
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
అమెరికా విమర్శలను తిప్పికొట్టిన భారత్
యూఎస్, ఈయూ రెండు ఇప్పటికి రష్యాతో వాణిజ్యం నెరుపుతున్నాయని గణాంకాలు వివరించి న్యూఢిల్లీ, ఆధిపత్యం ప్రపంచం ఉండకూడదన్న జైశంకర్
భారత్ లక్ష్యంగా అమెరికా, ఈయూ చేస్తున్న విమర్శలు, ఆంక్షలను న్యూఢిల్లీ బలంగా తిప్పికొట్టింది. రష్యా నుంచి భారీ స్థాయిలో చమురు కొనుగోలు చేస్తూ ఇతర దేశాలకు విక్రయిస్తూ ఇండియా లాభపడుతుందని, ఉక్రెయిన్ పౌరుల మరణానికి కారణం అవుతుందని ట్రంప్ విమర్శలు చేశాడు.
భారత్ పై సుంకాలు, జరిమానా పెంచే పనిచేస్తానని కూడా హెచ్చరించాడు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే భారత విదేశాంగ శాఖ ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈయూ, అమెరికా రెండు రష్యా నుంచి తమ అవసరాలకు వస్తువులు, ముడి సరుకు దిగుమతి చేసుకుంటున్నాయని, కానీ న్యూఢిల్లీ మాత్రం చేసుకోకూడదని హెచ్చరిస్తుందని తెలిపింది.
ఈ రెండు కూడా ద్వంద్వ ప్రమాణాలు అనుసరిస్తున్నాయని దుయ్యబట్టింది. భారత్ తన వాణిజ్య, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ దేశంతో నైనా వ్యాపారం చేస్తుందని ప్రకటించింది.
ద్వంద్వ ప్రమాణాలు..
రష్యా నుంచి యూరప్ తన ఇంధన అవసరాలను మాత్రమే కాకుండా ఎరువులు, మైనింగ్ ఉత్పత్తులు, రసాయనాలు, ఇనుము- ఉక్కు, యంత్రాలు, రవాణా పరికరాలు దిగుమతి చేసుకుంటుందని విదేశాంగ శాఖ ఎత్తిచూపింది.
అణురంగానికి సంబంధించిన రష్యన్ యూరేనియం, హెక్సాఫ్లోరైడ్, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు అవసరమైన పల్లాడియం, వివిధ ఎరువులు, రసాయనాలను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుందని తెలిపింది. కానీ భారత్ మాత్రం రష్యాతో వాణిజ్యం నెరపొద్దని ఆంక్షలు విధిస్తోందని ఇది అన్యాయం, అసమంజసం అని పేర్కొంది.
‘‘ప్రపంచంలోని ఏదైన ప్రధాన ఆర్థిక వ్యవస్థ మాదిరిగానే భారత్ తన జాతీయ ప్రయోజనాలు, ఆర్ధిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైనందతా చేస్తుంది’’ అని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వివరించింది.
ప్రారంభంలో ప్రోత్సాహం..
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయిన దగ్గర నుంచి భారత్, రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటూ ఉంది. అయితే ఈ చర్యను యూరప్, అమెరికా విమర్శిస్తున్నాయి. అయితే తమ సాంప్రదాయ ముడి సరఫరాదారులను మార్చిన తరువాత న్యూఢిల్లీ, మాస్కో వైపు మొగ్గు చూపాల్సిన అవసరం వచ్చిందని చెబుతూ వస్తోంది.
‘‘ప్రారంభంలో ప్రపంచ ఇంధన మార్కెట్లను స్థిరీకరించడంలో సహయపడటానికి భారత్ చమురు కొనుగోళ్లను అమెరికా ప్రొత్సహించింది’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. దేశీయ వినియోగదారులకు స్థిరమైన, సరసమైన ఇంధన ధరలను అందించడానికి భారత్ దిగుమతులు ఉద్దేశించబడ్డాయని తన ప్రకటనలో ఎంఈఏ పేర్కొంది.
రష్యా- ఈయూ వాణిజ్యం..
విదేశాంగ చేసిన ప్రకటనలో పలు గణాంకాలను ఉదహరించింది. రష్యాతో ఈయూ చేస్తున్న ద్వైపాక్షిక వాణిజ్యం 2024 లో 67.5 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఇవే కాకుండా సేవా రంగంలో వీటి విలువ 2023 లో 17 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుందని వివరించింది. ఇవి భారత్, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న చమురు కంటే చాలా ఎక్కువని సోదాహారణంగా పేర్కొంది.
యూరప్, రష్యా నుంచి దిగుమతి చేసుకునే ఎల్ఎన్జీ గ్యాస్ 2024 లో రికార్డు స్థాయికి చేరిందని వివరించింది. 2022 లో ఇది 15.21 మిలియన్ టన్నులు ఉండగా, 2024 లో 16.5 మిలియన్ టన్నులకు చేరిందని తెలిపింది.
భారత్ చమురు విక్రయిస్తోంది: ట్రంప్
రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్ దాన్ని శుద్ది చేసి అంతర్జాతీయ మార్కెట్ లో విక్రయించి లాభపడుతుందని ట్రంప్ ఆరోపించారు.
‘‘భారత్, రష్యన్ చమురును భారీ మొత్తంలో కొనుగోలు చేయడమే కాదు.. వారు కొనుగోలు చేసిన దానిలో ఎక్కువ మొత్తంలో బహిరంగం మార్కెట్ లో ఎక్కువ లాభాలకు అమ్ముతున్నారు’’ అని తన సొంత సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ‘‘రష్యన్లు చేస్తున్న యుద్ధం వల్ల ఉక్రెయిన్ లో ఎంతమంది చంపబడుతున్నారో వారు పట్టించుకోవడం లేదు’’ అని ఆరోపించారు.
కాంగ్రెస్ విమర్శలు..
ట్రంప్ భారత్ పై మరోసారి సుంకాలు విధిస్తామని హెచ్చరించిన తరువాత కాంగ్రెస్ స్పందించింది. మోదీ ప్రభుత్వం విదేశాంగ విధానంపై విమర్శలు గుప్పించింది. ‘‘ కౌగిలింతలు, కరచాలనాలు బాగా కనిపించినప్పటికీ అమెరికన్ నాయకుడు షాక్ ఇచ్చారు’’ అని పేర్కొంది.
‘‘హౌడీ మోదీకి చాలా ఇష్టం. నమస్తే ట్రంప్ కి కష్టం. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ కి చాలా ఇష్టం. నరేంద్ర మోదీ భారత్ ట్రంప్ కార్డుగా కీర్తిస్తున్న బీజేపీ ఎంపీలకు చాలా ఇష్టం’’ అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్ చార్జ్ కమ్యూనికేషన్స్ జైరాం రమేష్ వ్యంగ్యంగా ఎక్స్ లో పోస్ట్ చేశాడు.
ఆధిపత్యం కుదరదు.. జైశంకర్
ప్రస్తుత ప్రపంచంలో బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థలు అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో జరిగిన బీమ్స్ టెక్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒకదేశం మరో దేశంపై ఆధిపత్యం చేసే చెలాయించడం కుదరదన్నారు. ‘‘కొంతమంది ఆధిపత్యం వహించే ప్రపంచాన్ని కాకుండా, న్యాయమైన ప్రాతినిధ్య ప్రపంచ క్రమాన్ని చూడాలనేది మా కోరిక’’ అని ఆయన అన్నారు.
Next Story