తెలంగాణకు పెరుగుతున్న గుండెపోటు
x

తెలంగాణకు పెరుగుతున్న గుండెపోటు

తెలంగాణలో నమోదవుతున్న సర్టిఫైడ్ మరణాల్లో హార్ట్ ఎటాక్స్, హై బీపీ, స్ట్రోక్స్ కారణంగా సంభవిస్తున్నవే 42శాతం ఉన్నాయి.


అతని వయసు 17 సంవత్సరాలు. ఎన్నో కలలు కంటూ వాటిని నిజం చేసుకోవాలన్న లక్ష్యంతో తన ఇంటర్ విద్యను కొనసాగిస్తున్నాడు సాయి. బాగా చదువుకున్నాడు.. ఎగ్జామ్‌లో ప్రతి ప్రశ్నకు తన దగ్గర జవాబు ఉంది. అన్నీ రాయాలన్న తపన, కసి ఉన్నాయి. కానీ దురదృవశాత్తు.. అతనిని ఇంతలోనే మృత్యువు కబలించింది. పరీక్ష హాల్లోనే ఛాతీని పట్టుకుని నొప్పితో విలవిలలాడుతూ పడిపోయాడు. అంతే స్పృహ తప్పాడు. టీచర్లు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాయి మరణించడాదని వైద్యులు చెప్పారు. హార్ట్ ఎటాక్ కారణంగానే సాయి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సాయి.. బాగ్ అంబర్‌పేటలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. 17ఏళ్ల కుర్రాడు.. నూగునూగు మీసాలతో కలల సౌధాలను నిర్మిస్తున్న సాయి మరణం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు దారితీసింది. 17ఏళ్ల వయసులో హార్ట్ ఎటాక్ ఏంటి? అన్న ప్రశ్న తలెత్తింది. ఇలా ఇదొక్క ఘటన కాదు.. ఇంకా మరెన్నో ఉన్నాయి. స్కూల్లో చదువుతున్న చిన్నారులు సైతం గుండెపోటుకు గురైన ఘటనలు తెలంగాణలో చాలా నమోదయ్యాయి.

ఈ ఘటనలపై గుండె సంబంధిత వైద్యులు స్పందిస్తూ.. దీనికి ఎక్కువగా జీవనశైలే కారణమని చెప్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం అత్యధిక మరణాలకు కారణం గుండె సంబంధిత వ్యాధులేనని చెప్తున్నారు. ప్రతి ఐదు మెడికల్లీ సర్టిఫైడ్ మరణాల్లో రెండు మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణం అవుతున్నాయని వివరించారు. ఇండియా రిజిస్ట్రాట్ జనరల్ విడుదల చేసిన మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్(MCCD) ప్రకారం.. తెలంగాణలో నమోదవుతున్న సర్టిఫైడ్ మరణాల్లో హార్ట్ ఎటాక్స్, హై బీపీ, స్ట్రోక్స్ కారణంగా సంభవిస్తున్నవే 42శాతం ఉన్నాయి.

మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్ అంటే..?

మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్(వైద్యపరంగా ధృవీకరించిన మరణాలు) అనేవి, ఒక వ్యక్తి మరణానికి దారితీసిన కారణాలు, వాటి క్రమం, సంబంధిత పరిస్థితులను అర్హత కలిగిన వైద్యుడు ప్రామాణిక ఫారం (MCCD) ద్వారా అధికారికంగా నమోదు చేసే ప్రక్రియ. ఈ నమోదు చట్టపరమైన అవసరాలు, గణాంకాల సేకరణ, ప్రజారోగ్య పరమైన ఉపయోగాల కోసం చాలా ముఖ్యమైంది. ఇందులో మరణానికి దారితీసిన ప్రధాన వ్యాధి లేదా పరిస్థితి, అలాగే తక్షణ మరణ కారణం స్పష్టంగా చెప్పబడుతుంది. జనాభా ఆరోగ్య స్థితిని సరైన విధంగా అర్థం చేసుకోవడానికి, సమర్థవంతమైన ఆరోగ్య కార్యక్రమాలు రూపొందించడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది.

