డల్లాస్ లో మనోళ్లు అదరగొట్టారు!
పంచెకట్లు, అడ్డబొట్లు, నిలువు బొట్లు, చీరె, సారె, లంగా వోణి వంటి సంప్రదాయానికి పెద్దపీట వేసింది. ఓకింత హుందాతనం మరింత తెలుగుదనం ఉట్టిపడింది.
’అక్కా, బాగున్నావా?’
’హాయ్, ఎలా ఉన్నావు, పిల్లలు బాగున్నారా?’
’ఈమధ్యేమైనా ఊరికెళ్లొచ్చావా? డ్రస్ బాగుందరిరా..’
’ఇంటికి కాంట్రాక్ట్ సైనప్ చేశావటగా.. ఏవైపు..’
ఇట్లాంటి పలకరింపులు, పిలుపులు, ఆప్యాయతలు, ఆలింగనాలు, కుశలాలు, కలుపుగోల్లు, మెచ్చుకోళ్లతో డల్లాస్ నగరంలోని మార్ తొమ్మ ఈవెంట్ సెంటర్ కళకళలాడింది. పరాయి వేషభాషలకు కాస్త విరామమిచ్చి పంచెకట్లు, అడ్డబొట్లు, నిలువు బొట్లు, చీరె, సారె, లంగా వోణి వంటి సంప్రదాయానికి పెద్దపీట వేసింది. ఓకింత హుందాతనం మరింత తెలుగుదనం ఉట్టిపడింది. దేశీ వేడుకల్ని మనవాళ్లు ఏమాత్రం మరిచిపోలేదని రుజువు చేసింది. భారతీయ సంస్కతి ఉట్టిపడేలా చేసింది.
2023 మార్చి 25, డాలస్...
ఉగాది.. తెలుగు సంవత్సరాది. శోభకతు నామ వత్సరాన్ని ఈ ఏడాది మార్చి 22న తెలుగు రాష్ట్రాలు జరుపుకున్నాయి. టెక్సాస్‌లోని తెలుగు వారు మాత్రం ఈ వారాంతపు సెలవైన శనివారం (మార్చి 25న) పెద్ద సంబరంగా జరుపుకున్నారు. అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) సౌత్ వెస్ట్ సెంట్రల్ ఈ వేడుక్కి నడుంకట్టింది. డాలస్‌తో పాటు చికాగో, అట్లాంటా, హ్యూస్టన్, ఆస్టిన్, ఫ్లోరిడాల నుంచి వేయి మందికి పైగా తెలుగువాళ్లు ఈ ఉత్సవాల్లో పాలుపంచుకోవడం విశేషం. ఉదయం 9 గంటలకు దీపారాదనతో మొదలైన పండుగ సాయంత్రం ఐదింటిదాకా ఏకధాటిగా సాగింది.
పెళ్లింటిని మించే ఆహ్వానాలు
పెళ్లింటికొచ్చే అతిధుల్ని సేవించినట్టు గుమ్మంలోనే గంధం పూసి పన్నీరు జల్లి పూలు చేతికిచ్చి ఆహ్వానించే పూబంతులు, పసి మొగ్గలు అల్లారుముద్దుగా ఆడుకునేలా గాలిగుమ్మటాలందించే చిన్నారులు, ఆహుతుల చిరునామాలు నమోదు చేసే అబ్బాయిలు, ఆడిటోరియంలో అలంకరించిన టేబుళ్లు, కుర్చీలు, బల్లలపై సుగంధపు వాసనలొచ్చే అగరొత్తులు, ఆకలని దిక్కులు చూడ్డానికి వీల్లేకుండా టేబుల్‌పైనే అరటిపండ్లు, కమలాపండ్లు, వేదికకు ఇరువైపులా అందంగా అమర్చిన అల్పాహార, శాఖహార భోజన సదుపాయాలు, ప్రస్తుత సెల్ఫీ సీజన్లకు ఏ మాత్రం అడ్డం లేకుండా ప్రత్యేక ఫోటో ప్రదేశాలు.. ఇలా ఎన్నో మరెన్నింటికో ఈ ఈవెంట్ హాల్ వేదికైంది. ఆహుతుల రాక, పూజాథికాలు పూర్తయ్యాయి. వేదపండితుల పంచాంగ శ్రవణం మొదలైంది. అయ్యవార్లు అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. మంగళవాయిద్యాలు ప్రతిధ్వనించాయి. పేరుబలాల్ని బట్టి ఆదాయ వ్యయాలు ఖరారయ్యాయి. జీవితంలోని చీకటి వెలుగులకు అద్దంపట్టే ఉగాది పచ్చడితో నోరు కాస్తంత తీపిగా మరికాస్త వగరైంది. ఆ తర్వాత మైకందుకున్న తొలి యాంకర్ ప్రేక్షకులకు ఎక్కడా బోరు కొట్టకుండా ఎవ్వర్నీ మూడు నిమిషాలకు మించి మాట్లాడనీవకుండా కట్టడి చేసి బాల కళాకారులను రంగం మీదికి తీసుకొచ్చారు. ఆట, పాటకుండే పదును వేరొకరు చెప్పాల్సిన పని లేదు కదా. అలా ప్రతి కార్యక్రమం పోటా పోటీగా నడిచింది. మధ్యమధ్యలో విశిష్ట అతిధులకు సన్మానాలూ, స్పాన్సర్లకు మెమొంటోలు, శాలువాలు, పుష్పగుచ్చాలు సరేసరి.
