ఇరాన్ పై దాడి చేయడానికి అమెరికా రెండు రకాల వ్యూహాలను రచించింది. మొదట ట్రంప్ తాను రెండు వారాల్లో దాడులు చేస్తామని ప్రకటించి, ఇరాన్ కాస్త ఏమరపాటుగా ఉండేలా చేశారు. అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న ఓ సైనిక బేస్ నుంచి రెండు బీ-2 బాంబర్లు ప్రభుత్వ అధికారులు, మీడియాకు కనపడే విధంగా వైమానిక విహారం చేయించారు.
ఈ విమానాలు పసిఫిక్ లో ఉన్న గువామ్ ద్వీపానికి వెళ్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ అంతకుముందే మరో బేస్ నుంచి బీ-౨ బాంబర్లు అట్లాంటిక్ మీదుగా ఇరాన్ వైపు ప్రయాణించాయి.
భారీ బాంబులు..
ఇరాన్ లో యురేనియం శుద్ది చేసే కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఫోర్డో, నతాంజ్ కేంద్రాలపై ముప్పై వేల పౌండ్ల బాంబులను ఆ దేశ యుద్ధ విమానాలు జారవిడిచాయి.
అదే సమయంలో ఇరాన్ లోని ఇస్ఫహాన్ అణు కేంద్రంపై రెండు డజన్లకు పైగా తోమహాక్ క్షిపణులను ప్రయోగించిన నాశనం చేశారు. ఈ దాడులను అమెరికా సమర్థించుకుంది.
ఇజ్రాయెల్ అస్థిత్వ ముప్పుగా భావిస్తున్న అణు కార్యక్రమానికి ఈ దాడి పెద్ద దెబ్బ అని అమెరికన్ సైనిక నాయకులు భావిస్తున్నారు. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్(OperationmidnightHammer) పేరుతో ఈ దాడులను పెంటగాన్ ప్రణాళిక చేసింది.
ఈ దాడితో ఇరాన్ అణు కార్యక్రమం పూర్తిగా నాశనం చేశామని అమెరికా అధికారులు చెబుతున్నారు. అయితే దాడి ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, దానికి మరికొంత సమయడం పడుతుందని వెల్లడించారు.
18 గంటల పాటు ప్రయాణం..
బీ-2 స్టెల్త్ బాంబర్లు వైట్ మన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి అర్థరాత్రి 00.01 నిమిషాలకు బయలుదేరి అట్లాంటిక్ మీదుగా 18 గంటల పాటు ప్రయాణించాయి. మధ్యలో అనేకసార్లు ఇంధనం నింపుకున్న ఈ విమానాలు, తరువాత లక్ష్యంపై దాడి చేసి సురక్షితంగా తిరిగి బేస్ కు చేరుకున్నాయి.
ధ్వని వేగం కంటే కొంచెం తక్కువ వేగంతో ప్రయాణించే సబ్ సోనిక్ జెట్ లు 18 మీటర్ల లోతు వరకూ కాంక్రీట్ లోకి చొచ్చుకుపోయే శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను మోసుకుని అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వచ్చాయి.
ఏడు బీ-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు మోహరించిన 14 జీబీయూ-57 బంకర్ బస్టర్ బాంబులు ఇందుకోసం వినియోగించాయి. వీటికి తోడు యూఎస్ జలాంతర్గామి నుంచి ప్రయోగించిన రెండు డజన్ కు పైగా తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు అణు కేంద్రాలపై దాడులకు ఉపయోగించారు.
ఈ మిషన్ కు తోడుగా బీ-2 బాంబర్లు, ఫైటర్ జెట్ లు, ఇంధనం నింపే విమానాలు సహా 125 విమానాలు పాల్గొన్నాయి. దాడులు జరిగినంత సేపు అమెరికా చాలా అప్రమత్తంగా వ్యవహరించింది. నిఘా విమానాలు, స్టెల్త్ ఫైటర్ జెట్లు ఆకాశంలో చక్కెర్లు కొడుతూ మద్దతునిచ్చాయి.
ఇస్ఫహాన్ పై దాడి..
