'ఆశ, నిరాశల మధ్య సమాజం కొట్టుమిట్టాడుతున్నప్పుడు కార్మికోద్యమం దివిటీగా నిలిచింది. పురోగతికి బాటలు వేసింది. చోదక శక్తిగా నిలిచింది. కార్మికులు చిందించిన నెత్తుటి నుంచి, సాహసోపేతమైన పోరాటాల నుంచి సరికొత్త దారులు పరుచుకున్నాయి. ఆర్ధిక, సామాజిక సంస్కరణలకు పుటక నిచ్చింది కార్మికోద్యమం. దిక్కూమొక్కూలేని అభాగ్యులకు, నిరుద్యోగులకు, వృద్ధులకు ప్రభుత్వం నుంచి ఉపశమనం దక్కేలా చేసింది. వీటన్నింటికి మించి కలిసికట్టుగా ఉండే ఉమ్మడితనాన్ని, భరాయించే తత్వాన్ని నేర్పింది కార్మికోద్యమం. ఈ మార్పు లేదా పరివర్తనకు నాయకత్వం వహించింది కార్మికులే తప్ప చాలామంది అనుకునేటట్టు పరిశ్రమాధిపతులు కానేకాదు. నిజానికి పరిశ్రమాధిపతులు ఎంతకాలం ప్రతిఘటించగలరో అంతకాలం అడ్డుకుంటూనే వచ్చారు. 1930లలో కార్మికోద్యమం ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడింది. ఆ ఉద్యమమే మొత్తంగా దేశాన్నే సురక్షిత తీరాలకు చేర్చింది. మానవ ఆర్ధిక స్థితిగతుల్ని మెరుగుపర్చింది. నాగరికత పెంపునకు బాటలు వేసింది. కలగా మిగిలిన భద్రత, గౌరవం, ప్రతిష్ఠలతో మనిషి తలెత్తుకుని బతికేలా చేసింది కార్మికోద్యమమే. ఇంతటి ఘన విజయాలు సాధించిన కార్మికోద్యమం మసకబారడం మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం. చాలా మంది మేధావులు, మరికొన్ని వర్గాల ప్రజలు ఈ యూనియన్ (“union”) అనే పదం పలకడానికే నమోషి పడడం వారి స్వీయ మానసిక ధోరణికి, అధికార కాంక్ష, ముఠాత్వం, ఏహ్యభావానికి, పేడపురుగు మనస్తత్వానికి నిదర్శనం.
కార్మికోద్యమంలో తప్పులు లేవని కాదు, ఉద్యమాలలో పొరపాట్లు సహజం. కానీ అవి సాధించిన విజయాల మాటేమిటీ? పురోగతికి రాళ్లెత్తిన కార్మికుల చారిత్రక పోరాటాలకు దేశ చరిత్రలో దక్కిన వాటా ఎంత? ఇచ్చిన గౌరవం ఎంత? గత 30 ఏళ్లలో దేశ పునర్ నిర్మాణంలో రెండు మహా ఉద్యమాలు నడిచాయి. మొదటిది కార్మికోద్యమం. రెండోది పౌరహక్కుల ఉద్యమం. ఇది కాదనలేని చారిత్రక సత్యం.'
మార్టిన్ లూధర్ కింగ్(అక్టోబర్ 7, 1965. స్పింగ్ ఫీల్డ్, ఇల్లినాయిస్.), ఆయన ఈ మాటలు చెప్పి నేటికి 60 ఏళ్లు కావొస్తోంది. ఇప్పటికీ అవన్నీ ఈటెల్లాంటి మాటలే. నిష్టూరపు తూటాలే. అమెరికాలో ట్రేడ్ యూనియన్లు ఓ వెలుగు వెలుగుతున్నప్పుడే ఆయన చీకటి కోణాలను చూశారు. రాబోయే సవాళ్లను ఊహించారు. జాగ్రత్త సుమా అని హెచ్చరించారు. మున్ముందు యూనియన్లకు ఎలా తూట్లుపొడుస్తారో అంచనా వేశారు. గ్రేట్ డిప్రెషన్ (మహా మాంద్యం) కాలంలోనూ కనిపించని అసమానతలు ఎలా పెరుగుతాయో అంకెలు సంకెలతో సహా ఊహించారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.
అమెరికాలో మేడే అంటే ...
