‘‘రేర్ ఎర్త్ మినరల్స్ ను కలిసి వెలికితీద్దాం’’
x
భారత ప్రధాని నరేంద్ర మోదీ- రష్యా అధ్యక్షుడు పుతిన్

‘‘రేర్ ఎర్త్ మినరల్స్ ను కలిసి వెలికితీద్దాం’’

భారత్- రష్యా మధ్య కుదిరిన ఒప్పందం


రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకుంటున్న భారత్ పై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో న్యూఢిల్లీ- మాస్కో ప్రతినిధులు సమావేశం అయ్యారు. అరుదైన ఖనిజాల వెలికితీత, భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్, ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాల సృష్టి వంటి అనేక రంగాలలో పారిశ్రామిక సహకారంపై చర్చలు జరిపారు.

వాణిజ్యం, ఆర్థికం, శాస్త్రీయం, సాంకేతికం, సాంస్కృతిక సహకారంపై భారత్ రష్యా ప్రతినిధులు మధ్య చర్చలు జరిగినట్లు వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత్- రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ చట్రం కింద భారత్ లో జరిగిన సమావేశంలో ఆధునీకరణ, పారిశ్రామిక సహకారం, భారత్- రష్యా వర్కింగ్ గ్రూపు చర్చలలో ఈ అంశం చర్చకు వచ్చిందని పేర్కొంది.

అరుదైన ఖనిజాలు..
భారత్ తరఫున పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రొత్సాహక శాఖ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా ప్రాతినిధ్యం వహించగా, రష్యా తరఫున పరిశ్రమలు, వాణిజ్య ఉప మంత్రి అలెక్సీ గ్రుజ్ దేవ్ హజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇరు దేశాలకు చెందిన 80 మంది ప్రతినిధులు హజరయ్యారు.
కీలకమైన ఖనిజాల వెలికితీత, భూగర్భ గ్యాసిఫికేషన్, ఆధునిక పారిశ్రామిక మౌలిక సదుపాయాల సృష్టిలో అవకాశాలను ఇరుపక్షాలు అన్వేషించాయి’’ అని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
అరుదైన ఖనిజాలైన రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటివి వేగంగా అభివృద్ది చెందుతున్న క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల పెరుగుదలకు, వాటి విస్తరిస్తున్న ఉపయోగాలకు, పవన టర్బైన్లు, విద్యుత్ నెట్ వర్క్ ల నుంచి విద్యుత్ వాహనాలు, బ్యాటరీ తయారీ వరకూ ఇంధనంగా అవసరం.
అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల మధ్య ఏడు అరుదైన ఖనిజాల ఎగుమతి పై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ఈ చర్య భారత దేశ ఆటో మొబైల్ రంగాన్ని దెబ్బతీసింది.
ప్రస్తుతం చైనా ప్రపంచంలోని అరుదైన ఖనిజాలలో 90 శాతం సరఫరా చేస్తుంది. అరుదైన భూమి అయస్కాంతాలు, సమారియం, నియోడైమియం, డిస్ప్రోసియం వంటి మూలకాలపై దానికి గుత్తాధిపత్యం ఉంది.
ప్రస్తుతం రష్యాతో జరిగిన సమావేశంలో ఆధునీకరణ చెందిన విండ్ టన్నెల్, చిన్న విమాన పిస్టన్ ఇంజిన్ల ఉత్పత్తి, కార్బన్ ఫైబర్ టెక్నాలజీ, సంకలిత తయారీ, త్రీడీ ప్రింటింగ్, ఏరోస్పేస్ సైన్స్, టెక్నాలజీలో కీలక సహకారం వంటివి చర్చకు వచ్చినట్లు భారత్ తెలిపింది.
ప్రొటోకాల్ సంతకం..
అల్యూమినియం, ఎరువులు, రైల్వే రవాణా, మైనింగ్ రంగ పరికరాలు, అన్వేషణ, పారిశ్రామిక, గృహ వ్యర్థాల నిర్వహణలో సామర్థ్య నిర్మాణం, సాంకేతిక బదిలీ వంటి రంగాలలో మెరుగైన ఒప్పందం కుదరడంపై ఇరు దేశాలు స్వాగతించాయి.
‘‘భారత్- రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, పారిశ్రామిక, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి భాగస్వామ్య నిబద్దతను పునరుద్ఘాటిస్తూ 11 వ సెషన్ ప్రోటోకాల్ పై ఇద్దరు సహ అధ్యక్షులు సంతకం చేయడంతో సమావేశం ముగిసిందని భారత్ ప్రకటించింది. భారత్ పై అమెరికా భారీ స్థాయిలో సుంకాలు విధించిన తరువాతే ఈ రోజు సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read More
Next Story