18 గంటలు ఏకబిగిన ఎగిరిన తరువాత ఇద్దరు సిబ్బందితో కూడిన సాయుధ బీ-2 స్పిరిట్ బాంబర్లు తూర్పు మధ్యధరా ప్రాంతానికి చేరుకున్న తరువాత కొన్ని విమానాలు వీటికి రక్షణగా వచ్చాయి.
బీ-2 బాంబర్లు ఇరాన్ లోకి ప్రవేశించడానికి గంట ముందు గుర్తు తెలియన ప్రాంతం నుంచి డజన్ల కొద్ది తోమహక్ క్షిపణులు ఇస్ఫహాన్ నగరంలో ఉన్న యురేనియం ఎన్ రిచ్ మెంట్ ఉన్న కేంద్రాలపై దాడులు చేసి అపార నష్టం కలిగించాయి.
తక్షణ ప్రభావం..
బీ-2 బాంబర్లు ఇరాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున రెండు గంటలకు జీబీయూ-57 మాసివ్ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ ఆయుధాలను జారవిడిచాయి. ఇవి పేలిపోవడానికి ముందు దాదాపు 18 మీటర్ల కాంక్రీట్ లేదా 200 అడుగుల లోతుకు చొచ్చుకుపోయి పెను విధ్వంసం సృష్టించాయి.
ఫోర్డో అణు కేంద్రంపై వీటిని ఉపయోగించారు. బంకర్ బస్టర్డ్ బాంబులుగా పిలిచే వీటిని యుద్ధంలో తొలిసారిగా ఉపయోగించారు. నతాంజ్ లో కూడా రెండు బంకర్ బస్టర్ బాంబులు జారవిడిచారు.
దాడి నిర్ణయం..
దాడికి రెండు రోజుల ముందు ఆదేశాలు జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్.. తన నిర్ణయాన్ని హోల్డ్ లో పెట్టారు. ఈ విషయంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ఆ లోపు చర్చలకు రావాలని చెప్పారు. తాము చేసే సైనిక దాడి ఆలస్యం అవుతుందనే సంకేతాలు ఇచ్చి, ఇరాన్ ను మోసం చే సే ప్రయత్నం చేశారు.
అమెరికాలోని మిస్సోరి నుంచి ఈ బాంబర్లు బయల్దేరినప్పుడు కొంతమంది ప్రభుత్వ అధికారులు, కొంతమంది మీడియా వీటిని గమనించారు. అయితే అమెరికాలో గువామ్ ద్వీపానికి ఈ సైనిక విమానాలు పంపుతున్నామనే భ్రమ కలిగించారు.
అయితే అట్లాంటిక్ మీదుగా ప్రయాణించే విమానాల ప్రయాణాన్ని రహస్యంగా ఉంచడానికి ఈ విధంగా డైవర్ట్ చేశారని పెంటగాన్ విషయాలను పరిశీలించే నిపుణులు చెప్పారు.
చేతులెత్తిసిన ఇరాన్..
అమెరికా దాడి చేసే సమాయానికి ఇరాన్ లోని వైమానిక రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాల నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. ఇరానియన్ రాడార్, కమాండ్ సెంటర్ల మౌలిక సదుపాయాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేయడం దీనికి కారణంగా చెప్పవచ్చు.
దాడుల తరువాత ట్రంప్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం అయ్యాయని ప్రకటించారు. ఇది నాకౌట్ పంచ్ గా వాషింగ్టన్ పేర్కొంది.
అయితే దాడికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రావడానికి మరికొంత కాలం పడుతుంది. సెంటర్ ఫర్ ఎ న్యూ అమెరికన్ సెక్యూరిటీకి చెందిన డాక్టర్ స్టెసీ పెట్టిజాన్ మాట్లాడుతూ... ఇది మరే ఇతర దేశం అమలు చేయలేని అద్భుతమైన దాడిగా అభివర్ణించారు. అయితే ఇరాన్ సామర్థ్యాలకు శాశ్వతంగా ఎదురుదెబ్బ తగులుతుందో లేదో అని ఇప్పుడే చెప్పలేమన్నారు.