పోటొస్తే, నది అయినా వెనక్కి తగ్గక తప్పదు!?
x
జువ్వలపాలెం పచ్చటి పొలాలు

పోటొస్తే, నది అయినా వెనక్కి తగ్గక తప్పదు!?

జువ్వలపాలెం సాహిత్య పాఠశాల -2


జువ్వల పాలెం సాహిత్య పాఠశాలలో తెల్లవారు జామునే నిద్రలేచే వాళ్ళం. తెలతెల వారు తుండగా ప్రభాత భేరీ నిర్వహించే వాళ్ళం. పీర్ సాహెబ్ వంటి గాయకులు ఒకరిద్దరు కంజిర కొట్టుకుంటూ పాటలు పాడుతుంటే, మిగతా మేమంతా కోరస్ గా గొంతు కలిపే వాళ్ళం. ఈ ప్రభాత భేరి ఆగ్రామస్తులకు భౌతికంగానే కాదు, మానసికంగా కూడా మేలుకొలుపులా ఉండేది.

చేదబావి దగ్గర స్నానాలు ముగించుకునే వాళ్ళం. కొందరు కృష్ణా నది ఒడ్డుకు వెళ్ళి స్నానాలు చేసేవారు. టిఫిన్లు చేశాక, దాదాపు పదిగంటల సమయంలో క్లాసులు మొదలయ్యేవి. జ్వాలాముఖి, నిర్మలానంద్ మాత్రం మొదటి రోజు వచ్చి, ప్రేమ్ చంద్ స్వగ్రామం లంమ్హేలో జరిగే ఆయన శతజయంతిక సభ కోసం వెళ్ళిపోయారు. మద్రాసు నుంచి వచ్చిన కాకరాల ‘నూరేళ్ళ తెలుగు నాటక రంగం-పరిణామం, నాటక రచన, ప్రయోక్త, ప్రేక్షకుల పరిస్థితి, రావలసిన మార్పుల గురించి వివరించారు.
భారతీయ సంస్కృతి దశల గురించి డాక్టర్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, గతితార్కిక భౌతిక వాదం గురించి టి.ఎల్ . నారాయణ, క్రిస్టఫర్ కాడ్వెల్ గురించి నిఖిలేశ్వర్, జనతా ప్రజాతంత్ర విప్లవ దశలో రచయితలు, కళాకారుల కర్తవ్యాలు అన్న అంశంపై నవీన్ వివరించారు. అనువాద సమస్యల గురించి ఆలూరి భుజంగరావు వివరించారు. కథ, వస్తువు, రూపం అన్న అంశంపై వాకాటి పాండురంగారావు చెప్పారు.