ఎంసీసీడీ ఒక వార్నింగ్ బెల్: జగదీష్

తెలంగాణ మరణాల్లో గుండె సంబంధి వ్యాధుల శాతానికి సంబంధించి ఎంసీసీడీ విడుదల చేసిన రిపోర్ట్‌పై హైదరాబాద్‌లోని యశోధ ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జగదీష్ రెడ్డి స్పందించారు. ఇది గణాంకాలు మాత్రమే కాదని, మనకు ఇస్తున్న వార్నింగ్ బెల్ అని అన్నారు. మన జీవన శైలి మనపై చూపుతున్న ప్రభావాన్ని ఈ డేటా అద్దం పడుతుందని వివరించారు. ‘‘ఎక్కువ గంటలు కూర్చుని పని చేయడం, ఫాస్ట్ ఫుడ్, స్మోకింగ్, నిద్రలేమి, ఒబేసిటీ, తీవ్రమైనన ఒత్తిడి ఇవన్నీ కూడా మనకు తెలియకుండా మన గుండెకు డ్యామేజ్ చేస్తున్నాయి’’ అని అన్నారు.

‘‘ఇప్పుడున్న సమయంలో 30-40 సంవత్సరాల వాళ్లలో కూడా హార్ట్ ఎటాక్‌లు షరామామూలు అయిపోయాయి. యంగ్, ఫిట్‌గా ఉన్న వాళ్లు కూడా గుండె ధమనుల బ్లాకేజ్‌తో ఐసీయూలో పడుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు ప్రస్తుతం వయసుతో సంబంధంలేని అంశాలుగా మారిపోయాయి. ఇది ఇప్పుడు యువతలో జీవనశైలి సంబంధిత సమస్యగా అవతరించింది’’ అని తెలిపారు.

కూర్చోవడమే కొంపముంచుతుంది: సుధీర్

యువతలో పెరుగుతున్న గుండె సమస్యలపై హైదరాబాద్‌లోని సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌గా ఉన్న సుధీర్ కోగంటి కూడా స్పందించారు. ఎక్కువగా కూర్చోవడమే యువత కొంప ముంచుతుందని ఆయన అన్నారు. ‘‘సాధారణంగా హార్ట్ ఎటాక్, గుండె సంబంధిత సమస్యలను వృద్ధుల సమస్యలగా చెప్తారు. కానీ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం విస్తుబోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వారిలో కూడా హార్ట్ ఎటాక్స్ పెరుగుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తుంది. దీనికి అనారోగ్యకరమైన జీవనశైలి, పెరుగుతున్న ఒబేసిటీ, స్ట్రెస్, జెనెటిక్స్ వంటికి కీలక పాత్ర పోషిస్తున్నాయి’’ అని చెప్పారు.

‘‘డైట్, వ్యాయామం, స్మోకింగ్, మద్యం సేవించడం ఇవన్నీ కూడా గుండెపై ప్రభావం చూపుతాయి. వాటన్నింటికన్నా ప్రస్తుత యువత తమ రోజులో ఎక్కువ సేపు కూర్చునే ఉంటుంది. కంప్యూటర్లు, టీవీ లేదా ఇతర గ్యాడ్జెట్స్ ముందు కూర్చునే ఉంటున్నారు. దానికి తోడు అనారోగ్యకరమైన కొవ్వులు, అధికంగా షుగర్ ఉండే ఫాస్ట్ ఫుడ్‌ను తింటున్నారు. వీటికి మెంటల్ హెల్త్ కూడా తోడయి వారి గుండెను బలహీనపరుస్తుంది’’ అని సుధీర్ వివరించారు.

