చైనా- మయన్మార్ బంధం: భారత్ అప్రమత్తం కావాల్సిందే
x

చైనా- మయన్మార్ బంధం: భారత్ అప్రమత్తం కావాల్సిందే

కల్లోలిత మయన్మార్ లో జరిగే పరిణామాలు ముందు ముందు భారత్ కు ఇబ్బందులు తెచ్చే ప్రమాదం ఉంది.


మయన్మార్ లో జరుగుతున్న అంతర్యుద్దం తనకు ద్వైపాక్షికంగా నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్న చైనా అప్రమత్తమైంది. బర్మాలో తిరుగుబాటుదారులు, సైన్యం మధ్య శాంతి చర్చల ప్రక్రియను ముమ్మరం చేసింది. చైనా- మయన్మార్ మధ్య సరిహద్దును పంచుకుంటున్న ఉత్తర షాన్ రాష్ట్రంలో జుంటాలు- తిరుగుబాటుదారుల మధ్య పోరు జరగకుండా శాంతి చర్చలు జరిపి విజయవంతమైంది.

కానీ ఇతర రాష్ట్రాలైన రఖైన్, చిన్ సహ ఇతర ప్రాంతాలలో మాత్రం ఆధిపత్యపోరు జరుగుతుంది. చైనా ఇరుపక్షాల నాయకులను యూనాన్ రాష్ట్ర రాజధానికి తీసుకొచ్చి సంధి ప్రయత్నాలు చేసింది. బ్రదర్ హుడ్ అలయెన్స్ 1027 పేరుతో దాడులు చేస్తోంది. ఈ పరిణామాలపై బీజింగ్ ఆందోళన చెందింది. ఇది రెండు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలుగుతుందని, భావించి ముందుస్తు చర్యగా ఈ శాంతి ప్రక్రియను ముందుకు తెచ్చింది.

మూడు రౌండ్ల చర్చలు

మొదటి సమావేశం గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో జరిగింది. డిసెంబర్ 11 నుంచి 31 వరకూ 20 రోజుల వరకూ కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయి. అయితే ఉత్తర షాన్ రాష్ట్రంలో ఇరు పక్షాలు కాల్పులకు తెగబడటం, పరిస్థితి భీభత్సంగా ఉండడంతో అది విఫలమైంది. డిసెంబర్ 22-24 మధ్య జరిగిన రెండో విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. ఇరుపక్షాలు తమతమ వాదనలపై పట్టువిడవకపోవడంతో పోరు నిరంతరాయంగా కొనసాగింది.

తిరుగుబాటుదారుల కూటమి ఇప్పటి వరకూ 16 పట్టణాలు, చైనా- మయన్మార్ మధ్య వాణిజ్యం జరుగుతున్న ఐదు మండలాలను స్వాధీనం చేసుకుంది. తిరుగుబాటు దారుల దాడుల్లో జుంటా నాయకత్వం దాదాపు 250 స్థావరాలను కోల్పోయింది. ఇందులో ప్రాంతీయ స్థావరాలతో పాటు వ్యూహాత్మక స్థానాలు కూడా ఉన్నాయి. ఇది చైనాను కలవరపెట్టింది.

జనవరి 12న చైనా విదేశాంగమంత్రి సన్ వీడాంగ్ మయన్మార్ జుంటాబాస్ మిన్ ఆంగ్ హైంగ్ ను నేపిటావ్ లో కలిసి మాట్లాడారు. ఈ సమావేశంలో సరిహద్దు సమస్యతో పాటు పలు అంశాలను చర్చించారు. అనంతరం మూడో రౌండ్ శాంతి చర్చలు జరిగాయి.

కాల్పుల విరమణ

బ్రదర్ హుడ్ అలయెన్స్ గా ఏర్పడిన తాంగ్ నేషనల్ ఆర్మీ(TNLA), అరకాన్ ఆర్మీ(AA), మయన్మార్ నేషనల్ డెమెక్రాటిక్ అలయన్స్ ఆర్మీ(MNDAA) ప్రతినిధులు జనవరి 10-11న కున్మింగ్ లో జుంటా అధికారులతో పాటు చైనా అధికారులు పాల్గొన్నారు. ఇందులో ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని బర్మావర్గాలు తెలిపాయి.

తిరుగుబాటుదారులు ఉత్తర షాన్ రాష్ట్రంలోని జుంటా పాలన శిబిరాలు, పట్టణాలను స్వాధీనం చేసుకోకూడదని, అలాగే సైనిక ప్రభుత్వం ఎలాంటి వైమానికి దాడులు, షెల్లింగ్ చేపట్టకూడదని ఇరుపక్షాలను చైనా ఒప్పించింది. అలాగే మరో కీలమైన అంశంపై కూడా వీరి మధ్య ఒప్పందం జరిగింది. తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్న వాణిజ్య ప్రాంతాలలో తిరుగి తెరవడానికి అంగీకారం కుదిరింది.