నిఖిలేశ్వర్

ఆనాటి ఆంధ్రజ్యోతి వార పత్రికలో అసోసియేట్ ఎడిటర్ గా పనిచేస్తున్న పి.రామకృష్ణా రెడ్డి కథలతో పాటు కవిత్వం గురించి కూడా వివరంగా చెప్పారు. కవిత్వం పట్ల ఆసక్తి కలిగిన వారు ఈ తరగతుల్లోనే రాసిన కవితలను చూపించ మన్నారు. నేను కూడా కవిత రాసి చూపించాను. అయితే ‘సముద్రంలో అలలుంటాయి కానీ, ప్రవాహాలుండవు’ అని సూచించారు. అలాగే చాలా మంది రాసిన కవితల్లో లోపాలను చూపించారు.
కస్తూరి వేణుగోపాల్ గుండ్రంగా, బలంగా ఉండే వాడు. అతను కూడా ఒక కవిత రాసి చూపిస్తే, దానిలో ఉన్న లోపాలను పి.రామకృష్ణా రెడ్డి ఎత్తి చూపించారు. ‘‘మీ ఆంధ్రజ్యోతిలో ఇంతకంటే గొప్ప కవితలు వేస్తున్నారా?’’ అంటూ కాస్త పరుషంగా మాట్లాడాడు కస్తూరి వేణుగోపాల్. పి.రామకృష్ణా రెడ్డి చాలా మర్యాదస్తులు, పెద్ద మనిషి. ఏం సమాధానం చెప్పకుండా మౌనం దాల్చారు.
ఈ లోగా అక్కడే ఉన్న రవిబాబు అనుకుంటా, ‘‘ఆ పత్రికలో వచ్చే కవితల మంచి చెడులకు రామకృష్ణా రెడ్డిని బాధ్యులను చేయడం సబబు కాదు. ఆయన అందులో ఉద్యోగి మాత్రమే’’ అంటూ వివరించడమే కాదు, అలా మాట్లాడకూడదని కస్తూరి వేణుగోపాల్ ను మందలించారు. ఈ ఒక్క సంఘటన తప్ప పదిరోజుల సాహిత్య పాఠశాలలో ఎలాంటి అపశృతి దొర్లలేదు.
యువకుడైన కస్తూరి వేణుగోపాల్ కాస్త ఆవేశ పరుడే తప్ప, చాల మంచి వాడు. సాహిత్య కారుడు, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు సమతారావుకు సమీప బంధువు. ఒక విషాదం ఏమిటంటే, అంత ఆవేశపరుడు, నిబద్దత నిజాయితీ గల కస్తూరి వేణుగోపాల్ చిన్న వయసులోనే కన్నుమూశాడు. అతని మరణ వార్త నన్ను కలిచివేసింది.
నాజర్ అనగానే బుర్రకథ గుర్తుకు వస్తుంది. బుర్రకథ గురించి నాజర్ చాలా ఉద్వేగంగా చెప్పారు. అప్పటి వరకు బుర్రకథ వినడమే తప్ప దానిలోని లోతుపాతులు పెద్దగా తెలిసేవి కావు. తెలంగాణా సాయుధ పోరాట సమయంలో ప్రజలను ఉర్రూతలూగించిన కళారూపం బుర్రకథ. బుర్రకథకు తెలంగాణాలో సుద్దాల హనుమంతు, కోస్తాంధ్రలో నాజర్ ప్రాణం పోశారు.
అంత పెద్ద వయసులో కూడా నాజర్ గంభీరమైన కంఠంతో చాల ఉత్సాహంగా చెప్పడం మమ్మల్నెంతగానో ఉద్వేగానికి గురిచేసింది. అంతకు ముందు అసలు నాజర్ వంటి కళాకారులను చూడగలమా అన్న సందేహం ఉండేది నాకు. హైదారబాదులోని సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు ఆర్. గోపాల రావు కొందరికి నృత్యంలో శిక్షణనిచ్చారు. మరికొందరు వాయిద్యాల్లో శిక్షణ ఇచ్చారు.
మధ్యాహ్నమైతే మంచి భోజనం. భోజనంలో పెరుగేసుకున్నాక, అందులో బాగా పండిన బంగినపల్లి మామిడి పళ్ళు కూడా వేసేవారు. అదంతా గ్రామస్తుల ఔదార్యం. భోజనానంతరం మళ్ళీ తరగతులు. సాయంత్రం జువ్వల పాలెం గ్రామస్తులతో కలిసి మాటా మంతి. జనసాహితి గురించి, ప్రజా వ్యతిరేక సంస్కృతి గురించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలకు వివరించేవారు. విద్యార్థుల్లో మహిళలు కూడా ఉన్నారు.
చివరి రోజు, జూన్ 10వ తేదీ సాయంత్రం జువ్వలపాలెంలో రెండు వేల మందితో ఒక పెద్ద బహిరంగ సభ జరిగింది. అనంతరం సాంస్కృతికి కార్యక్రమా లు నిర్వహించారు. కానీ నేనా కార్యక్రమాలకు లేను. అదే రోజు సాయంత్రం తిరుగుప్రయాణమ అవ్వాలి. ఆ పది రోజులూ చాలా ఉత్సాహంగా ఉన్నాను. భిన్న సామాజికి పరిస్థితుల నుంచి వచ్చిన వారితో అన్ని రోజులు కలిసి ఉండం, కలిసి భోజనం చేయడం, కలిసి పడుకోవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం నా వరకు నాకు అబ్బురమనిపించింది. అంతా కొత్త పరిచయాలు, పరిచయమైన కొత్త లోకం అంతా పది రోజుల్లో పాతపడిపోయాయి. అప్పుడే తరగతులైపోయాయా! అనిపించింది. పది రోజుల కాలం మంచులా కరిగిపోయింది. తిరిగి వెళ్ళక తప్పదు కదా!
