
'ఆత్మాభిమానమే అందెశ్రీ కూడ బెట్టిన సంపద'
తెలంగాణ ధూం ధాం గామలచడంలో అందెశ్రీ ది కీలక పాత్ర అంటున్న ప్రముఖ రచయిత బిఎస్ రాములు
అందెశ్రీ అమరుడు. అందె శ్రీ చావులేదు. .
అందెశ్రీ ఇపుడొక ఆకాశంలో వెలుగులీనే
ఒక నక్షత్రం. అందెశ్రీ ఇపుడు ప్రజల దరు
నిత్యం పాడుకునే తెలంగాణ రాష్ట్ర గీతం.
అందె శ్రీ సార్థక జన్ముడు.
అందె శ్రీ తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన మహనీయుడు.
అందెశ్రీ తో మూడు దశాబ్దాల జ్ఞాపకాలు. అనుభవాలు. ఈ ముప్పయి ఏళ్లలో ఆయన నుండి నేనే నేర్చుకున్నానో నా నుండి ఆయనే నేర్చుకున్నాడో విడదీసి గిరిగీసి చెప్పడం కష్టం. శిష్యుడు గా పాదాభి వందనాలు చేస్తూనే గురువులకు పాఠం చెప్ప గలిగిన వాడు అందెశ్రీ. ఆత్మాభిమానమే అందె శ్రీ ి నిలబెట్టిన సంపద.
అందెశ్రీ లో అహంకారం చూసిన వారున్నారు. అందె పొగరు బోతు తనం చూసిన వారున్నారు. అందె శ్రీ లో వున్న కవిని గాయకున్ని సహృదయున్ని చూసిన వారు కోట్లాదిమంది. . ఎవరినీ లెక్కచేయని తనమే అందెశ్రీ ని అందెశ్రీ గా నిలిపింది. తల వంచితే అది తెగి పడుతుందని తెలిసినవాడు అందె శ్రీ.
వాక్శుద్ది వల్ల తను చెప్పింది జరుగుతుందని నమ్మినవాడు. అలనాటి పోతులూరి వీర బ్రహ్మం గారి గురించి విన్నాము. పొతులూరి సమాజానికి తిరుగుబాటు నేర్పాడు. రాజులను మార్చాడో లేదో తెలియదు గాని అందెశ్రీ ప్రభుత్వాలను మార్చుతాను అన్నాడు. తనను ఈసడించిన వాడెంత అన్నవాడిని కుర్చీ నుంగి లాగి పడేసే దాక హృదయంలో అగ్ని గుండమై బతికినవాడు. అదే నిప్పుల వాగై పాటల కవితల సంకలంగా నిప్పులు వెద జల్లింది. ఆరేండ్ల కృషి అది.
అది కేవలం హఠ యోగ విద్య కాదు. అది ఆనాడు సిగ లాగి అవమానించబడివ చాణక్యుడు నంద రాజ్యాన్ని కూల్చి మౌర్య చంద్ర గుప్తునికి పట్టాభిషేకం చేసిన ఘట్టం . నేటి చాణుక్యుడుగా నిలిచి తనను ఇంటర్యూ నువ్వు చెయ్యాలి. నేను జవాబులు చెప్పాలి అని భవిష్యత్ తెలిసిన అందెశ్రీ ఏం చేయనున్నాడో తెలిసినదెందరికి?ఇప్పటికీ అర్థం అయ్యిందెందరికి?
ఆ .. చదువు రాని వాడు నాలుగు నుడుగులు నేర్వగానే ఇంత ఇదా అని లోలోపల చిన్న చూపున్నవారిని వారి మానాన వారిని వదిలేసాడు. కులం లేదు ధనం లేదు నాలుగు కవితలు రాస్తే ఇంత పోకడా? అనుకున్నవారు తరువాత నోరెళ్ల బెట్టారు. అందెశ్రీ లో ఎంత విద్వత్తున్నదో ఆయన గురువుగా గౌరవించే శ్రీరాం సర్ కు తెలుసు. నాకు తెలుసు.
శ్రీరాం సర్ లా వుండాల్సిన మీకీ కంపలన్ని ఎందుకు తగిలించుకుంటారెందుకు సార్! వినయంగా నిలదీసిన వాడు అందెశ్రీ. ఆయనలో శక్తి ని వాక్కులమ్మను గమనించిన సంస్కృ పండితులు వయోవృద్దులు ఆయనకు తలలు వంచి నమస్కరించారు. అందెశ్రీ ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆధునిక రుషి.. ఆధునిక ముని.. కన్ను తెరిస్తే అది మూడో కన్ను అని తెలిసేలోగా భస్మమై పోతారు. తన బాధను కోపాన్ని ఆవేశాన్ని తన అదుపులో పెట్టుకున్నవాడు అందెశ్రీ. అందె శ్రీ ఒక పసి బాలుడు.
