70 యేళ్లయినా ‘పంచశీల’ ఇంకా పవిత్రమైనదే..
x
source: Claude Arpi's Blog

70 యేళ్లయినా ‘పంచశీల’ ఇంకా పవిత్రమైనదే..

ఆనాటి చైనా ప్రధాని చౌఎన్ లై, భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూలు శాంతియుత సహజీవనాని కోసం రూపొందించి, ఆమోదించిన 1954 ఐదు సూత్రాల పంచశీలకు 70 యేళ్లు...



ఇరు దేశాల మధ్య శాంతి సహజీవన సంబంధాలకు ప్రాతిపదికగా ఆనాటి చైనా ప్రధాని చౌఎన్ లై (Zhou Enlai), భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూలు రూపొందించి, ఆమోదించి, 1954 లో సంతకాలు చేసిన ఐదు సూత్రాల ఒప్పందం పంచశీల (Panchasheel). శాంతియుత సహజీవన సూత్రాల ఒప్పందం 70 వ వార్షికోత్సవ సందర్భంగా 28-06-2024న బీజింగ్ లో ఒక అంతర్జాతీయ సదస్సు, ఇతర స్మారక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సదస్సులో అనేకమంది విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, విదేశాంగ మంత్రి వాన్ యీ కీలక ప్రసంగాలు చేశారు.


ప్రస్తుత అంతర్జాతీయ సంబంధాలలో ఈ సదస్సు,ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉందని, శాంతియుత సహజీవనం ఐదు సూత్రాల నుండి "మానవాళికి భాగస్వామ్య భవిష్యత్తుతో సమాజాన్ని నిర్మించడం" వరకు అది విస్తరించిందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాదు కొన్ని దేశాలు, ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా దాని మిత్ర దేశాలు శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలను పాటించడం లేదు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకొని తమ ఆధిపత్యాన్ని రుద్దడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితిని మరింత దిగ జార్చు తున్నాయి. ఈ ఆధిపత్య ముఠా కూటములు కట్టి, అనేక ఘర్షణలను రేకెత్తిస్తున్నది. ఈ దౌర్జన్యం ద్వారా అంతర్జాతీయ వ్యవస్థపై తమ ఆధిపత్యాన్ని,అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తున్నది. దురహంకారంతో దేశాల మధ్య సంఘర్షణ లను ప్రేరేపిస్తున్నది. స్వప్రయోజనాలను పొందడానికి వివాదాలను రెచ్చగొడుతున్నది. ప్రపంచంలోని బహుళ ధృవీకరణను ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తున్నది. దానితో అనేక దేశాలు గందరగోళం, సంఘర్షణలు, అంతర్యుద్ధాలు, వర్ణ విప్లవాలతో సమస్యల పాలవుతున్నాయి. అందువల్ల శాంతియుత సహజీవన సూత్రాలు నేడు మరింత ప్రాసంగికతను సంతరించుకున్నాయి.