ఈవేళ అమెరికన్ లేబర్ డే. అంటే మన మేడే. ప్రపంచ వ్యాప్తంగా మే ఒకటో తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా పాటిస్తే అమెరికా మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలో వచ్చే సోమవారాన్ని లేబర్ డేగా పాటిస్తోంది. ఆ రోజును ఫెడరల్ గవర్నమెంటు (అంటే కేంద్రప్రభుత్వం) సెలవు దినంగా పాటిస్తుంది. మనకు తెలిసిన మేడే అంటే కార్మికదినోత్సవం. అమెరికాలో మేడే అంటే ఓ గావుకేక. ఓ తరహా అత్యవసరపరిస్థితి. ఎవరైనా ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు మేడేను ప్రకటిస్తారు. పోలీసులు రంగంలోకి దిగుతారు. అంతెందుకు.. బాగా ట్రాఫిక్ జామ్ అయినా మేడే అంటుంటారు. మేడే అనేది వాయిస్-ప్రోసీజర్ రేడియో కమ్యూనికేషన్‌లలో ఓ డిస్ట్రెస్ సిగ్నల్.
అందువల్ల ఈనాటి అమెరికన్ సమాజానికి తమ సమాజాభివృద్ధికి రాళ్లెత్తిన కూలీలెవరో, వారి త్యాగమేంటో, వారెందుకు రక్తాన్ని చిందించారో తెలియదంటే అతిశయోక్తి కాదు. అమెరికన్ సమాజానికి లేబర్ డే అంటే సెలవు దినం, మధ్యతరగతి మందహాసం. సమ్మర్ సేల్స్, డిస్కౌంట్స్ సేల్స్, ఔట్ డో ఈవెంట్స్, బార్బిక్యూస్, పిక్నిక్కులు లేదంటే ఓ సాంస్కృతిక సమ్మేళనం.
స్టార్ బక్స్, అమెజాన్ కార్మికుల సమ్మెకు దిక్కుండా ఉండి ఉంటే అమెరికన్ కార్పొరేట్ల దుర్మార్గం ఎలా ఉండేదో ఊహించడమూ కష్టమే. అందుకే ఈ ఏడాది అమెరికన్ ట్రేడ్ యూనియన్లు- ఈ లేబర్ డేని ఉద్యోగావకాశాలు, సవాళ్లు, సమస్యల పేరుతో జరుపుకోబోతున్నాయి.
పూలమ్మిన చోటే కట్టెలెందుకు అమ్మాల్సివస్తోందీ?
1880ల నాటి కాలం.. బలవంతులు దుర్బల జాతిని బానిసలుగా చూస్తున్నప్పుడు అమెరికా కార్మికవర్గం తిరుగుబాటు చేసింది. గౌరవ ప్రదమైన జీవనాన్ని, జీతాన్ని డిమాండ్ చేసింది. పిల్లలతో వెట్టి చాకిరి వద్దని నినదించింది. సంఘం పెట్టుకునే హక్కు కావాలని పిడికిళ్లు బిగించింది. నెత్తురోడ్చింది. 8 గంటల పని దినాన్ని సాధించింది. అమెరికా పునర్జీవానికి ఊపిరిపోసింది. సెంట్రల్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో తొలి లేబర్ డే న్యూయార్క్ నగరంలో 1882 సెప్టెంబర్ 5 న జరిగింది. 1884లో అమెరికన్ కాంగ్రెస్ సెప్టెంబర్ నెలలో వచ్చే తొలి సోమవారాన్ని లేబర్ డేగా ప్రకటించింది. ఆ తర్వాత పదేళ్లకు అంటే 1894 నుంచి ఫెడరల్ గవర్నమెంటు సెలవు ఇస్తోంది. ఈ మధ్యలో 1886 మే ఒకటిన చికాగో నగరంలో కార్మికుల తిరుగుబాటు ఇందుకు ప్రాణం పోసింది. సుమారు 80 దేశాలు మే డేను మేనెల 1న జరుపుకుంటుంటే కెనడా, అమెరికా మాత్రం సెప్టెంబర్ నెలలో వచ్చే మొదటి సోమవారాన్ని లేబర్ డేగా పాటిస్తున్నాయి.
1920లో ఏం జరిగిందీ?
