
రేబీస్ వ్యాధి అంటే? : తెలుసుకుంటే, నివారించడం సులభం...
నేగు ప్రపంచ రేబీస్ దినోత్సవం
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 తేదీన ప్రపంచ రేబీస్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ జయంతి సందర్భంలో ఆరంభించారు. ఆయన 19వ శతాబ్దంలోనే రేబీస్ వ్యాక్సిన్ (Rabies Vaccine) కనుగొని, అనేకమంది ప్రాణాలను కాపాడారు.
ప్రపంచ జనాభాకు రేబీస్ వ్యాధి గురించి అవగాహన కల్పించడం, వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గుర్తు చేయడం కొరకు ఈ రోజున ప్రపంచ రేబీస్ డేగా గుర్తించారు.
రేబీస్ వ్యాధి భయానకం
రేబీస్ ఒక వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా కుక్కలు, పిల్లులు, ఎలుకలు, అడవి జంతువులు కరవడం వలన వ్యాపించే వ్యాధి. ఒకసారి రేబీస్ లక్షణాలు మనుష్యులలో కానీ జంతువులలో కానీ బయటపడితే దానికి చికిత్స లేదు. రోగి తప్పకుండా మరణిస్తాడు.
లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి, నీరు తాగలేకపోవడం (Hydrophobia), వాంతులు, మానసిక భ్రాంతి, క్రమంగా మెదడు పనితీరు ఆగిపోవడం.
వ్యాక్సిన్ కనిపెట్టకముందు మానవ నష్టం
వ్యాక్సిన్ ఆవిష్కరణకు ముందు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రేబీస్ కారణంగా మరణించేవారు. అప్పుడు కుక్క కరిచినవారికి సరైన చికిత్స లేక, గాయాలపై కట్టుకట్టడం, మంత్రాలు జపించడం వంటి నిరుపయోగ పద్ధతులు మాత్రమే ఉండేవి. రేబీస్ లక్షణాలు వచ్చిన తర్వాత ఒక్కరినీ కాపాడలేకపోయారు.
రేబీస్ వ్యాక్సిన్ ఆవిష్కరణ – జోసెఫ్ మీస్టర్
1885లో లూయీ పాశ్చర్ తొలిసారి రేబీస్ వ్యాక్సిన్‌ను రూపొందించారు. మొదట ఈ వ్యాక్సిన్ జోసెఫ్ మీస్టర్ అనే తొమ్మిదేళ్ల బాలుడికి (కుక్క కరిచిన తరువాత) ఇచ్చారు. వ్యాక్సిన్ కారణంగా అతను బతికి బయటపడ్డాడు. ఇది వైద్య చరిత్రలో గొప్ప మలుపు. దీని తరువాత ప్రపంచవ్యాప్తంగా రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలు విస్తరించాయి.
వ్యాక్సిన్ ద్వారా కాపాడబడిన ప్రాణాలు – గణాంకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రతి సంవత్సరం 59,000 మంది వరకు రేబీస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోతే ఈ సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉండేది. 20వ శతాబ్దం నుండి ఇప్పటివరకు రేబీస్ వ్యాక్సిన్ కారణంగా మిలియన్లాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. కొన్ని దేశాలు (ఉదా: యూరప్, అమెరికా, జపాన్) లో 100% కుక్కల వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిర్వహించడం వలన రేబీస్ మరణాలు పూర్తిగా తుడిచిపెట్టబడ్డాయి.
భారత్‌లో రేబీస్ నిర్మూలనలో సమస్యలు
భారతదేశంలో రేబీస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టబడలేదు. దానికి కారణాలు: 1. అధికంగా సంచరించే వీధి కుక్కలు – పట్టణాలు, గ్రామాలలో వీధి కుక్కలు విపరీతంగా ఉన్నాయి. 2. 100% కుక్కల వ్యాక్సినేషన్ జరగకపోవడం – అన్ని జంతువులను టీకా వేయడం కష్టతరం. 3. ప్రజల్లో అవగాహన లోపం – కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. 4. వ్యాక్సిన్ అందుబాటు లోపం – గ్రామీణ ప్రాంతాలలో రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మూలానా పలువురు ఇబ్బందులు పడుతున్నారు 5. ప్రతి PHC (పబ్లిక్ హెల్త్ సెంటర్ ) లలో ప్రభుత్వం యాంటీ రేబిస్ టీకాలను ప్రజల ఉపయోగార్ధము అందుబాటులో వుంచుతున్నా వాటి పై అవగాహన లేక అనేకమంది నాటు వైద్య పద్దతులను నమ్మి ప్రాణాలపైకి తెచ్చుకొంటున్నారు
కుక్కల నియంత్రణ విధానం లేకపోవడం
కుక్కల నిర్బంధ శస్త్రచికిత్సలు (Animal Birth Control) పూర్వకంగా జరగకపోవడం. అందువల్లే భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది వరకు రేబీస్ కారణంగా మరణిస్తున్నారు, ఇది ప్రపంచంలోనే అత్యధికం.
ప్రపంచ రేబీస్ దినోత్సవం అవసరం
గ్రామీణ ప్రాంతాలలో ఇంకా చాలామందికి వ్యాక్సిన్ ప్రాముఖ్యత తెలియదు. కుక్క కరిచిన వెంటనే గాయం శుభ్రంగా కడిగి, తక్షణం వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వాలు, పశువైద్య శాఖలు, ఆరోగ్య శాఖలు కలిసి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయడం ద్వారా మానవ మరణాలను తగ్గించవచ్చు.
ఈ ఆధునిక యుగం లో కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆకుపసరు, మంత్రాలపై ఆధారపడి ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. ప్రపంచ రేబీస్ దినోత్సవం మనకు ఒక స్ఫూర్తిదాయక సందర్భం. ఒకప్పుడు లక్షలాది ప్రాణాలు బలి తీసుకున్న ఈ వ్యాధి, నేడు వ్యాక్సిన్ వల్ల చాలా వరకు నియంత్రణలోకి వచ్చింది. కానీ భారత్ వంటి దేశాలలో ఇంకా పూర్తి నిర్మూలన సాధించాలంటే ప్రజల అవగాహన, జంతువుల వ్యాక్సినేషన్, వీధి కుక్కల నియంత్రణ, బాధితులకు తక్షణ చికిత్స అత్యంత అవసరం.
Next Story