పంచశీల నేపధ్యం: 1947 లో భారత్, 1949 లో చైనా, వలస వాద పరిపాలన నుండి బయటపడిన తరువాత ఇరుగు పొరుగు దేశాలతో చారిత్రక, భౌగోళిక అంశాల వల్ల అనేక సర్దుబాట్లు, కొత్త ఒప్పందాలు చేసుకోవలసి వచ్చిం ది. భారత్ తనకు టిబెట్ లో బ్రిటిష్ కాలం నుండి వున్న ప్రత్యేక వ్యాపార ఏర్పాట్ల గురించి చర్చించటానికి డిసెంబర్ 1953 లో బీజింగ్ వెళ్ళింది. ఆ భారత ప్రతినిధి బృందానికి, చైనా విదేశీ సంబంధాల నిర్వహణలో పాటించే సూత్రాలు గా ఈ సహజీవన సూత్రాలను ముందుకు తెచ్చారు. చైనా ప్రధాని జౌ ఎన్ లై ప్రతిపాదించిన ఐదు సూత్రాలు ఇవి., "1. ఇతరుల సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతల పట్ల పరస్పర గౌరవం కలిగి వుండటం 2 ఒకరిపై ఒకరు దురాక్రమణ చేయక పోవటం 3. ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకపోవడం 4 సమానత్వం, పరస్పర ప్రయోజనా లను గుర్తించి మెలగటం, 5. శాంతియుత సహజీవనం గరపటం". వీటిని చర్చించి అంగీకరించిన ఇరు దేశాలు 1954 ఏప్రియల్ లో ఒక పూర్తిస్థాయి ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. నెహ్రూ , చౌఎన్ లై లు సంయుక్తంగా రూపమిచ్చిన అంగీకార పత్రమది. వలస వ్యవస్థలనుండి బయటపడుతున్న దశలో పరస్పర సహాయ సహకారాలు కోరుకుని వాటిని స్థిర పరుచుకునే ఉద్దేశ్యంతో చేసుకున్న శాంతియుత సహజీవన ఒప్పందం అన్నమాట. ఆ తరువాత 1955లో ఇండోనేషియాలో జరిగిన ఆసియా-ఆఫ్రికన్ కాన్ఫరెన్స్[ బాండుంగ్ కాన్ఫరెన్స్ ] లో జౌ ఎన్ లై "విభేదాలను పక్కనపెట్టి ఉమ్మడి ప్రాతిపదికను కోరడం" అన్న భావన ప్రవేశపెట్టి , శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలను మరింత విశదీకరించారు. అప్పటినుంచి ఇవి కొత్తగా స్వాతంత్ర్యం సాధించుకున్న అన్ని దేశాలకు. అంతర్జాతీయ సంబంధాల కు ఆమోదయోగ్యమైన సూత్రాలుగా గుర్తించబడ్డాయి. ఐదు సూత్రాలు ప్రపంచదేశాలచే విస్తృతంగా ఆమోదించబడ్డాయి, అంతర్జాతీయ సంబంధాలను నియంత్రించే ప్రాథమిక ప్రమాణాలుగా మారాయి




శాంతియుత అభివృద్ధి పథంలో కొనసాగాలన్న చైనా సంకల్పం మారదు: జిన్ పింగ్

“గత 70 ఏళ్లలో శాంతియుత సహజీవనపు ఈ ఐదు సూత్రాలు స్థల, కాలాలను అధిగమించాయని, విభేదాలను తగ్గించటం లో తోడ్పడ్డాయని, ఇవి శాశ్వత ఔచిత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని” చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ సదస్సులో వ్యాఖ్యా నించారు. నేడు పంచశీల సూత్రాలు అంతర్జాతీయ సంబంధాలకు, అంతర్జాతీయ చట్టాలకు విశ్వవ్యాప్తంగా వర్తించే ప్రాథమిక నియమాలుగా మారాయి. మానవ పురోగతికి చెరగని చారిత్రక సహకారం అందించాయి. వివిధ సామాజిక వ్యవస్థలతో విభిన్నంగా, వైవిధ్యంగా వున్న దేశాల మధ్య సంబంధాల స్థాపన, అభివృద్ధికి ఇవి ప్రధాన మార్గదర్శకంగా పనిచేశాయి. డెబ్బై సంవత్సరాల తరువాత, "ఏ రకమైన ప్రపంచాన్ని నిర్మించాలి? దానిని ఎలా నిర్మించాలి" అనే చరిత్రాత్మక ప్రశ్నకు- మానవాళి మొత్తం భాగస్వామ్యం వహించే భవిష్యత్తు గల సమాజాన్ని నిర్మించడం అని చైనా సమాధానం ఇచ్చిందని జిన్ పింగ్ అన్నారు. అది ఈ కాలపు పిలుపుకు సమాధానం. ఈ కృషి, దార్శనికత శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళుతుందని అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. "మీ పొరుగువారితో దయగా ఉండండి," "సమగ్రత ద్వారా సామరస్యాన్ని కోరండి", "అన్ని దేశాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించండి" వంటి సాంప్రదాయ చైనా విలువలు నిలదొక్కుకున్నాయి.