అయితే ఇరుపక్షాల మధ్య మరికొన్ని నిర్మాణాత్మక చర్చల తరువాతనే ఇవి తెరిచే అవకాశం ఉందని బర్మా వర్గాల సమాచారం. "చర్చలు ప్రధానంగా కాల్పుల విరమణపై దృష్టి సారించాయి, దళాల పునరావాసం, స్థావరాలు, భూభాగాల విషయం ఇందులో లేవు " అని కొన్ని వర్గాలు ఫెడరల్ కు చెప్పాయి.

"ఒప్పందం అమలులోకి వచ్చింది" అని అరకాన్ ఆర్మీ ప్రతినిధి ఖైన్ తుక్కా శనివారం ఫెడరల్ ప్రతినిధికి చెప్పారు. అయితే అరకాన్ ఆర్మీలోని కొంతమంది నాయకులు చిన్ రాష్ట్రంలోని పాలేత్వా, సముద్ర పట్టణం క్యూక్ ఫ్యూపై దాడి చేసి ఆధీనంలోకి తీసుకోవాలని పట్టుబట్టినట్లు చెప్పారు.

చైనీస్ ఒత్తిడి

జుంటా అధికారి ప్రతినిధి మేజర్ జనరల్ జా మిన్ తున్ శుక్రవారం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఆయన కాల్పుల విరమణ అంశాన్ని ధృవీకరించారు. ఒప్పందాన్ని కొనసాగించేందుకు కొన్ని అదనపు అంశాలను జోడించి మరింత చర్చిస్తామని చెప్పారు. శాంతిచర్చల్లో పాలుపంచుకున్నందుకు చైనాకు ధన్యవాదాలు తెలిపారు.

మిలటరీ నియంతృత్వాన్ని నిర్మూలించి దేశంలో ప్రజాపాలన తీసుకొస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించారు. అలాగే మయన్మార్- చైనా సరిహద్దులో ఆన్లైన్ స్కామ్ కార్యకలాపాలను నిర్మూలిస్తామని గత ఏడాది అక్టోబర్ లో ఈ కూటమి ఆపరేషన్ 1027 ను ప్రారంభించింది. తూర్పున చైనా సరిహద్దు నుంచి పశ్చిమాన మాండలే ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల వరకూ ఉత్తర షాన్ స్టేట్ లోని పెద్ద ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఈ దాడులతో ప్రేరణ పొందిన కొన్ని కొత్త సంస్థలు పుట్టుకొచ్చాయి. అవి సాగింగ్ ప్రాంతంతో పాటు, రఖైన్, చిన్, కరెన్నీ(కియా) వంటి రాష్ట్రాలలో ఉన్నాయి. మయన్మార్ తో సరిహద్దు వెంబడి స్థిరత్వం కోసం చైనా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. దాని ఒత్తిడి మూలంగానే ఈ ఒప్పందం కుదిరింది. " ఈ ఒప్పందం కేవలం షాన్ స్టేట్ కు మాత్రమే అనుకూలంగా ఉంది." మిగిలిన ప్రాంతాలకు వర్తించదు అని బర్మావర్గాలు ఫెడరల్ కు చెప్పాయి.

భారత్ కు మేల్కొలుపు

ఇప్పటి వరకూ మయన్మార్ విషయంలో వేచిచూసే విధానాన్ని అవలంభిస్తున్న భారత్, తిరుగుబాటుదారులు, జుంటా అధికారుల మధ్య చైనా సాధించిన విజయం నిజంగా ఓ మేల్కొలుపుగా చెప్పవచ్చు. ఐదు పాయింట్ల ఫార్మూలాతో శాంతిచర్చలు జరపాలని ఆసియాన్ ప్రతిపాదించిన విధానంపై విశ్వాసం ఉంచింది.

చైనా, జుంటా అధికారులను మచ్చిక చేసుకోవడాని భారీ రాయితీపై మౌలిక వసతుల ప్రాజెక్ట్ లను ప్రారంభించింది. తమకున్న పట్టును నిలుపుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అందువల్ల చైనాకు సులువుగా హిందూమహసముద్రంలోకి ప్రవేశం లభిస్తుంది.

మయన్మార్ లో ఢిల్లీ తమ పట్టు నిలుపుకోవడానికి ఇదే సరైన సమయం. ఒక సమగ్రమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి సమర్ధవంతమైన బృందాన్ని ఎంపిక చేసుకుని వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది.

Read More
Next Story