హిందువులపై దాడిని తక్కువ చేసి చూపుతున్న బంగ్లా
x
బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహదారు మహ్మద్ యూనస్

హిందువులపై దాడిని తక్కువ చేసి చూపుతున్న బంగ్లా

దాడులను మతపరమైనవి కావని నివేదిక విడుదల చేసిన యూనస్ సర్కార్


పొరుగు దేశం బంగ్లాదేశ్ లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హత్యలు, దాడులపై ఆ దేశం తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరిస్తోంది. భారత్ తీవ్రంగా ఒత్తిడి పెంచినప్పటికీ అవన్నీ కూడా మతపరమైన దాడులు కాదని తాత్కాలిక ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.

జనవరి 9 న మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చింది. ఈ దాడులను వేగంగా, దృఢంగా ఎదుర్కోవాలని సూచించింది. వీటిపై స్పందించిన ఢాకా.. అవన్నీ కూడా వేరే కారణాల వల్ల జరిగాయని, ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించేదిగా అభివర్ణించింది.
సోమవారం ప్రధాన సలహదారు మహ్మద్ యూనస్ ప్రెస్ వింగ్ ఈ ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని వారాల్లో బంగ్లాదేశ్ లో అనేక మంది హిందువులు హత్య నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
నేరపూరిత సంఘటనలు..
అధికారిక పోలీస్ రికార్డులను తాము సమీక్షించామని ఏడాది పొడవునా మైనారిటీలపై 645 దాడులు హత్యలు జరిగినట్లు పేర్కొంది. ‘‘ప్రతి సంఘటన ఆందోళన కలిగించేది. అయితే డేటా ప్రకారం చూస్తే ఇవన్నీ కూడా మతపరమైనవి కాకుండా నేరపూరితమైనవి మాత్రమే’’ అని తన ప్రకటనలో బంగ్లాదేశ్ పేర్కొంది.
ప్రధాన సలహదారు ధృవీకరించిన సోషల్ మీడియా హ్యండిల్ లో పోస్ట్ చేసిన ప్రకటన ప్రకారం 645 సంఘటనలలో 71 మతపరమైన అంశాలు ఉన్నట్లు గుర్తించబడ్డాయని పేర్కొంది.
71 కమ్యూనల్ కేసులు..
దాడులలో కమ్యూనల్ పరంగా కేవలం 71 మాత్రమే అని పేర్కొంది. ఇందులో 38 ఆలయాల ధ్వంసం, ఎనిమిది దహనం కేసులు, ఒక దొంగతనం, ఒక హత్య, విగ్రహాలు పగలగొట్టడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 23 పూజా మండపాల నష్టం వంటివి ఉన్నాయి. ఈ సంఘనలలో 50 సంఘటనలపై పోలీస్ కేసులు నమోదు అయ్యాయి. అంతే సంఖ్యలో అరెస్ట్ లు జరిగాయని 21 కేసుల్లో నివారణ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.
మిగిలిన 574 సంఘటనలు మతంతో సంబంధం లేనివని పేర్కొంది. వీటిలో చుట్టుపక్కల వివాదాలు 51, భూమి ఘర్షణలు 23, దొంగతనం 106, వ్యక్తిగత శత్రుత్వం 26, అత్యాచారం 58, 172 అసహజ మరణాలు ఉన్నాయని పేర్కొంది. ఈ కేసులలో 498 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వాస్తవం ఏంటీ?
తాత్కాలిక ప్రభుత్వం వీటిని తిరస్కరించడం లేదు, క్లెయిమ్ చేయడం లేదని కూడా పేర్కొంది. ‘‘అన్ని నేరాలు తీవ్రమైనవి. జవాబుదారీతనం కోరుతున్నప్పటికీ మైనారిటీ బాధితులకు సంబంధించిన చాలా సంఘటనలు మతపరమైన వైరం వల్ల జరగలేదని పేర్కొంది.
2022 జనాభా లెక్కల ప్రకారం బంగ్లాదేశ్ లో హిందువుల జనాభా దాదాపు 13.13 మిలియన్లు. ఇది జనాభాలో దాదాపు 7.95 శాతానికి సమానం. బౌద్ధ జనాభా 1.01 మిలియన్లు(0.61) శాతం, క్రైస్తవులు దాదాపు ఐదు లక్షలు ఉండగా, సిక్కులు రెండు లక్షల మంది ఉన్నారు.
మత హింస పెరుగుతోంది..
జనవరి నెల ప్రారంభంలో బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రైస్తవ ఐక్యతా మండలి ఒక ప్రకటనలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, దేశంలో మత హింస ఆందోళనకరమైన రేటుతో పెరుగుతోందని ఆరోపించింది. ఇక్కడ ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగబోతున్నాయి.
మైనారిటీ ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయకుండా నిరోధించమే వీరి లక్ష్యం అని ఆరోపించింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలోనే 51 మత హింస సంఘటనలు జరిగిందని పేర్కొంది. అయితే అందరికి సమాన హక్కులు, న్యాయం కల్పిస్తామని తాత్కాలిక ప్రభుత్వం చెబుతోంది.
ఇటీవల బంగ్లాదేశ్ లో మైనారిటీలపై జరుగుతున్న హింసపై విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. ‘‘మైనారిటీలపై వారి ఇళ్లు, వ్యాపారాలపై ఉగ్రవాదులు పదే పదే దాడులు చేస్తూనే ఉన్నారు’’ వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వ్యక్తిగత శత్రుత్వాలు, రాజకీయ విభేదాలుగా అభివర్ణిస్తున్నారని ఆయన ఆరోపించారు.
2024 లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. బంగ్లాదేశ్ మైనారిటీపై ముఖ్యంగా హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Read More
Next Story