
మహిళలు రాసిన పుస్తకాలను నిషేధించిన యూనివర్సిటీ ఏదో తెలుసా?
ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలో నివసిస్తున్న 1.5 మిలియన్ల ఆఫ్ఘన్ జాతీయులను తిరిగి వారి స్వదేశానికి బలవంతంగా పంపడమే కారణమా?
కొన్నేళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Talibans).. ఆ దేశ ప్రజలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. విచిత్ర నిబంధనలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ‘‘మహిళలు బహిరంగ ప్రదేశాలకు వెళితే ముఖం, శరీరాన్ని దాచుకోవాలి. పురుషులతో మాట్లాడకూడదు. పాటలు పాడకూడదు. కవిత్వం రాయకూడదు. ఒంటరిగా వెళ్లాల్సి వస్తే కుటుంబసభ్యుల్లో ఒకరు తోడు ఉండాలి. సమీప బంధువయినా వెంట ఉండితీరాలి. ఆడపిల్లలు 6వ తరగతి వరకు మించి చదువుకోరాదు.’’ అంటూ కండీషన్లు పెట్టారు. మహిళా ఆరోగ్య సిబ్బంది శిక్షణ సంస్థలపై నిషేధం విధిస్తూనే మహిళా టీవీ జర్నలిస్టులూ రిపోర్టింగ్ సమయంలో హిజాబ్ ధరించాలని హుకుం కూడా జారీ చేశారు.
తాజాగా తాలిబన్ ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ యూనివర్సిటీల్లో మహిళలు రాసిన పుస్తకాలను బోధించకూడదని(Ban of books)ఆర్డర్ పాస్ చేసింది. షరియా నిబంధనలు, తాలిబన్ విధానాలకు అనుగుణంగా లేని కారణంగా వాటిని బోధించవద్దని ఆదేశించింది. ఈ మేరకు తాలిబాన్ ప్రభుత్వ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ డిప్యూటీ అకడమిక్ డైరెక్టర్ జియావుర్ రెహమాన్ ఆర్యుబి యూనివర్సిటీలకు లేఖ రాశారు. మత పండితుల నిర్ణయం మేరకు 18 రకాల సబ్జెక్టులను బోధించేందుకు వీల్లేదని అందులో పేర్కొ్న్నారు.
బ్యాన్ విధించిన 680 పుస్తకాలలో "రసాయన ప్రయోగశాలలో భద్రత" శీర్షికతో ఉన్న పుస్తకాలతో సహా మహిళలు రాసిన 140 పుస్తకాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో ఇకపై 18 రకాల సబ్జెక్టులను బోధించడానికి అనుమతి లేదని తేల్చి చెప్పింది.
వాటిలో ఆరు ప్రత్యేకంగా మహిళల హక్కులు గురించి రాసినవి ఉన్నాయి. జెండర్, డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్‌లో మహిళల పాత్ర, మహిళలు- సామాజిక శాస్త్రం లాంటి పుస్తకాలూ ఉన్నాయి.
ఇటీవల తాలిబాన్ సుప్రీం ఆదేశాల మేరకు సుమారు 10 ప్రావిన్స్ ఏరియాల్లో ఇంటర్నెట్ సర్వీసులను రద్దు చేశారు. అనైతికతను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాలకులు సమర్థించుకున్నారు.
తాలిబన్ ప్రభుత్వ నిబంధనలు అక్కడి ప్రజలపై ముఖ్యంగా మహిళలు, బాలికలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బాలికలు 6 తరగతికి మించి చదువుకోడానికి వీల్లేకుండా నిషేధం విధించారు. 2024 చివరిలో మహిళ నర్సులను తయారుచేసే శిక్షణా సంస్థలను బ్యాన్ చేశారు. ఆఫ్ఘన్ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళల హక్కులను గౌరవిస్తామని చెబుతూనే.. ఇస్లాం నిబంధనలకు అనుగుణంగా లేవని మహిళలు రాసిన పుస్తకాలపై బ్యాన్ విధిస్తు్ండడం గమనార్హం.
బ్యాన్ చేసిన పుస్తకాలను సమీక్షిస్తున్న కమిటీ సభ్యురాలు ఒకరు.. మహిళలు రాసిన పుస్తకాలపై నిషేధం విధించిన విషయాన్ని ధ్రువీకరించారు, నిషేధిత పుస్తకాల్లో జాకియా అడెలి రచించిన పుస్తకం కూడా ఉంది. గతంలో న్యాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన జాకియా.. తాలిబన్ల చర్యతో ఏ మాత్రం ఆశ్చర్యపోలేదు. ‘‘స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వంతో ఉన్న తాలిబన్లు మహిళలను చదువుకోవడాన్ని ఇష్టపడరు. అదే క్రమంలో వారి అభిప్రాయాలు, ఆలోచనలు, రచనలు కూడా అణచివేయబడటం సహజం." అని చెప్పారు.
ఇరానియన్లే టార్గెట్?
మహిళల పుస్తకాలతో పాటు ఇరానియన్ రచయితలు, ప్రచురణకర్తల పుస్తకాలను లక్ష్యంగా చేసుకుని ఈ నిషేధం విధించినట్లు కనిపిస్తోంది. పుస్తక సమీక్ష ప్యానెల్‌లోని ఒక సభ్యుడు బీబీసీతో మాట్లాడుతూ..ఆఫ్ఘన్ పాఠ్యాంశాల్లో ఇరానియన్ కంటెంట్ కనిపించకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
మొత్తం 679 పుస్తకాలు..
ఆఫ్ఘనిస్తాన్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలకు అకడమిక్ డైరెక్టర్ జియావుర్ రెహమాన్ ఆర్యుబి పంపిన 50 పేజీల నోట్‌లో 679 పుస్తకాలు పేర్లున్నాయి. వీటిలో 310 పుస్తకాలు ఇరానియన్ రచయితలవే. లేదా అవి ఇరాన్‌లో ప్రచురితమైనవి. ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలో నివసిస్తున్న సుమారు 1.5 మిలియన్ల ఆఫ్ఘన్ జాతీయులను తిరిగి వారి స్వదేశానికి బలవంతంగా పంపించేసింది.
పుస్తకాలపై నిషేధం కొంతమంది లెక్చరర్లను ఆందోళనకు గురిచేసింది. "ఇరానియన్ రచయితలు, అనువాదకుల పుస్తకాలపై బ్యాన్.. ఉన్నత విద్యలో పెద్ద లోటుగా అభివర్ణిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ విశ్వవిద్యాలయాలకు ప్రపంచ విద్యా సమాజానికి మధ్య అంతరం ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు.
కాబూల్ విశ్వవిద్యాలయంలోని ఒక ప్రొఫెసర్ బీబీసీతో మాట్లాడుతూ..ఇలాంటి పరిస్థితులలో తాలిబాన్ ప్రభుత్వమే కొత్తగా పాఠ్యాంశాలను తయారు చేసుకోవాల్సి వస్తుందన్నారు. అయితే అవి ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయా? లేదా అన్నది కీలకమైన ప్రశ్న అని అన్నారు.