కృష్ణా నదికి ఆవల నడకుదురు. ఈ వల జువ్వల పాలెం. నడకుదురు నుంచి మూడు కిలోమీటర్లలో చల్లపల్లి. ఆరెంటి మధ్య నుంచి సముద్రుడిలో సంగ మించడానికి సాగుతున్న కృష్ణా నది. అప్పుడప్పుడూ ఉదయాన, సాయం సమయాన, కృష్ణా నది తీరానికి నడుచుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళే వాళ్ళం. అనేక విషయాలు మా మాటల్లో దొర్లేవి. ముఖ్యంగా లంక భూముల్లో చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా రైతులు చేసిన మహత్తర పోరాటం మా మధ్యచర్చకు వచ్చేది.
బ్రిటిష్ పాలనా కాలంలో రైతుల నుంచి పన్ను వసూలు చేయడానికి 1793లో కారన్ వాలిస్ జమిందారీ విధానాన్ని ప్రవేశ పెట్టాడు. భూములన్నీ జమిందారు ఆధీనంలో ఉంటాయి. భూములను సాగుచేసే రైతులకు కౌలు దారులుగా ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండేవి కావు. జమిందారీ విధానం వారసత్వంగా సంక్రమించేది. బ్రిటిష్ కాలంలో ఏర్పడిన చల్లపల్లి జమిందారు రైతుల నుంచి వసూలు చేసిన పన్నులలో కొంత మాత్రమే ప్రభుత్వానికి చెల్లించి, మిగతాది సొంతానికి వాడుకునే వాడు.
గుంటూరు జిల్లా పరిధిలో దాదాపు పదిహేను లంక గ్రామాలుండేవి. కృష్ణా జిల్లా పరిధిలో దాదాపు పాతిక లంక గ్రామాలుండేవి. ఈ లంక గ్రామాల్లో వేలాది ఎకరాలు చల్లపల్లి జమిందారు శ్రీమంతు రాజా యర్లగడ్డ శివరామ ప్రసాద్ బహదూర్ ఆధీనంలో ఉండేవి. మహత్తరమైన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం (1946-51) జరుగుతున్న సమయంలో, దానికి సమాంతరంగా ఇక్కడ చల్లపల్లి జమిందారుకు వ్యతిరేకంగా రైతాంగ పోరాటం జరిగింది. నాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఈ పోరాటం సాగింది.
చండ్రరాజేశ్వరరావు మార్గదర్శకత్వంలో జరిగిన ఈ పోరాటానికి, నాటి కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కొండపల్లి సీతారామయ్య, మరో నాయకుడు సనకా బుచ్చికోటయ్య నాయకత్వం వహించారు. తరతరాలుగా తాము సాగుచేస్తున్న భూముల కోసం రైతులు ఉద్యమించారు. ఈ పోరాటంలో గాజుల్లంక నుంచి జువ్వలపాలెంను ఆనుకుని ఉన్న ఆముదార్లంక వరకు ఉన్న భూములను రైతులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ నిర్బంధం మొదలైంది. పళనియప్పన్ నాయకత్వంలోని మలబారు పోలీసులను చల్లపల్లి జమిందారు దించాడు. పోలీసు తూటాలకు రైతులు ఎదురు నిలిచారు. పోలీసు కాల్పుల్లో అనేక మంది రైతులు నేలకొరిగారు.
ఈ భూ పోరాటంలో గుంటూరు జిల్లా పరిధిలో దాదాపు 105 మంది వరకు ప్రాణాలను కోల్పోగా, కృష్ణా జిల్లా పరిధిలో 155 మంది వరకు ప్రాణాలను కోల్పోయారు. ఒక్క కృష్ణా జిల్లా దివితాలూకాలోనే 36 మంది మలబారు పోలీసుల తూటాలకు నేలకొరిగారు. గాజుల్లంక భూముల కోసం పోరాటంలో బావిరెడ్డి వియమ్మ సహా నలుగురు రైతులను పోలీసులు కాల్చి చంపారు. దీనిపైన సాహిత్యం కూడా వచ్చింది. లక్ష్మీకాంత మోహన్ ‘రామరాజ్యం’ అన్న నవలను రాశారు. అలాగే మండే పిచ్చయ్య రాసిన ‘వ్యవసాయ కూలీ’ నవల ఆ నాటి నిర్బంధాన్ని చిత్రీకిరించింది.