నియంత్రణ సాధ్యమే: సుధీర్

అయితే యంగ్ ఏజ్‌లో వస్తున్న ఈ గుండె సమస్యలను నియంత్రించవచ్చని సుధీర్ అంటున్నారు. అందుకు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదని, ప్రతి రోజూ మనం చేస్తున్న బ్యాడ్ హ్యాబిట్స్‌ బదులు మనకు మేలు చేసే పనులు చేయాలని అన్నారు. ‘‘మంచి డైట్ మెయింటెయిన్ చేయడం. ప్రతి రోజూ కనీసం కార్డియోవాస్కిలర్ వ్యాయామం 150 నిమిషాలు చేయాలి. ఒత్తిడి నిర్వహణపై దృష్టి పెట్టాలి. వీటన్నింటితో పాటు రెగ్యులర్‌గా హెల్త్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ధూమపానం, మద్యపానానికి వీలయినంత దూరంగా ఉండాలి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి సంబంధించి విషయాలను తెలుసుకుంటూ ఉండాలి. మీ గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి’’ అని సుధీర్ సూచించారు.

ఒత్తిడి అసలు కారణం: రఘు

యువతలో గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంలో ప్రధాన పాత్ర ఒత్తిడి అని హైదరాబాద్ సోమాజీగూడలోని యశోధ ఆసుపత్రిలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అయిన డాక్టర్ రఘు పేర్కొన్నారు. స్ట్రెస్ ఎప్పుడూ ఒక సైలెంట్ కిల్లర్‌ అని వివరించారు. ‘‘ఒత్తిడి మన శరీరంలో కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. దాంతోపాటు రక్తపోటును పెంచి రక్త నాళాలను దెబ్బతీస్తుంది. ఒత్తిడి మన గుండెను ప్రమాదంలో పడేస్తుందని ఇవి స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్, పోటీ తత్వపు పని వాతావరణం, వేగంగా నడుస్తున్న జీవితం, సామాజిక అంచనాలను అందుకోవాల్సిన ఆవశ్యకత, అకడామిక్ ఒత్తిడి ఇవన్నీ కూడా ఒత్తిడికి కారణాలే. ఇంకా ఇప్పటి డిజిటల్ తరంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలన్న ఆలోచన కూడా ఒత్తిడిని అధికం చేస్తుంది. ఇది వెంటనే ప్రభావం చూపదు. కానీ రానురాను తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని డాక్టర్ రఘు వివరించారు. ఒత్తిడి మన బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను పెంచుతుందని, కొలెస్ట్రాల్ నిల్వ చేరేలా చేస్తుందని, పెరిగిన బీపీ ఇవన్నీ కూడా రక్త నాళాల్లో పేరుకుపోయి గుండె పోటుకు దారితీసే అవకాశం ఉంని ఆయన తెలిపారు.

వీటి నుంచి బయట పడాలంటే స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలని, అందుకు కొన్ని మార్గాలు పాటించాలని అంటున్నారు. ‘‘నిన్ను మించిన టాస్క్‌లకు నో చెప్పడం నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వాలి. మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. మెడిటేషన్ లాంటి శాంతినిచ్చే వ్యాయామం చేయండి’’ అని ఆయన సూచించారు. వీటన్నింటితో పాటు ప్రతి రోజూ 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలని తెలిపారు.

మిగిలిన 58శాతం మరణాలు ఇవే..

మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్‌లో మిగిలిన 58 శాతం వివిధ కారణాల వల్ల సంభవించినవిగా నమోదయ్యాయి. ఇందులో న్యుమోనియా, ఆస్తమా, క్రానిక్ అబ్‌స్ట్ర‌క్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) వంటి శ్వాసకోశ వ్యాధులు (7.2 శాతం), అంటువ్యాధులు (3.3 శాతం), క్యాన్సర్లు, గాయాలు అలాగే మూత్ర-జననేంద్రియ సంబంధిత వ్యాధులు (3.4 శాతం) ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో అంటువ్యాధులు అలాగే అసంక్రమణీయ వ్యాధులు రెండూ ఒకేసారి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్న డ్యూయల్ బర్డెన్‌ను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Read More
Next Story