![హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకోండి: ట్రంప్ హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకోండి: ట్రంప్](https://telangana.thefederal.com/h-upload/2025/02/11/511951-trum-1.webp)
హమాస్ తో కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకోండి: ట్రంప్
శనివారం వరకూ బందీలందరూ సురక్షితంగా విడుదల చేయకపోతే నరకపు తలుపులు బద్దలు కొడతామన్న అమెరికా అధ్యక్షుడు
హమాస్- ఇజ్రాయెల్ మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందం బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ దగ్గర మిగిలిన ఉన్న బందీలందరిని ఫిబ్రవరి 15 నాటికి విడుదల చేయలేకపోతే ఈ ఒప్పందం రద్దు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ కు సూచించారు.
కార్యనిర్వాహాక ఉత్తర్వూలపై సంతకం చేస్తూ విలేకరులతో మాట్లాడిన ట్రంప్..‘‘ మిగిలిన బందీలను విడుదల చేయకపోతే, నరకపు ద్వారాలు విరిగిపోతాయి’’ అని హెచ్చరించారు. అయితే అది ఇజ్రాయెల్ పై ఆధారపడి ఉంటుందన్నారు. బందీలలో చాలామంది చనిపోయి ఉంటారని తాను భయపడుతున్నానని అన్నారు.
‘‘శనివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా బందీలందరిని విడుదల చేయాలి. లేకపోతే కొద్దికొద్దిగా కాకుండా మొత్తం నరకం బద్దలు కొడుతుందని నేను నమ్మకంగా చెబుతున్నా’’ అని ట్రంప్ అన్నారు.
హమాస్ పై ప్రతీకారం తీర్చుకోవాలని మీరు భావిస్తున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించినప్పుడూ ట్రంప్ సమాధానమిస్తూ.. ‘‘హమాస్, నా ఉద్దేశం త్వరలోనే తెలుసుకుంటుంది. శనివారం మధ్యాహ్నం వరకూ విషయం దాని బోధపడుతుంది, నేను నా తరఫున మాట్లాడుతున్నాను. ఇజ్రాయెల్ దానిని అధిగమించగలదు’’ అన్నారు.
ఈజిప్టు, జోర్డాన్ దేశాలు గాజా లో ఉన్న పాలస్తీనా శరణార్థులను తీసుకోవడానికి నిరాకరిస్తే ఆయా దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేయవచ్చని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.
హమాస్ ప్రకటన..
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, తదుపరి నోటీసు వచ్చే వరకూ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు హమాస్ గతంలోనే ప్రకటించింది. తమతో ఒప్పందం చేసుకున్నప్పుడూ చేసుకున్న షరతులు ఉల్లంఘిస్తుందని ఉగ్రవాద సంస్థ ఆరోపించింది.
పాలస్తీనియన్లను తిరిగి ఉత్తర గాజాకు తిరిగి రాకుండా ఆపడం, గాజా ఎన్ క్లేవ్ లోకి సాయం ప్రవేశించకుండా నిరోధించడం, పాలస్తీనా ప్రజలే లక్ష్యంగా షెల్లింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ శనివారం మరిన్ని బందీలను విడుదల చేయాల్సి ఉంది.
కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలి..
ఇజ్రాయెల్ నుంచి కిడ్నాప్ గురైన బాధితుల కుటుంబాలు మాత్రం హమాస్ తో కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుతున్నాయి. ఈ కుటుంబాలన్నీ కూడా టెల్ అవీవ్ లోని హోస్టేజెస్ స్క్వేర్ అని పిలువబడే ప్రదేశంలో నిరసన నిర్వహించారు. ప్రతిబందీ కూడా ఇజ్రాయెల్ కు తిరిగి రావాలని వారు డిమాండ్ చేశారు.
అత్యున్నత స్థాయి సంసిద్ధతలో ఐడీఎఫ్
హమాస్ నుంచి ప్రకటన వచ్చిన తరువాత ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ.. ఉగ్రవాద సంస్థ కాల్పుల విరమణ ఒప్పందంలో కుదుర్చుకున్న షరతులను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.
ఐడీఎఫ్ అత్యున్నత స్థాయిలో సంసిద్ధతలో ఉండాలని, గాజా నుంచి ఎదురయ్యే అన్ని ప్రమాదాలను ఎదుర్కొవడానికి అప్రమత్తతో ఉండాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నెతన్యాహు ఈ రోజు క్యాబినేట్ మీటింగ్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
హమాస్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొదటి విడతలో 33 బందీలను ఉగ్రవాద సంస్థ అప్పగించాలి. ఇందులో 16 మందిని సురక్షితంగా ఇంటికి చేరారు. అలాగే తమ దగ్గర ఉన్న ఐదుగురు థాయ్ బందీలను సైతం అప్పగించింది. దీనికి బదులుగా తమ జైళ్లలో బందీలుగా ఉన్న వందలాది మంది పాలస్తీనా ఖైదీలను టెల్ అవీవ్ విడుదల చేసింది.
Next Story