
ఇంధన ట్యాంకర్ పేలి 31 మంది మృతి
ఈజిప్ట్ రాజధాని ‘కైరో’ హైవేపై ఘోర ప్రమాదం..
ఈజిప్టు రాజధాని కైరోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇంధన ట్యాంకర్ ఓ వాహనాన్ని ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు రెండు డజన్లకు పైగా కార్లు, మోటార్ సైకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
కైరో నగరాన్ని చుట్టు ఉన్న కీలకమైన రింగ్ రోడ్డుపై బుధవారం ఈ ఘటన జరిగింది. గిజా ప్రాంతంలోని జనసాంద్రత ఎక్కువగా ఉండే వారాక్ పరిసరాల్లో ఇంధన ట్యాంకర్ ప్రమాదానికి గురైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి రహదారిపై వెళ్తున్న వాహనాలకు వ్యాపించాయి.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటల్లో చిక్కుకున్న కార్ల నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాద దృశ్యాలను చూసేందుకు వందలాది మంది స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సీసీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం వెల్లడించింది.
ఈజిప్టు ఆరోగ్య మంత్రి ఖాలెద్ అబ్దెల్ గఫార్ స్వయంగా ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన మృతుల సంఖ్య ప్రాథమికమేనని, సహాయక చర్యలు, వివరాల సేకరణ పూర్తయ్యే కొద్దీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈజిప్టులో రోడ్డు ప్రమాదాలు ఏటా వేలాది మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. అతివేగం, అధ్వానమైన రహదారులు, ట్రాఫిక్ నిబంధనల అమలులో లోపాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలోనూ దక్షిణ ఈజిప్టులోని బెనీ సూఫ్ ప్రావిన్స్ సమీపంలో జరిగిన భారీ వాహనాల వరుస ప్రమాదంలో 21 మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. తాజాగా కైరో రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ఘోర ప్రమాదం ఈజిప్టులో రహదారి భద్రతపై మరోసారి ఆందోళనలను పెంచింది.
Next Story
