
యుద్దకాండ
నేటి మేటి కవిత: బిఎస్ రాములు
నేను ఎన్నో గొప్ప యుద్దాలు చేసాను
ఎందరినో ఓడించాను.
ఎన్నో రాజ్యాలు జయించాను.
ఎందరో హతులయ్యారు
క్షతగాత్రులయ్యారు
విజేతగా నిలిచాను.
విజయ గర్వంతో పొంగి పోయాను.
ఈ చరిత్ర నిర్మాతను నేనని
వేన వేలు వీరుడిగా కొలిచారు
ఎటు చూసినా విజయ గీతికలే!
నా జీవితమంతా యుద్దాలతోనే
సరిపోయింది
పగలు లేదు రాత్రి లేదు
నిద్ర లేదు నిరంతం మెలకువే
ఎన్నడూ సుఖమన్నది లేదు
చరిత్ర నిండా ఎన్నో
విజయ చిహ్నాలు
రాజ భవనాల నిండా
ఎక్కడ చూసినా అవే
విజయ గీతికలు
కాలం గిర్రున తిరిగింది
కొత్త తరాలు వచ్చాయి
కొత్త అవసరాలు పెరిగాయి
కొత్త ఆయుధాలు వచ్చాయి
కొత్త యుద్దాలు పెరిగాయి
యుద్దాల తీరు మారింది
నా యుద్ద విజయ చిహ్నాలు
మ్యూజియంగా మారుతున్నాయి.
చరిత్ర లో కొత్తపుటలు
పెరుగుతున్నాయి
నా చరిత్ర అడుగున
మరుగు పడుతున్నది
నేను కీకారణ్యాల గుండా
రహదారులు వేసాను
యుద్దాల్లో రహదారుల నిర్మాణంలో
ఎంత రక్తం నేల రాలిందో
ఎందరి చెమట ఇంకిందో
విజయ గర్వంతో ఉప్పొంగి పోయాను
నా విజయాలు
కథలు గాధలుగా వినపడుతున్నాయి
కాలం చరిత్రను అక్షరీకరించింది
పుస్తకం తెరిచినపుడే
అది స్పూర్తి అవుతుంది
ఒక పాఠమవుతుంది
ఒక పాట అవుతుంది
ఒక అనుభవం అవుతుంది
ఒక జ్ఞాపకమవుతుంది
ఒక జ్ఞాన సంచయమవుతుంది
నేను ఎన్నో గొప్ప యుద్దాలు చేసాను
అవన్నీ ఇపుడు తెరవని పుస్తకంలా మవునంగా వుండి పోయాయి
నా ఆయుధాలు
మ్యూజియాలయ్యాయి.
Next Story