శాంతియుత అభివృద్ధి పథంలో కొనసాగాలని, అన్ని దేశాలతో స్నేహం, సహకారాన్ని పెంపొందించుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా ఉమ్మడి అభివృద్ధిని ప్రోత్సహించాలన్న చైనా సంకల్పం మారదని చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పేర్కొన్నారు. దేశాలు, కలిసి కట్టుగా సవాళ్లను ఎదుర్కోవడానికి, మెరుగైన భవిష్యత్తును సృష్టించ డానికి ఒక ప్రభావ వంతమైన మార్గం- ఐక్యత, సహకారం, కమ్యూనికేషన్, అవగాహనను పెంపొందించడమేనని గత 70 సంవత్సరాలు పదేపదే రుజువు చేశాయని అధ్యక్షుడు జిన్పింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

గ్లోబల్ సౌత్ తో సంఘీభావం, సహకారం


“ప్రపంచంలోని అన్ని శక్తులలో, నేడు గ్లోబల్ సౌత్ ఒక బలమైన శక్తిగా నిలుస్తున్నది, మానవ పురోగతిని ప్రోత్సహిం చడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఒక కొత్త చారిత్రక ప్రారంభ బిందువు వద్ద నిలబడి, గ్లోబల్ సౌత్ మరింత సమ్మిళితం గా ఉండాలి, ఉమ్మడి భవిష్యత్తుతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో నాయకత్వం వహించడానికి చేతులు కలపాలి” అని జిన్పింగ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గ్లోబల్ సౌత్ కు మద్దతుగా ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు, శాంతియుత సహజీవన స్కాలర్షిప్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద విద్యార్ధులకు 1,000 స్కాలర్షిప్ ల మంజూరు వంటి కొన్ని కొత్త ఏర్పాట్లను ఆయన ప్రకటించారు. గ్లోబల్ సౌత్ అభివృద్ధికి మద్దతుగా చైనా తీసుకునే ఎనిమిది చర్యలను ప్రకటించారు. గ్లోబల్ సౌత్ లో వ్యవసాయ అభివృద్ధి కోసం కోటి డాలర్ల కు సమానమైన నిధులు సమ కూర్చుతామన్నారు.


స్మారక సదస్సుతో పాటు మధ్యాహ్నం ఒక విందు సమావేశం, నాలుగు ఉప వేదికలు కూడా నిర్వహించారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ విందుకు హాజరై ప్రసంగించారు. భవిష్యత్తును ఎదుర్కొంటూ, ప్రపంచంలోని అన్ని అభ్యుదయ శక్తు ల మద్దతు, భాగస్వామ్యం లేకుండా మానవాళికి భాగస్వామ్య భవిష్యత్తుతో కూడిన సమాజాన్ని నిర్మించే గొప్ప లక్ష్యా న్ని సాధించలేము. గ్లోబల్ సౌత్ లో సహకారానికి మద్దతు ఇవ్వడానికి అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రకటించిన ఎనిమిది చర్యలు ప్రపంచ దక్షిణ దేశాలన్నింటికీ సంఘీభావంగా నిలవడానికి, వారి అభివృద్ధి, పునరుజ్జీవనాలను ప్రోత్సహించడానికి చైనాకున్న దృఢమైన సంకల్పాన్ని ప్రదర్శిస్తాయని వాంగ్ పేర్కొన్నారు. ఈ చర్యలను చురుకుగా అమలు చేస్తామని వాంగ్ ప్రకటించారు.


వివిధ దేశాలకు చెందిన మాజీ దేశాధినేతలు, నాయకులు, నిపుణులు, పండితులు, మిత్రులు, మీడియా, వ్యాపార వర్గాల ప్రతినిధులను ఈ కార్యక్రమాలకు ఆహ్వానించారు. భారత దేశం నుండి గతంలో పంచశీల మైత్రీ అవార్డులు పొందిన వారితో సహా ఐదుగురు ఆహ్వానితులుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారత చైనా మిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు శ్రీ వి. భాస్కరన్, ప్రధాన కార్యదర్శి డా. మోహన రెడ్డి ఈ బృందంలో వున్నారు.

