హైదరాబాద్‌లో 40.9% మందికి ఫ్యాటి లివర్
x

హైదరాబాద్‌లో 40.9% మందికి ఫ్యాటి లివర్

నగర జీవనశైలి కారణంగా MASLD పెరుగుతోంది. పురుషుల్లో 46%, మహిళల్లో 36.2% కేసులు నమోదయ్యాయని అధ్యయనం వెల్లడి.


ఒకప్పుడు కాలేయ వ్యాధులంటే కేవలం మద్యం తాగే వారికే అనుకునేవారు. కానీ, నేడు పరిస్థితి మారింది. హైదరాబాద్‌లోని ప్రతి ఐదుగురిలో ఇద్దరికి కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోయింది. దేశవ్యాప్త సగటు 38.9% కాగా, హైదరాబాద్‌లో పురుషుల్లో 46 శాతం, మహిళల్లో 36.2 శాతం మందికి ఫ్యాటి లివర్ ఉన్నట్టు తేలింది. మరీ ముఖ్యంగా, ఏ రోజూ మద్యం ముట్టని వారు కూడా ఈ వ్యాధి బారిన పడుతుండటం గమనార్హం. వైద్యులు ఈ పెరుగుదలకు నగర జీవనశైలినే ప్రధాన కారణంగా గుర్తించారు.

హైదరాబాద్‌లో ప్రతి ఐదుగురిలో ఇద్దరికి ఫ్యాటి లివర్ వ్యాధి ఉన్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. నగరంలో 40.9 శాతం మంది పెద్దలు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్ (MASLD)తో జీవిస్తున్నారని తెలిపింది. ఇది దేశ సగటు 38.9 శాతాన్ని మించిందని స్పష్టం చేసింది. ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్’లో ప్రచురితమైన ఈ పాన్-ఇండియా అధ్యయనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశంలోని 27 నగరాల్లో 10వేల మందికి పైగా పెద్దలను సర్వే చేశారు.

రోజంతా ఏసీ గదుల్లో, కంప్యూటర్ల ముందు 8-10 గంటల పాటు కూర్చుని పనిచేసే ఐటీ ఉద్యోగుల్లో ఈ ముప్పు ఏకంగా 84 శాతంగా ఉందని ఏఐజీ (AIG) ఆసుపత్రి సర్వే వెల్లడించింది. బయటి తిండి, నిద్రలేమి, ఒత్తిడి ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. అధిక బరువు ఉన్నవారికే కాదు, చూడటానికి సన్నగా ఉన్నా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయిన (Lean Fatty Liver) వారికీ ఈ ప్రమాదం పొంచి ఉంది.

ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణం ఇదే

ఈ వ్యాధికి ఊబకాయం ప్రధాన ప్రమాద కారకంగా బయటపడింది. క్లాస్-2 ఊబకాయం ఉన్నవారికి సాధారణ బరువు ఉన్నవారితో పోలిస్తే దాదాపు 14 రెట్లు అధిక ప్రమాదం ఉన్నట్టు అధ్యయనం తెలిపింది. మధుమేహం ఉంటే ప్రమాదం రెండింతలు పెరుగుతోంది. అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ముప్పును పెంచుతున్నాయి.

వైద్యులు ‘లీన్ ఫ్యాటి లివర్’పై కూడా హెచ్చరిస్తున్నారు. సాధారణ బరువు ఉన్నవారిలో కూడా పొట్ట చుట్టూ కొవ్వు, దాగి ఉన్న మెటబాలిక్ సమస్యల వల్ల ఈ వ్యాధి వస్తోందని తెలిపారు. ఇది కేవలం లావు ఉన్నవారికే వస్తుందన్న భావన తప్పని పేర్కొన్నారు.

క్యాన్సర్ ప్రమాదం పెరుగుతోంది

నగర ఆసుపత్రుల్లో లివర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. హెపాటోసెల్యులార్ కార్సినోమా కేసులు ఇటీవల సంవత్సరాల్లో దాదాపు రెట్టింపు అయినట్టు వైద్యులు పేర్కొన్నారు. ముక్త శ్రీనివాసులు.. ఫ్యాటి లివర్, ఊబకాయం, మధుమేహం వంటి కారణాలు లివర్ సిరోసిస్, క్యాన్సర్‌కు దారితీస్తున్నాయని తెలిపారు.

యువతలో కూడా లివర్ క్యాన్సర్ కేసులు 40 నుంచి 50 శాతం వరకూ కనిపిస్తున్నాయని వైద్యులు ఆనంద్ కులకర్ణి వెల్లడించారు. చాలా మంది ఆలస్యంగా ఆసుపత్రికి వస్తున్నారని చెప్పారు. వైరల్ హెపటైటిస్ కంటే ఫ్యాటి లివర్ ఇప్పుడు ప్రధాన కారణంగా మారిందని పేర్కొన్నారు.

లివర్ ఇచ్చే సిగ్నల్స్

లివర్ తన చుట్టూ కొవ్వు పేరుకుపోయినప్పుడు మనకు 'హెచ్చరికలు' పంపుతుంది. అలసట, ఆకలి మందగించడం, పొట్టలో కుడివైపు పైభాగంలో నొప్పి లేదా అసౌకర్యం వంటివి కనిపిస్తే అప్రమత్తం కావాలి. డయాబెటిస్, బీపీ ఉన్నవారికి ఈ ముప్పు రెట్టింపు అవుతుంది.

తిరుగు ప్రయాణం సాధ్యమేనా?

కథ ఇక్కడితో ముగిసిపోదు. ఫ్యాటీ లివర్ అనేది ఒక 'రివర్సిబుల్' (తిరిగి నయం చేసుకోదగ్గ) సమస్య. 3 నుండి 6 నెలల్లో: మీ జీవనశైలిని మార్చుకుంటే కాలేయంలోని కొవ్వును కరిగించవచ్చు. బరువు నియంత్రణ: మీ శరీర బరువులో కనీసం 5-10% తగ్గడం వల్ల కాలేయం తన మునుపటి స్థితికి చేరుకుంటుంది. ఆహార నియమాలు: పంచదార, మైదా, జంక్ ఫుడ్ తగ్గించి.. ఆకుకూరలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ తీసుకోవాలి. వ్యాయామం: రోజుకు 30 నిమిషాల వేగవంతమైన నడక లేదా యోగా కాలేయానికి ప్రాణం పోస్తాయి.

లివర్ క్యాన్సర్ లేదా సిర్రోసిస్ వంటి ప్రాణాంతక దశకు వెళ్ళకముందే మనల్ని మనం మార్చుకోవాలి. లివర్ అనేది మన శరీరానికి ఒక 'ఫిల్టర్'. అది శుభ్రంగా ఉంటేనే మన జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక చిన్న నడక, ఒక సరైన ముద్ద.. మీ కాలేయాన్ని మళ్ళీ చిగురింపజేయవచ్చు.

Read More
Next Story