స్వాతంత్యానంతరం భూ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం జమిందారీ వ్యవస్థను రద్దు చేసింది. జమిందారీ వ్యవస్థ రద్దు కావడంతో ఈ భూములన్నీ తనవేనని చల్లపల్లి జమిందారు కొందరు భూస్వాములకు, ధనిక రైతులకు వాటిని అమ్మేశాడు. ఈ భూములు చల్లపల్లి జమిందారువు కావని 1978 లో హైకోర్టు తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలతో రెండు వందల మంది రైతులు రెండు వందల ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.
జువ్వలపాలెంలో పదిరోజుల శిక్షణా తరగతులు పూర్తయ్యాయి. పదవ తేదీ సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యాను. తెనాలి నుంచి వెల్లటూరు మీదుగా జువ్వలపాలెంకు వచ్చిన దారిలో కాకుండా, మా బాబాయి ఆలూరు భుజంగరావు కుటుంబం ఉన్న గుడివాడకు వెళ్ళి, అటు నుంచి తిరుపతి వెళ్ళాలనుకున్నా. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు వరకు కృష్ణా నదిని దాటుకుని ప్రతి రోజూ అనేక మంది ప్రజలు వెళుతూనే ఉండడం పొద్దున పూట గమనించాను. కృష్ణా నది దాటితే నడకుదురు గ్రామం వస్తుంది. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో చల్లపల్లి వస్తుంది. అక్కడి నుంచి గుడివాడకు బస్సులుంటాయి.
వంటరిగా నడుచుకుంటూ కృష్ణా నది ఒడ్డుకు వెళ్ళాను. నదిని దాటుకుంటూ ముందుకు సాగుతున్నాను. సముద్రానికి పోటు వచ్చేసింది. ఆ విషయం నాకు తెలియదు. ముందుకు సాగుతున్న కొద్దీ సముద్ర జలాలు పాదాలు దాటి, మోకాటి వరకు వచ్చేశాయి. సూట్ కేసు తలపై పెట్టుకుని మొండిగా ముందుకు సాగుతున్నాను. సముద్రం నుంచి నీళ్ళు వెనక్కి తన్నుకు రావడం వల్ల కృష్ణా నదిలో నీళ్ళు నడుం దాకా వచ్చేశాయి. నదిలో దాదాపు సగం దూరం వచ్చేశాను.
దూరంగా నదిని దాటుతున్న ఒక పడవ సరంగు అక్కడే ఆగమని పెద్దగా అరిచాడు. అక్కడే ఆగిపోయాను. పడవ నా దగ్గరకు వచ్చేసింది. ‘‘సముద్రం పోటులో ఉంది. మునిగిపోతావుగా’’ అని మందలింపు దోరణిలో అరుస్తూ ఆసరంగు నన్నొక వెర్రిబాగులా చూశాడు. సముద్రం పోటులో ఉన్నప్పుడు నదిని ఎవరూ దాటరు. పడవలో నన్ను ఎక్కించుకుని ఆవలి ఒడ్డుకు కదిలాడు. నిజమే సముద్రం నుంచి నదిలోకి నీళ్ళు వెనక్కి తన్నుకు వస్తున్నాయి. సముద్రంలోని ఆటుపోట్ల గురించి నాకు తెలిస్తే కదా!
జువ్వలపాలెం కేసి వెనక్కి చూస్తూ, ఆ అలలపైన పడవలో ముందుకు కదులుతున్నాను. సముద్రం తన్నుకొస్తుంటే నది వెనక్కి వెళ్ళక తప్పదు. సముద్రుడి పోటుకు ఎవరు అడ్డం వచ్చినా ముంచేస్తుంది. రైతుల్లో కూడా పోటు లాగా తిరుగు బాటు వస్తే, జమిందారు కాదు కదా, వాడిని నియమించిన బ్రిటిష్ వాడు కూడా వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఇది చరిత్ర చెప్పిన గుణపాఠం. జువ్వలపాలెం సాహిత్య పాఠశాల నాకు నేర్పిన అనుభవ సారం.
ఎంత పోరాట పటిమ ఉన్న నేల ఇది!
ఒక పక్క బంగాళా ఖాతంలో కలవడానికి పోరాడుతున్న కృష్ణా నదీ ప్రవాహగానంలో, అటు ఆటుపోట్లకు గురయ్యే సముద్ర ఘోషలో రైతాంగ పోరాట చరిత్ర కలిసిపోయి అలా వినిపిస్తోంది. (సమాప్తం)

ఈ వ్యాసం మొదటి భాగం ఇక్కడ చదవండి

లంక భూముల్లో సాహితీ సేద్యం

జువ్వలపాలెం సాహిత్య పాఠశాల-1


Read More
Next Story