అమెరికాలో ట్రేడ్ యూనియన్లకు ఘనమైన చరిత్ర ఉన్నా వాటిని ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. ప్రధాన కారణం చలనశీలత(మొబిలిటీ), సమయం(టైమ్). ఒక చోటి నుంచి మరో చోటికి పోవడానికి చాలా సమయం పడుతుంది. ప్రజా రవాణా తక్కువ. అటువంటి పరిస్థితుల్లో 1920లలో పొసాడా వంటి క్రిస్టమస్ సెలబ్రేషన్లు కార్మికులందరూ ఓ చోట చేరి తమ సమస్యల్ని చర్చించుకోవడానికి అవకాశాలు కల్పించాయి. 1920, 21లలో జరిగిన గార్మెంట్స్ (బట్టలు కుట్టడం) మహిళా కార్మికుల సమ్మె ఆ విధంగా జరిగిందేనంటారు.
అమెరికాలో ఆర్ధిక సంస్కరణలు పెరిగిన తర్వాత పెట్టుబడిదారీ విధానం బలపడిన తర్వాత కార్మిక సంఘాలు మరింత బలహీన పడ్డాయి. గ్లోబలైజేషన్ తో కార్మిక సంఘాల ఊసే లేకుండా పోయింది. ఇప్పుడున్న కార్మిక సంఘాలలో మొత్తం సభ్యత్వం 54 మిలియన్లకు మించి లేదు. ఇందులో మూడొంతుల మంది ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగులే. ఏదైనా సమస్య వచ్చినపుడు చర్చలు సంప్రదింపులు తప్ప సమ్మె జరిగిన ఘటన గత 50 ఏళ్లలో లేదంటారు. ఓ కొత్త తరహా కార్మికవర్గం పుట్టుకురావడమే ఇందుకు కారణం. కాంట్రాక్ట్ విధానం తెరపైకి రావడం,హోటల్ వర్కర్లు, బిల్డింగ్ వర్కర్లు, హోమ్ కేర్ వర్కర్లు, జెఫ్ బెజోస్, ఎలాస్ మస్క్ లాంటి ఉద్దండ కార్పొరేట్ పిండాలు కార్మిక సంఘాల వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టడం, ఆటోమేషన్ పెరగడం, చేతివృత్తులు సన్నగిల్లడం, కుటీర పరిశ్రమలకు దూరమవడం, సాఫ్ట్ వేర్ రంగం విస్తృతి కావడంతో ప్రతి ఒక్కరూ తన కెరియరే ప్రధానంగా ముందుకు సాగుతున్నారు. సంఘాలు, సమ్మెలనే ఊసే లేకుండా పోయింది. దీనికితోడు కార్మిక సంఘాలు పెట్టుకోవాలంటే ప్రభుత్వమే సవాలక్ష ఆంక్షలు పెట్టడం (ఉదాహరణకు బ్లూమ్ బెర్గ్ యాక్ట్), 30 శాతానికి పైగా కార్మికులు ఆమోదం తెలపాలనడం,1981లో రోనాల్డ్ రీగన్ తీసుకువచ్చిన కొత్త నిబంధన (సమ్మె చేసే కార్మికుల తొలగింపు), యూనియన్లకు వ్యతిరేకంగా పని చేసే కన్సెల్టింగ్ ఏజెన్సీలు పెరగడం వంటివి కూడా కార్మిక ఉద్యమాలను దెబ్బతీశాయి.
మళ్లీ ఊపిరిపోసుకుంటున్న ఉద్యమాలు...
అమెరికాలోని స్టార్ బక్స్ అనే అతిపెద్ద కాఫీ సంస్థ, అమెజాన్ అనే మరో కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కార్మిక ఉద్యమం ప్రస్తుత యుగధర్మంలో తిరిగి ప్రాణం పోసుకుంటుందేమో అనిపిస్తోంది. 55 శాతం మంది అమెరికన్లు కార్మిక సంఘాల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. సంఘాలు పెట్టుకోవాలంటే ఏమి చేయాలనే దానిపై ఆరా తీస్తున్నారు. 1980, 1995 మధ్య పుట్టిన వాళ్ళు (మిలీనియల్స్), 1996, 2010 మధ్య పుట్టిన ప్రస్తుత జనరేషన్ (జనరేషన్- జెడ్) చాలా మార్పుల్ని చవిచూశారు. కోవిడ్-19 తర్వాత ఈ తరం పునరాలోచనలో పడింది. ఇతరుల కష్టనష్టాల పట్ల జాలి, కనికరం చూపుతున్న తరాలివి. వీళ్లు ఇప్పుడు గతాన్ని తొవ్వుతున్నారు. జట్టు కట్టాల్సిందే అంటున్నారు. గత 24 నెలల్లో టీమ్‌స్టర్స్, యూపీఎస్, యునైటెడ్ ఆటోవర్కర్స్ యూనియన్లు సాధించిన చారిత్రాత్మక విజయాలే ఇందుకు సాక్ష్యాలు. యూనియన్ల ఫలితంగా అమెరికన్ల జీతాలు పెరిగాయి.