షడ్రషోపేతం.. ఉగాది విందు భోజనం...
పిజ్జాలు, బర్గర్లు, శాండివిచ్‌లతో నోరంతా ఏదోలా అయిపోయిన తెలుగు జనానికి ఈ ఉగాది విందు కనువిందు చేసింది. తాపేశ్వరం కాజా, బాబాయి హోటల్ బజ్జీ, తెలంగాణ దొండకాయ వేపుడు, అలహాబాద్ చపాతీ, నెల్లూరు వెజ్ పలావ్, కడప కందిపొడి గుంటూరు ఊరమిరపకాయ, ఒంగోలు వడియం, పలాస ముద్దపప్పు, అన్నవరం ప్రసాదం, తైవాన్ వెజ్ నూడుల్స్, హాంకాంగ్ స్పింగ్‌రోల్స్, బెజవాడ బంగాళదుంప కుర్మా, కంకిపాడు ఉలవచారు, కర్నూలు సోనామసూరి రైస్, ఇండియన్ చిల్లీస్ చిట్టి గారెలు.. ఇలా ఏవైతేం మొత్తం 40 రకాలతో అరిటాకు భోజనం అదిరింది. అమెరికాలో 50 మందితో పంక్షనంటేనే వారం ముందు నుంచే ఓ పెద్ద కసరత్తు. అటువంటిది వేయి మందికి విందంటే మాటలా! ఏదైనా ఫంక్షన్‌లో భోజనం బాగుందంటే మిగతా లోటుపాట్లన్నీ గాలిలో పేలపిండవుతాయి. ఎవరికీ ఏలోటూ రాకుండా విందు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు తియ్యని అనుభూతి మిగిల్చారు.
ఓపక్క భోజనాలు సాగుతుండగానే ఓ యువతి ..అబ్రకదబ్ర.. అంటూ గాల్లో గారడి చేసింది. ఇంకో బుడతడు .. గుంటూరు గొంగూర పాటకు డాన్స్ కట్టాడు. ఇంతలో చేయి తుడుచుకుంటూ ఓ సినీ సంగీత దర్శకుడు వేదికపైకి వచ్చాడు. అతడే రఘు కుంచె..
ఊర్రూతలూపిన రఘు కుంచే పాట కచేరి...
రఘు కుంచె.. తెలుగునాట మంచి పేరున్న యాంకర్, గాయకుడు, సంగీత దర్శకుడు. ఆప్తాకి ఆప్తమిత్రుడు. ఈ ఉగాదికి ఆయనే ప్రత్యేక అతిధి. ఈ వేదికపై ఆయన చేసిన పాట కచేరి పిల్లాజెల్లా అందర్నీ ఆడేలా చేసింది. హాలు హాలంతా దద్దరిల్లింది. ’ఎందుకే రవణమ్మ’ పాటతో మొదలు పెట్టి ’బీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వరకు పాడిన పది పాటలకు జనం నిల్చొని డాన్స్ చేశారంటే విస్తుపోవాల్సిన పని లేదు. పిల్లలైతే ఆధ్యంతం వేదికపై ఆడుతూనే ఉన్నారు. పాట కచేరీ అనంతరం ఆయనతో సెల్ఫీల కోసం వయసు మళ్లిన వారు సైతం పోటీ పడ్డారు. ఇక, లోకల్ టాలెంట్‌ను ప్రోత్సహించేలా నిర్వాహకులు ఏ ఒక్క ఔత్సాహిక కళాకారుణ్ణీ నిరుత్సాహపరచలేదు.
