వ‌స్తే రండి...  ఆశ‌లు పెట్టుకోవ‌ద్దు
x

వ‌స్తే రండి... ఆశ‌లు పెట్టుకోవ‌ద్దు

తెలంగాణ‌ ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల తాజా ప‌రిస్థితి



పోయేవాడు పోతాడు బొబ్బ‌ర్లు రుబ్బ‌వే బోడెమ్మ అన్న‌ సామెత ఇప్పుడు బాగా గుర్తుకు వచ్చింది.
తెలంగాణ‌ ఎన్నిక‌ల్లో గెలిచిన ఎమ్మెల్యేల తాజా ప‌రిస్థితి ఇది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ఎన్నిక‌ల్లో గెలుస్తామో... ? లేదో అన్న భ‌యం. ఇప్పుడు గెలిచిన వారికి ఐదేళ్ల పాటు త‌మ భ‌విష్య‌త్తు ఏమిటో తెలియ‌ని ఆందోళ‌న‌. అప్పుడు భ‌యం. ఇప్పుడు ఆందోళ‌న‌. ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితి. ఇంకేముంది తాడో పేడో తేల్చేసుకుందామ‌ని నిర్ణ‌యించుకున్న‌వారు కొంద‌రు.

ఇక్క‌డో అనుమానం రావాలి. ఏంటా ఆందోళ‌న‌.. ఎందుకీ భ‌యం అన్న విష‌యంలో. అలా వ‌స్తే.. ఇక ముందుకు వెళ్ధాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల తీర్పు రానే వ‌చ్చింది. ఒక‌వైపు ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా కాంగ్రెస్ పార్టీ చ‌క‌చ‌కా ఏర్పాట్లు చేసుకుంటూ వెళుతోంది. ప్ర‌తిప‌క్ష‌పార్టీలో మ‌రో ఐదేళ్ల‌పాటు ఉండాల‌న్న ఆలోచ‌న వ‌స్తేనే త‌ట్టుకోలేని కొంత‌మంది ఎమ్మెల్యేలు గోడ దూక‌డానికి సిద్ద‌ప‌డ్డారు. ఈ పాటికి ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌నే పొక్కింది. టీ-పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఇప్ప‌టికే ప‌లువురు సంప్ర‌దింపులు జ‌రిపారు.

తెలంగాణ ప్ర‌జ‌లు రాష్ట్రంలోని రాజ‌ధాని మిన‌హా మిగతా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టి ఇచ్చారు. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే.. తెలంగాణ రాష్ట్రం న‌డిబొడ్డునున్న తామంతా ప్ర‌తిప‌క్షంలో ఉంటే ఎలా..? అని ఇప్పుడు ఆందోళ‌న మొద‌లైంది వారిలో. ఇప్ప‌టికే పార్టీ ఫిరాయించేందుకు ప‌లువురు తాజా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌ల‌తో చ‌ర్చ‌లకు సిద్ద‌ప‌డ్డారు. కానీ సీఎల్పీ నేత ఎంపిక‌, ప్ర‌భుత్వ ఏర్పాటు, మంత్రులశాఖ కేటాయింపుపై పార్టీ పెద్ద‌లు, ఏఐసీసీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది.


ఏ ఎండ‌కా గొడుగు ప‌ట్టేవారు.. అన్న‌ట్లు రంగారెడ్డి, హైద‌రాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన వారిలో ప‌లువురు కాంగ్రెస్ లో చేర‌డానికి రంగం సిద్దం చేసుకున్నారు. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్‌పార్టీ మూలాల ఉన్నావారే. కొంత మందిలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్.రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి అత్యంత స‌న్నిహితుల‌గా ఉన్న‌వారే. వీరికి కేవ‌లం కాంగ్రెస్ పార్టీలోనే కాదు అధిష్టానంతోనూ కొద్దో గొప్పో ఇప్ప‌టికీ సంబంధాలు బాగానే ఉన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి, ఇప్పుడు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకునే వారు బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున గెలిచిన వారితో ఉన్న స‌త్సంబంధాల‌తో పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.

ఇప్ప‌టికే చాలా మంది క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం, తెలంగాణ కాంగ్రెస్ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా ఉన్న డీ.కే.శివ‌కుమార్ తో ర‌హ‌స్య మంత‌నాలు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. అయితే మీరు పార్టీ మారితే మారండి. కానీ ఇప్పుడే ప‌ద‌వుల కోసం బేర‌సారాలు ఆడితే మాత్రం కుద‌ర‌దని ఖ‌రాఖండిగా చెప్పిన‌ట్లు తెలిసింది. మీరు గ‌తంలో బీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ప‌దేళ్ల‌పాటు అధికారంలో ఉండి, మంత్రి ప‌దువులు చేప‌ట్టిన వారే కాబ‌ట్టి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అది సాధ్యం కాద‌ని డీకేఎస్ తేల్చి చెప్పారు. ప‌ద‌వులు ఆశించ‌కుండా, పార్టీ వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించేత వ‌ర‌కూ ఓపిగ్గా ఉంటే... ఆ త‌రువాత చూద్దాం అని హామీ ఇచ్చిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇదిలా ఉంటే...మంత్రుల‌గా త‌మ స‌న్నిహితులు ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే ఆపైన తాము కాంగ్రెస్ లోకి వెళ్లిపోతామంటూ బాహాటంగా రంగారెడ్డి, హైద‌రాబాద్ ప్రాంతాల‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్ప‌డం కొస‌మెరుపు.


Read More
Next Story