ట్రేడ్ యూనియన్ల వ్యతిరేక ఖర్చు 340 మిలియన్ డాలర్లు
కార్మిక సంఘాల గురించి ప్రస్తుత తరం అడుగుతున్న ప్రధాన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే.. -ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సంఘాలు తిరోగమనంలోనే ఉన్నాయా? 1970ల తర్వాత కార్మిక సంఘాలు బలహీనపడడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటీ? కార్మిక సంఘాలను ప్రభుత్వమే దెబ్బతీసిందా? ప్రజలకు ఇప్పుడు కార్మిక సంఘాలు ఎందుకు కావాలని కోరకుంటున్నారు? వీటిపై అమెరికా కొత్త తరం పరిశోధన, పరిశీలన చేస్తోంది. ట్రేడ్ యూనియన్లను విచ్ఛిన్నం చేసేందుకు కార్పొరేట్ సంస్థలు వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నాయో అర్థం చేసుకుంటున్నారు. దేశంలోని 2వేల కార్పొరేట్ సంస్థలు కార్మిక సంఘాల వ్యతిరేక ప్రచారం కోసం 340 మిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నాయి. కార్మిక సంఘాల వ్యతిరేక ప్రచార కన్సెల్టీలు విపరీతంగా పుట్టుకొస్తున్నాయి. వీటిని అమెజాన్, స్టార్ బక్స్, టార్గెట్ వంటి బడాబడా కార్పొరేట్ సంస్థలు నియమించుకుంటున్నాయి. కార్మికులకు పెంచే జీతాల కన్నా సంఘాలకు వ్యతిరేకంగా పెట్టే ఖర్చే ఎక్కువగా ఉందని యూనియనిస్టు, డెమోక్రాట్, మేధావి బెర్నీ శాండర్స్ అంటున్నారు.
యూనియన్లు ఉండడం వల్ల వైట్స్ (శ్వేతజాతి), బ్లాక్స్ (నల్ల జాతి) మధ్య అంతరాన్నీ, దూరాన్ని తగ్గిస్తాయని భావిస్తున్నారు. యూనియన్లలో ప్రాతినిధ్యం ఉండే మహిళలకు నాయకత్వ లక్షణాలు పెరగడంతో పాటు యూనియన్లలో లేని మహిళల కంటే సగటున 9.5శాతం అధిక వేతనాలను పొందుతారని భావిస్తున్నారు.
అమెరికా చరిత్రలో ఆర్ధిక పోరాటాలే ప్రధానంగా సాగాయి. నల్లజాతి బానిసల రక్తమాంసాలతోనే దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలు బలపడ్డాయి. బానిసత్వం నుంచి విముక్తి లభించినా తమ మాజీ యజమానుల కోసం వళ్లు వంచి పని చేసేలా జాత్యహంకార చట్టాలను తీసుకువచ్చాయి ఆనాటి ప్రభుత్వాలు. మాటల్లో చెప్పలేనంత మానసిక, శారీరక హింసను ఆ బానిస తరం అనుభవించింది. అప్పుడు పుట్టినవే కార్మిక సంఘాలు, పౌరహక్కుల సంఘాలు.
అటువంటి చోట.. ఏ దేశంలోనైతే 8 గంటల పని దినం కోసం రక్తం చిందించారో ఆ దేశంలోనే ఈవేళ కార్మిక వర్గం అనే పదాన్ని వాడడానికే జంకుతున్నారు. ప్రధాన పత్రికల్లో, టీవీల్లో ఆ మాట వినిపించదు. ప్రపంచంలోని ఎక్కడెక్కడి విషయాల్నో తొవ్వితీసి చర్చా గోష్టులు పెట్టే న్యూస్ కాస్టర్లు ఆ పదాన్ని వాడడానికి సిగ్గుపడం విచారకరం.