అనేక సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కొంటున్న నేటి ప్రపంచంలో; శాంతి, అభివృద్ధి ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం యొక్క ఉమ్మడి ఆకాంక్ష. ఏదేమైనా, శాంతిని సాధించవచ్చా, అభివృద్ధిని కొనసాగించవచ్చా, దేశాలు శాంతియుతం గా సహజీవనం చేయగలవా, ఒకరినొకరు గౌరవించుకోగలవా, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకుండా వుండగలరా —అన్నవి ప్రస్తుత అస్థిర అంతర్జాతీయ వాతావరణంలో తలఎత్తే సందేహాలు. అందుకే పంచశీల సూత్రాలను నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది.


“శాంతియుత సహజీవనం 70 వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం గొప్ప ప్రతీకాత్మక విలువ ను కలిగి ఉంది. శాంతియుత ప్రపంచాన్ని నిర్మించడానికి చైనా అంకితభావాన్ని ఈ వార్షికోత్సవం హైలైట్ చేస్తోంది” అని బ్రెజిల్ లోని సెంటర్ ఫర్ బ్రెజిల్-చైనా స్టడీస్ అధిపతి డి కార్వాల్హో అన్నారు. గ్లోబల్ సౌత్ కు చెందిన దేశాలు చారిత్రాత్మకంగా అనేక విదేశీ జోక్యాలను ఎదుర్కొన్నాయని, ప్రతి దేశం, దాని పరిమాణం లేదా బలంతో సంబంధం లేకుండా సమ స్థాయిలో గౌరవించబడే, అంతర్జాతీయ నిర్ణయ ప్రక్రియలో చేర్చబడే, బహుళ పక్ష వాదాన్ని ప్రోత్సహించడానికి, శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. ఈ సూత్రాలు స్థిరమైన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి కీలకమైనవి. ఇది ఉమ్మడి శ్రేయస్సును ప్రోత్సహిస్తుంది. సుస్థిర ప్రపంచం దీర్ఘకాలిక అంతర్జాతీయ సహకారానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుందని కార్వాల్హో అన్నారు.


ఫ్రెంచ్ పారిశ్రామికవేత్త, ఆర్థిక, భౌగోళిక రాజకీయాల వ్యాఖ్యాత అర్నాడ్ బెర్ట్రాండ్ “శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాలు "ప్రపంచానికి సరైన దృక్పథానికి సరైన ఆధారం" అని అన్నారు.”ప్రస్తుతం మన ముందు రెండు మార్గా లున్నాయి. ఒకటి శాంతియుత సహజీవనం మరోటి తీవ్రమైన పోటీ. ఈ పోటీ కొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీస్తుంది. దానికి ప్రత్యామ్నాయం సహజీవనం అనే ఆలోచన. శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాల ఉద్దేశ్యం సానుకూల భవిష్యత్తు కోసం ఒక దార్శనికతను అందించడం. తీవ్రమైన పోటీని ఆశ్రయించకుండా సంఘర్షణల ను పరిష్కరించ వచ్చనే ఆశను అందించడం.” అని ఆయన అన్నారు


“కొన్ని దేశాల చర్యలు ఈ ప్రాథమిక సూత్రాలను తుంగలో తొక్కుతున్నాయని, వీటిపై అంతర్జాతీయ సమాజం మరింత దృష్టి సారించి నిలబెట్టాల్సిన అవసరం ఉందని, ఈ సూత్రాలు అంతిమంగా అందరికీ మరింత సామరస్యపూర్వక, సుసంపన్న మైన భవిష్యత్తుకు దోహదం చేస్తాయని , బీజింగ్ లోని రెన్ మిన్ యూనివర్శిటీ ప్రొఫెసర్ డియావో డామింగ్ తెలిపారు.


ఈ కార్యక్రమాలకు హాజరైన గయానా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ రామోటర్ మాట్లాడుతూ,” పాశ్చాత్య సామ్రాజ్యవాద ప్రపంచం, అభివృద్ధి చెందుతున్న దేశాలను పేదరికంలోనె వుంచుతూ, తమపై ఆధారపడి ఉంచడానికి వారి వనరుల ను దోపిడీ చేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి” అని అన్నారు. కానీ చైనా ఈ దోపిడి సంబంధాలకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తోందని, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా చైనా మౌలిక సదుపాయా లను నిర్మించడం దక్షిణ దేశాల సార్వభౌమత్వం, స్వతంత్రతల ను బలోపేతం చేయడానికి దోహదం చేస్తుందని అన్నారు.