కోవిడ్ కష్టాలను మరిచిపోయేలా కార్యక్రమాలు...
’ఇటీవలి కాలంలో ఇంత పెద్దఎత్తున ఉగాది వేడుకల్ని నిర్వహించడం ఇదే తొలిసారని’ మిత్రుడు నవీన్ చెప్పారు. కోవిడ్ కాలంలో పడిన కష్టనష్టాలను మరిచిపోయేలా బాలబాలికలు, టీనేజ్ పిల్లలు ఎంతోకష్టపడి ఈ కార్యక్రమాలను రూపొందించడం చాలా గర్వకారణంగా ఉందని చిట్టి ముత్యాల వ్యాఖ్యానించారు. ఒకప్పుడు డాలస్‌లో ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే జనం వస్తారో రారోనని భయపడాల్సి వచ్చేదని, ఇప్పుడా ఆందోళన అవసరమేలేదన్నారు ఆయన. భారతీయ నత్యంలో గిన్నిస్ రికార్డ్ కోసం ప్రయత్నించిన బాలిక మొదలు డిస్కోడాన్స్‌లో ఆరితేరిన యువకుల దాకా ఎందరెందరో ఈ నత్య కార్యక్రమాలలో పాల్గొన్నారు. సుమారు 40 ప్రోగ్రామ్‌లకు రూపకల్పన చేశారంటే ఎంత కసరత్తు చేసి ఉంటారో ఊహించవచ్చు. హైదరాబాద్ నుంచి సినీ గాయకులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. పాఠశాల విద్యార్ధులు చేసిన భరత నాట్యం, కూచిపూడి నత్యం, ఇతర సంగీత విభావరీలు ఆకట్టుకున్నాయి.
నెట్ వర్కింగ్ ప్రధానం....
ఆప్త నాయకులు పాపారావు, సురేష్ సీహెచ్, ఫణి ముత్యాల, రాజేష్ కళ్లేపల్లి, రాజ్ కిరణ్ చెన్నారెడ్డి తదితరులు వివిధ రంగాల ప్రముఖుల్ని సన్మానించారు. గాయకుడు రఘు కుంచె, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ డాక్టర్ రాజ లింగయ్య, ఆస్కార్‌కు నామినేట్ అయిన పార్ట్ ఫిల్మ్ జాయ్‌లాండ్ డైరెక్టర్ ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. ఆప్త డైరెక్టర్ కొట్టే ఉదయ్ భాస్కర్ కొట్టే ఉగాది ఉత్సవాల నిర్వహణను మనసారా మెచ్చుకున్నారు. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అంటే తెలుగుప్రజల ’ఆప్త’మిత్రుడన్నారు. అమెరికాలోని తెలుగువారందర్నీ ఏడాదిలో ఒకసారైనా ఓ చోటుకి చేర్చే నెట్‌వర్కింగ్‌ను అభివద్ధి చేయాలన్నదే లక్ష్యమన్నారు.
ఉగాది గిఫ్ట్‌గా చెరుకు గడ, క్యాలెండర్
ఇంటి కొచ్చిన ఆడపడుచును వట్టి చేతుల్తో పంపడం తెలుగు సంప్రదాయం కాదంటారు. ఏమీ లేకపోతే రెండు తమలపాకులైనా చేతిలో పెట్టి పంపిస్తారట. ఇక్కడ కూడా అదే జరిగింది. సంబరాల్లో మునిగి తేలి ఇంటి బాట పట్టిన వాళ్లందరికీ తలా ఒక అందమైన చిన్న జ్యూట్ బ్యాగు అందించారు. అందులో మూరెడు చెరకు ముక్క, ఓ పెద్ద కమలాపండు, వాకిలికి కట్టుకునే ప్లాస్టిక్ తమలపాకు తాడు, వక్కపొడి పొట్లం, కుంకుమ ప్యాకెట్, క్యాలెండరు పెట్టి ఇచ్చి అందర్నీ సంతప్తిగా ఇళ్లకు పంపారు. సుమారు ఆరేడు గంటల పాటు ఓ వేయి మందిని ఓ చోట పట్టి ఉంచడమంటే ఎంతో నేర్పుండాలి. అటువంటి పని ఆప్త చేసింది. అందరితో ప్రశంసలందుకుంది.