భారత్ పై బంగ్లాదేశ్ మరోసారి విమర్శలు
x
షేక్ హసీనా

భారత్ పై బంగ్లాదేశ్ మరోసారి విమర్శలు

హసీనాకు బహిరంగ ప్రసంగం చేయడానికి ఎలా అనుమతిస్తారని ఆక్షేపణ


భారత్ పై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మరోసారి విమర్శలు గుప్పించింది. న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రసంగించారు. దీనితో బంగ్లాదేశ్ అగ్గిమీద గుగ్గిలం అయింది.

బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు వచ్చే నెలలో జరగబోతున్న నేపథ్యంలో హసీనా మాటలు వారిని ఇరకాటంలో పడేశాయి. ప్రస్తుత విదేశాంగ మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో అవామీ లీగ్ నాయకురాలిని ‘‘సామూహిక హంతకి’’గా పేర్కొన్నారు. హసీనా మాటలు చూసి తాము ఆశ్చర్యపోయినట్లు చెప్పారు.

‘‘బంగ్లా ప్రజలు ఆశ్చర్యపోయారు. దిగ్భాంతి చెందారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హసీనాను అనుమతించడం, సామూహిక హత్యాకాండకు గురైన హసీనా బహిరంగంగా ద్వేషపూరిత ప్రసంగం చేయడానికి అనుమతించడం బంగ్లా ప్రజలకు అవమానం’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదకరమైన ఉదాహరణ’’ ను సృష్టించినందున హసీనా ప్రసంగం చేయడానికి భారత్ అనుమతించిందని ఆక్షేపించింది.
ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం షేక్ హసీనాను అప్పగించాలని, భారత్ ను డిమాండ్ చేశామని, అయితే ఇప్పటి వరకూ దాన్ని పట్టించుకోలేదని ఆరోపించింది. బంగ్లాదేశ్ పదేపదే ఆరోపించినప్పటికీ, భారత్ నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు హసీనా నుంచి వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు.
హసీనా ఏం మాట్లాడింది..
బంగ్లా మాజీ ప్రధాని హసీనా శుక్రవారం దేశ రాజధానిలో ఒక ప్రెస్ క్లబ్ లో ఆడియో ద్వారా మాట్లాడారు. ఢాకాను విడిచిన ఏడాదిన్నర తరువాత ఆమె తొలిసారిగా ప్రసంగించారు.
‘‘సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్’’ అనే శీర్షికతో హసీనా ప్రసంగం ప్రసారం అయింది. దీనికి కూలిపోయిన తన ప్రభుత్వంలోని అనేకమంది మాజీ మంత్రులు, బంగ్లాదేశ్ ప్రవాసులు హజరయ్యారు.
ఈ ప్రసంగంలో హసీనా, తాత్కాలిక పాలకుడు యూనస్ పై గట్టి విమర్శలు చేసింది. ఆయన హంతక ఫాసిస్ట్ వ్యక్తిగా ఆరోపించింది. అధికారం మీద ప్రేమ ఉన్న దేశ ద్రోహిగా అభివర్ణించింది.
1970 లలో దేశ విముక్తి యుద్ధంలో ప్రదర్శించిన స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించి, విదేశీ సేవ చేసే కీలుబొమ్మ వ్యక్తులను పడగొట్టాలని బంగ్లాదేశీయులను కోరింది. బంగ్లా అమరవీరుల రక్తంతో రాయబడిన రాజ్యాంగాన్ని పునరుద్దరించాల్సిన అవసరం ఉందని, స్వాతంత్య్రాన్ని తిరిగి పొందాలని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని, పునరుద్దరించాలని ఆమె అన్నారు.
ప్రజాస్వామ్యం రావాలి..
బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస, చట్టవిరుద్ద చర్యలపై ఐరాస నిష్పాక్షిక దర్యాప్తు నిర్వహించాలని షేక్ హసీనా డిమాండ్ చేశారు. దేశంలో మైనారిటీలు, మహిళలు, సమాజంలోని అత్యంత దుర్భల వర్గాల భద్రతకు గట్టి హమీ ఇవ్వాలని హసీనా పిలునిచ్చారు.
‘‘ప్రజాస్వామ్యం ఇప్పుడు బహిష్కరణకు గురైంది. మానవ హక్కులు దుమ్ము దులిపివేయబడ్డాయి. పత్రికా స్వేచ్ఛను తుడిచిపెట్టారు. మహిళలు, బాలికలపై హింస, లైంగిక దాడులు అదుపు లేకుండా ఉన్నాయి.
మతపరమైన మైనారిటీలు నిరంతర హింసను ఎదుర్కొంటున్నారు. శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి’’ అని ప్రసంగంలో పేర్కొన్నారు.
గత సంవత్సరం నవంబర్ లో ఢాకా కోర్టు హసీనాకు ఉరిశిక్ష విధించింది. 2024 ఆగష్టు లో జరిగిన నిరసనల సందర్భంగా ఆందోళనకారులు హత్యలకు ఆదేశాలు జారీ చేశారని కోర్టు పేర్కొంది. అయితే వీటిని ప్రపంచ దేశాలు గర్హించాయి.
బంగ్లాదేశ్ గత ఎన్నికల్లో హసీనా పార్టీ అవామీ లీగ్ ఆధిపత్యం సాధించింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఏ ఇస్లామీ తదుపరి ఎన్నికలకు ముందు ప్రధాన పోటీదారులుగా ఉద్భవించాయి. అయితే అవామీ లీగ్ ను ప్రస్తుతం ఎన్నికల్లో పూర్తిగా నిషేధించారు.
Read More
Next Story