గత ఏడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా దేశాలు అవలంబిస్తున్న శాంతియుత సహజీవనం యొక్క ఐదు సూత్రాల కు నేటి ప్రపంచంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఈ సూత్రాలు పునాది గా పనిచేస్తాయి. ముఖ్యంగా దక్షిణ దేశాల మధ్య [గ్లోబల్ సౌత్] సహకారాన్ని పెంపొందించడానికి ఈ సూత్రాలు, చైనా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ స్థిరత్వానికి దోహదం చేస్తాయని అనేకమంది విశ్లేషకులు భావిస్తున్నారు.

గ్లోబల్ సౌత్ కు ప్రాతినిధ్య గొంతుగా వ్యవహరిస్తామని జి 20 దేశాల సదస్సులో హామీ ఇచ్చిన భారత ప్రభుత్వం ఆ వాగ్దానాన్ని అప్పుడే మరచిపోయినట్లుంది. కనీసం పంచశీల వార్షికోత్సవాలను కూడా జరపటం లేదు. పంచశీల ను మనమే రూపొందించామని, అది నెహ్రూ చొరవ అని ప్రచారం చేసుకునే మన పాలకవర్గాలు ఈ సూత్రాలకు ఏనాడో తిలోదకాలు ఇచ్చాయి. ఒప్పందంపై సంతకాల సిరా ఆరకముందే దలైలామాకు, అతని ప్రవాస ప్రభుత్వానికి ఆశ్రయం కల్పించి చైనా అంతర్గత విషయంలో జోక్యం చేసుకున్నారు. రెండవ ప్రపంచ యుద్దానంతర పరిస్థితులలో ఓటమి పాలయిన ఫాసిస్టు శక్తులకు, గెలిచి తమ ప్రభావాన్ని పెంచుకుంటున్న అమెరికావంటి ఆధి పత్య శక్తుల విధానాలకు భిన్నంగా, అప్పుడప్పుడే స్వాతంత్ర్యం సంపాదించుకున్న ఆయా దేశాల మధ్య సంబంధా లకు ఈ ఐదు సూత్రాలు ప్రాతిపదికగా ఒక పునాదిగా నిలిచాయి. ఆనాటి ఆధిపత్య వాదులకు పగ్గాలు వేశాయి. ఈనాటి ప్రపంచంలో ఒక సూపర్ పవర్ గా, ఆధిపత్యం చలాయిస్తున్న అమెరికా అగ్రరాజ్యం అన్ని చోట్ల యుద్ద జ్వాలలు రగిలిస్తున్న ఈ తరుణంలో బడుగు బలహీన దక్షిణాది రాజ్యాలన్నీ తిరిగి శాంతియుత సహజీవనం కోసం , దేశాల మధ్య సరైన సంబంధాల నిర్వహణకోసం ఈ ఐదు సూత్రాలను ముందుకు తెస్తున్నాయి. వాటికి ప్రాతినిధ్యం గానె చైనా ఆ ఐదు సూత్రాలకు నేటి అవసరాలకు తగిన విధానాలు మిళితం చేసి, నవీన పరచి, ఉమ్మడి భవిష్యత్తు నిర్మాణానికి రూపకల్పన చేస్తోంది.


అందువల్ల ఈ 70 వ వార్షికోత్సవ సమయాన ఈ స్నేహ సూత్రాలను గురించి మన ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాలి. కొత్త పరిస్థితులలో శాంతియుత సహజీవనం ఐదు సూత్రాలను ముందుకు తీసుకెళ్లడానికి, నేడు ప్రపంచంలోని బహుళ సంక్షోభాలను, సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి శాంతి, అభివృద్ధి, సహకారం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజల పిలుపుకు ప్రతిస్పందించాలీ .



Read More
Next Story