1995 లో "ప్రవహించే పాట ఆంధ్ర ప్రదేశ్ దళిత పాటలు " అనే పాటల పుస్తకం కోసం అన్ని ప్రాంతాల నుండి వందలాది కవుల నుండి సేకరిస్తున్న కాలంలో అందెశ్రీ తాను వెలువరించిన రెండు పాటల పుస్తకాలు అందించాడు. అవి అన్నీ ప్రకృతి గురించి పల్లె జీవితం గురించి మానవీయత గురించిన పాటలు.
అందెశ్రీ 1992 లో ప్రారంభించిన దరకమే ఐక్య వేదికలో చేరలేదు. పాట కవుల వేదిక , కథకుల వేదిక ప్రత్యేకంగా ఉండాలని అనుకున్న ప్రకారం గూడ అంజయ్య పాట కవుల వేదికను ప్రారంభించాడు. అందెశ్రీ దానితో కలిసి కొన్ని పాటలు రాసాడు. చివరకు పాట కవుల వేదిక " తెలంగాణ ధూం ధాం " కు బీజం వేసింది. కామారెడ్డి సభతో తన రూపం తీసుకుంది. పాట కవులు కళాకారులు తప్ప ఎవరూ వేదిక పై వుండరాదనే నియమంతో "తెలంగాణ ధూం ధాం" బయల్దేరింది. పాట కవుల వేదికను తెలంగాణ ధూం ధాం గామలచడంలో అందెశ్రీ ది కీలక పాత్ర. మారోజు వీరన్న తెలంగాణ కోసం చేసిన కృషి అంతర్లీనంగా వుండింది.
రసమయి బాల కిషన్ కళాకారుడుగా తెలంగాణ ధూం ధాం కు ఐకాన్ గా నిలిస్తే దాని రూపు రేఖలను తీర్చి దిద్ది సాహిత్యాన్ని అందించినది అందెశ్రీ. అంతడుపుల నాగరాజు కళాబృంధం దాన్ని రస మయం చేసింది. తెలంగాణ ఉద్యమం అందెశ్రీని తయారు చేసుకున్నది. తెలంగాణ తల్లి కన్న బిడ్డ అందె శ్రీ.
అందెశ్రీ బడిపేద బిడ్డ. పశువుల కాసాడు. సుతారి పని చేసాడు. నిజామాబాద్ లో శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ గురూజీ జ్ఞాన బోధ చేసాడు. బిరుదు రామ రాజు కన్న బిడ్డగా చూసుకున్నాడు. బాసర వాక్కులమ్మ స్పూర్తితో ఎదిగాడు. కాల మహిమ అందె శ్రీ ని ఆశు కవిగా పిలిచింది. లోక కవిగా ఎదిగాడు. తెలంగాణ ఉద్యమ కవిగా విశ్వ వ్యాప్తమయ్యాడు. రాష్ట్ర గీతం కవిగా నిలిచాడు. మహాకవి కాళిదాసు ను మరిపించిన మహాకవి అనిపించుకున్నాడు.
కాళిదాసుది మేఘ సందేశం. అందెశ్రీది నది సందేశం. నది నడిచి పోతున్నది. నావనై నను కమిమన్నది అంటూ దేశ దేశాల ను సందర్శించి ప్రపంచ నదులెన్నో చూసి పరవశించాడు. కవిత్వం కోసం ప్రపంచంలోని నదుల వెంట నడిచిన కవి ప్రపంచంలో అందెశ్రీ ఒక్కడే! అత్యంత పేదరికం నుండి ఆశు కవిగా లోక కవిగా సహజ కవిగా ప్రకృతి కవిగా పరిణతి చెందిన మహాకవి.
అందె శ్రీ ఆశు కవిత్వాన్ని పండిత కవిత్వంగా మలుపు సాధించడం అసాధారణమైన విషయం. వర్తమానంలో సాహిత్యం మీద బతికిన మహా కవి అందెశ్రీ. ఏ నిర్మాణంలో ఇమడలేనని చెప్పి స్వతంత్రుడుగా జీవించిన కవి అందెశ్రీ. అందె శ్రీ భౌతి కాయాన్ని ముఖ్యమంత్రి తన భుజం మోసి ముందుకు నడిచాడు. అందె శ్రీ ప్రభుత్వ లాంచనాలలో కూడ తన చరిత్ర తాను సృష్టించుకున్నాడు. అమరుడైనాక కూడ ఆయన కోరుకున్నట్టు
పద్మభూషన్ , పద్మ విభూషణ్ ు ఆయనను తప్పక వరిస్తాయి. కొంత కాలానికి
నన్ను పంపిస్తావని అనుకున్నాను అందె శ్రీ! ముధుగా నువ్వే వెళ్లి పోయావా? అమరుడా! అందె శ్రీ నీకు జోహార్లు . నా హృదయంలో చరిత్రలో నీవెలా భాగమయ్యావో రాసిన రాతలు కొన్నైనా చూసి సంతసించిన మురిపెం మనది. మనది చరిత్ర! చరిత్ర మనదే సుమా !

