాంకేతికతను, భాషను అభివృద్ధిచేస్తే; స్త్రీలు ఆహారపు మొక్కల సేకరణలోనూ, ఆ మొక్కల పెరుగుదలతో ముడిపడిన ఋతుపరివర్తనను పరిశీలించడంలోనూ, తమ ఋతుక్రమానికి చంద్రుని వృద్ధిక్షయాలకు సంబంధాన్ని కల్పించుకోవడంలోనూ నిమగ్నమయ్యారు. ఆవిధంగా సైన్సు, మతం, ఖగోళవిజ్ఞానాల మహత్తర సమన్వయానికి స్త్రీలే తొలి పునాదులు నిర్మించారు.

ఇంకా థామ్సన్ చేసిన అభివర్ణన ప్రకారం, ఆహారపు మొక్కల సేకర్తగా తొలి వృక్షశాస్త్రవేత్తా; వంటా, కుండలూ చేసేదిగా తొలి రసాయనికశాస్త్రవేత్తా, తల్లిగా అమ్మవారికి తొలి పూజారిణీ స్త్రీయే! ఏ కోణంలో చూసినా అప్పటి స్త్రీ అజేయురాలు. ఎగువరాతియుగంనుంచీ అమ్మ మతాన్ని సంరక్షించుకుంటూ వస్తూనే మొక్కల సేకరణను పెరటిసాగు వైపు మళ్లించి అంతిమంగా వ్యవసాయవిప్లవం దిశగా మానవాళిని అడుగువేయించినదీ, ఏడాదికి సరిపోయే ఆహారపు వనరులను రాశులుగా కూడబెట్టి సంపదకు తొలి చిరునామా అయినదీ స్త్రీయే! ఆహారోత్పత్తిలో అప్పటి పురుషుడి పాత్ర స్వల్పం; కొన్ని రోజులకు మాత్రం సరిపోయే జంతువులను తీసుకుని ఇంటికి వచ్చిన పురుషుడు, స్త్రీ సమకూర్చిన అన్నరాశులను చూసి ఆత్మన్యూనతకు గురయ్యేవాడంటాడు థామస్. స్త్రీ కూడబెట్టిన సంపదకు కాపలాదారుగా మాత్రమే పురుషుడు క్రమంగా ప్రాముఖ్యాన్ని తెచ్చుకున్నాడు. అక్కడినుంచి యుద్ధాలవైపు అడుగువేశాడు. ఆ అడుగు స్త్రీ ప్రాధాన్యాన్ని కూలదోసి పురుషప్రాధాన్యాన్ని స్థాపించే దిశగా సాగిపోయింది...

మొదటే చెప్పినట్టు శాస్త్రవిజ్ఞానం, మతం, పురాణం, పురాచరిత్ర, చరిత్ర వంటి వివిధ అధ్యయనాల మీదుగా; ఎగువ, మధ్య, కొత్త రాతియుగాలు, వాటికి సంబంధించిన తేదీల మీదుగా థామ్సన్ ఈ పరివర్తనక్రమం మొత్తాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టిస్తాడు. ఆయన సూత్రీకరణలు అన్నీ కాకపోయినా ఎక్కువ భాగం అందరికీ ఆమోదయోగ్యంగానూ, ఆలోచనీయంగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా మనకు సంబంధించి చెప్పుకోవలసింది ఏమిటంటే, థామ్సన్ ను చదువుతుంటే అడుగడుగునా మన పురాణ, ఇతిహాసగాథలు మనసులో మెదిలి రాతియుగంనుంచీ రూపు దిద్దుకుంటూ వచ్చిన ప్రపంచపౌరాణికవాఙ్మయంలో విడదీయలేని భాగాలుగా రూపుకడతాయి. ఆవిధంగా అవి మనవి మాత్రమే అనే అపోహనూ, భౌగోళికమైన హద్దులనూ దాటుకుని విశ్వజనీనతలో భాగమవుతాయి.

అదలా ఉంచితే...

స్త్రీ దేవత ఇనన్న, పురుషదేవుడు ఎంకికి సంబంధించి పైన చెప్పుకున్న సుమేరు పురాణకథకు పౌరాణిక, చారిత్రక కోణాలనుంచి థామ్సన్ ఇచ్చిన మరింత వివరణా అంతే ఆసక్తికరంగానూ, అద్భుతంగానూ ఉంటుంది. స్త్రీ-పురుషప్రాధాన్యాలు తలకిందులైన తీరును మరింత స్పష్టంగా, సాధికారంగా బొమ్మకడుతుంది. వచ్చేసారి దాని గురించి చెప్పుకుంటూ క్రమంగా తిరిగి రామాయణం వైపు అడుగువేద్దాం.











Read More
Next Story