పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి, 90 మంది సైనికులు మృతి?
x
ఫొటో క్రెడిట్: డాన్

పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి, 90 మంది సైనికులు మృతి?

దాడి జరిగింది నిజమే.. కానీ ఐదుగురు మాత్రమే చనిపోయారన్న ఆర్మీ


పాముకు పాలు పోస్తే ఏం చేస్తుంది.. పోసిన వారినే కాటు వేస్తుంది.. ఇదే అంశాన్ని దృష్టిలో అమెరికా మాజీ విదేశాంగమంత్రి హిల్లరీ క్లింటన్ మరో సామెత చెప్పారు. మీ పెరట్లో పెంచిన పాములు పక్క వారినే కాదు.. మిమ్మల్ని కూడా కాటు వేస్తాయని.. సరిగ్గా పాక్ లో ఇదే జరగుతోంది.

జాఫర్ ఎక్స్ ప్రెస్ హైజాక్ ఉదంతం మర్చిపోకముందే పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ తిరుగుబాటుదారులు మరో షాక్ ఇచ్చారు. ఈ సారి సైనిక కాన్వాయ్ లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో 90 మంది సైనికులు మృతి చెందినట్లు ప్రకటించారు.
బలూచిస్తాన్ లోని నుష్కి జిల్లాలో ఉన్న 40 వ నంబర్ జాతీయ రహాదారిపై ఫ్రాంటియర్స్ కార్ప్స్ దళాల కాన్వాయ్ వెళ్తుండగా బీఎల్ఏ ఈ దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ పత్రికలు వార్తలు ప్రసారం చేశాయి.
కాన్వాయ్ నుష్కి- దల్భందిన్ హైవేపై వెళ్తున్న సమయంలో పేలుడు పదార్థాలలో నింపి ఉన్న వాహనం వచ్చి కాన్వాయ్ ను ఢీ కొట్టింది. ఈ సమయంలో ఎదురుగా ఓ ప్రయాణికుల బస్సు కూడా ఉండటంతో కొంతమంది సాధారణ ప్రజలు సైతం మృతి చెందారని తెలుస్తోంది.
జాఫర్ ఎక్స్ ప్రెస్ ఉదంతం..
బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫంక్తూన్ ఖ్వా వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ ను రెండురోజుల క్రితం బీఎల్ఏ హైజాక్ చేసింది. ఇందులో ఎక్కువ సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ జవాన్ లే ఉన్నారని తెలుస్తోంది.
రైలులో ఉన్న అందరూ ఆర్మీ జవాన్లను తమతో తీసుకుపోయినట్లు ప్రకటించిన తిరుగుబాటు దారులు, తమ డిమాండ్లను పట్టించుకోకపోవడంతో 214 మందిని ఉరితీసినట్లు ప్రకటించింది. ఈ కలకలం ఇంకా కొనసాగుతుండగానే తాజాగా మరో దాడి చేసింది.
24 గంటల్లో 32 హింసాత్మక దాడులు..
పాకిస్తాన్ లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పినట్లు గడచిన ఇరవై నాలుగు గంటల్లో జరిగిన సంఘటనలు తెలియజేస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ బాంబుదాడులు, తుపాకీ కాల్పులు జరిగాయి.
ఈ రోజు ఉదయం గుర్తు తెలియని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాది, హఫీజ్ సయీద్ స్నేహితుడు మృతి చెందగా, సయీద్ రావల్పిండి ఆస్పత్రిలో చేరినట్లు పాకిస్తాన్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కాదు కాదు... ఐదుగురు మాత్రమే చనిపోయారు..
ఆర్మీపై జరిగిన ఆత్మాహుతి దాడిలో కేవలం ముగ్గురు సైనికులు మాత్రమే మరణించారని, నలుగురు ఉగ్రవాదులను హతమార్చామని ప్రకటించింది. ఉగ్రవాదులు తప్పించుకునే అన్ని మార్గాలను మూసివేశామని, సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
నోష్కి స్టేషన్ ఆఫీసర్ జఫరుల్లా సుమలానీ మాట్లాడుతూ.. పేలుడు లో ఐదుగురు జవాన్లు మృతి చెందారని, 12 మందిగాయపడ్డారని వెల్లడించారు. గాయపడిన వారిని ఎఫ్ సీ క్యాంప్, నోష్కి టీచింగ్ హస్పిటల్ కు తరలిస్తున్నామని అక్కడ అత్యవసర పరిస్థితి విధించామని పోలీస్ అధికారి తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
పేలుడు పై అంతర్గత మంత్రి మెహసీన్ ఖాన్ విచారం వ్యక్తం చేశారు. దేశంలో అస్థిరతను సృష్టించడానికి కొన్ని శక్తులు కుట్రపన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. బెలూచిస్తాన్ ఉన్న ఆఖరి ఉగ్రవాది వరకూ వేటాడుతామని ప్రతినబూనారు.
Read More
Next Story