భారత్ - పాక్ కాల్పుల విరమణ లో అంతర్జాతీయ అంశాలు
x

భారత్ - పాక్ కాల్పుల విరమణ లో అంతర్జాతీయ అంశాలు

ఇండియా-పాకిస్తాన్ కాల్పుల విరమణ మీద డాక్టర్ . యస్. జతిన్ కుమార్ రెండు భాగాల విశ్లేషణలో ముగింపు

“ఆపరేషన్ సింధూర్” ముగియటం కన్నా అది ముగిసిన తీరు భారత జనావళిని హతాశులను చేసింది. పాలకులు పెంచి పోషించిన భావావేశాలతో కొందరు ఏదో అద్భుతాలు జరుగబోతున్నవని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ఈ ఆపరేషను కొనసాగుతుందని భావించారు. మరి కొందరు పాక్ తన ఉనికిని కోల్పోయి ఐదు ముక్కలుగా [బలోచిస్తాన్, ఫక్తునిస్తాన్, పంజాబ్, సింధ్, ఇస్లామాబాద్ లుగా] విడిపోయే వరకు ఇది సాగాలని కూడా ఆకాంక్షించారు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ బాధ్యులు, మీడియా, వార్తా ఛానళ్లు మొదటి నుంచి వ్యవహరించిన తీరు. అందువల్ల అమెరికా జోక్యంతో యుద్ద విరమణ జరగటం “దేశభక్తుల”ను తీవ్రంగా బాధించింది. మన సర్వసత్తాక అధికారానికి, సార్వభౌమ ప్రభుత్వా నికి భంగం వాటిల్లినట్లుగా వారు బాధ పడ్డారు. యుద్ధోన్మాదం పనికిరాదని, ఇతరేతర మార్గాలతో టెర్రరిజాన్ని ఎదుర్కోవాలని, పాకిస్థాన్ ను తటస్థీకరించాలని మొదటి నుంచి వాదించి, ‘దేశ భక్తి లేని వారు’ గా ముద్రపడ్డ వారు కూడా ఈ ముగింపును నిరసిస్తున్నారు. అమెరికా ఆధిపత్యవాద వ్యూహంలో భారత్ ఎంతగా కట్టు బడి ఉందో ఈ ఉదంతం తేటతెల్లం చేస్తున్నదని, స్వతంత్ర భారత పాలకుల పై అజ్ఞాతంగా వున్న సామ్రాజ్య వాద అధికార ప్రభావాన్ని కూడా ఈ విరమణ చాటి చెబుతున్నదని వారు భావిస్తున్నారు.

ఆపరేషన్ సింధూర్ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద మే 12 న ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్ పై విలేకరుల సమావేశం లో మాట్లాడారు. కాల్పుల విరమణ పిదపనే ఈ సమావేశం నిర్వహించారు. యుద్దం మొదట బలి తీసు కునేది ‘వాస్తవాన్నే’ అంటారు. మనకు జరిగిన నష్టాన్ని తగ్గించి చెప్పటం, ఎదురు పక్షాన్ని ఎలా మనము కోలుకోలేని చావుదెబ్బ కొట్టామో చెప్పటం ఒక రాజనీతి. ఈ పత్రికా సమావేశం దానికి మినహాయింపు కాదు. యుద్దం ఎందుకు విరమించవలసి వచ్చిందో ప్రజలకు సంతృప్తికరమైన సమాధానం వారు చెప్పలేక పోయారు. పాకిస్థాన్ వారి యుద్ద విమానాలను, క్షిపణులను మనం తీవ్రంగా నష్టపరిచామని చెప్పారు. భారతీయ సాంకేతికత, మన సైన్యం సమర్ధత ఆకాశ్, భార్ఘవ తదితర అస్త్రాలు శస్త్రాల గురించి విజయవంత మైన వాటి ప్రయోగాల గురించి ఎంతో ఘనంగా చెప్పారు. దానితో ఇక మన ఆయుధాలకు అంతర్జాతీయ మార్కెట్ లభిస్తుందని కూడా కొందరు సంబర పడుతున్నారు. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన మన అమ్ముల పొది లోని రాఫెల్ [ఫ్రెంచ్ తయారీ] విమానాన్ని చైనా సాంకేతికతతో పాక్ కూల్చివేయగలిగింది గదా అన్న ప్రశ్నకు ఎటూ నిర్ధారించ కుండా “యుద్దమన్నాక కొంత నష్టం జరుగుతుంది అయితే మన పైలెట్లు అంతా క్షేమంగా తిరిగి వచ్చారు” అని మాత్రం సమాధానమిచ్చారు. గత దశాబ్ద కాలం పాటు ఈ విమానం గురించి దేశంలో ఎంత ప్రచారం జరిగిందీ అందరికీ గుర్తే.

ప్రజలు విజయాలు మాత్రమే గుర్తుంచుకోవాలి అని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే రాబోయే వారమంతా త్రివర్ణ పతాక జైత్ర యాత్రను నిర్వహించమని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తే , తాము ఎన్ని మిలిటరీ విజయాలు సాధించామో ఈ అధికారులు చెప్పారు. భారత పాలకుల పై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చి, తిరిగి వారి భావోద్వేగాలను తమకు అనుకూలంగా మలుచు కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకు ప్రజలలో చైనా వ్యతిరేక భావనలు రెచ్చగొట్టడం ఒక సులువైన మార్గంగా భావిస్తున్నారు. పాకిస్థాన్ అనేక దేశాల నుండి దిగుమతి చేసుకున్న ఆయుధాలను ఈ యుద్దం లో ఉపయోగించింది. కానీ మన అధికారులు చైనా ఆయుధాలు, విమానాలు అంటూ వాటిని ప్రత్యేకంగా ప్రస్తావించి వాటిని కూల్చివేశామని ప్రకటించారు. అంటే పాకిస్థాన్ తో పాటు చైనాను కూడా మనం ఓడించాము అన్నరీతిలో చెబుతున్నారు.

ఉద్రిక్తతలు పెరిగి పోవటం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా ఇరు దేశాలు తమ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరిం చుకోవాలని కోరింది. భారత్ వైమానిక దాడులను ఖండించిన టర్కీ వాటిని పాక్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించ డమే నని ప్రకటించి ఇస్లామాబాద్ కు తన మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్ తో సహా అనేక అంతర్జాతీయ సంస్థలు ఉద్రిక్తతలను తగ్గించడం గురించి నొక్కిచెప్పాయి. శత్రుత్వం కొనసాగితే దారుణ మైన ఆర్థిక పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించాయి. ఉగ్రవాద చర్యలను అరికట్ట వలసిందే నని అనేక దేశాలు చెప్పాయి కానీ దానికోసం పాకిస్థాన్ మీద ఇండియా దాడులు చేయటాన్ని సమర్ధిస్తున్నట్లుగా ఎవరూ చెప్పలేదు.

చైనా పాక్ ను సమర్థించిందని, భారత్ పై పాక్ ఉపయోగించిన క్షిపణులను సరఫరా చేసిందని చైనాను పేరు పెట్టి భారత్ విమర్శించింది. చైనాకు చెందిన పీఎల్-15 ఎయిర్ టు ఎయిర్ క్షిపణులు, టర్కిష్ బైకర్ వైఐహెచ్ఏ 3 కామికేజ్ డ్రోన్లతో సహా పాకిస్తాన్ ఉపయోగించే అత్యాధునిక విదేశీ ఆయుధాల శ్రేణిని భారత సాయుధ దళాలు అడ్డుకుని నిర్వీర్యం చేశాయి అని చెబుతూ పాక్ ప్రయోగించిన చైనా లో తయారైన లాంగ్ రేంజ్ పీఎల్-15 క్షిపణి అవశేషాలను డీజీఎంవోలు మీడియా సమావేశంలో ప్రదర్శించారు. తుర్కీయే, అజర్బైజాన్, చైనాలు పాకిస్తాన్ ను సమర్థించాయనీ మిగతా దేశాలన్నీ మనకు అండగా నిలిచాయని చెబుతున్నారు. కానీ పాక్ అణుశక్తిని, వాయుసేన శక్తిని ఆధునికం చేస్తూ, పెంచుతూ, నియంత్రిస్తూ అన్ని చోట్ల తానే అన్నట్లు వున్న అమెరికాను పల్లెత్తు మాట అనలేదు. అంతేకాదు ఐ ఎం ఎఫ్ లో కాని, ఐక్యరాజ్య సమితి తీర్మానాల్లో కానీ వీరు చెబుతున్న భారత సానుకూలత కనిపించటం లేదు. ఇక రాజకీయ, ఆర్థిక, సైనిక రంగాల్లో చైనా-పాక్ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయని అందరికీ తెలిసిందే. గత వారం టర్కీ డ్రోన్లను మాత్రమే పాకిస్తాన్ ఉపయోగిస్తోందని భారత్ పేర్కొంది. కానీ ఇప్పుడు బహిరంగంగా చైనా ఆయుధాల పేర్లను పేర్కొంది. మరి మనకూ, పాకిస్థాన్ కూ కూడా మిత్ర దేశం అని చెప్పుకుంటున్న అమెరికా ఆయుధాలు పాక్ పెద్ద ఎత్తున వాడుతోంది గదా వాటినెందుకు ప్రస్తావించటం లేదు? వారి ఎఫ్-16 విమానాల గురించి ఎందుకు ప్రచారం లేదు?

చైనా అభివృద్ధి చేసిన పీఎల్-15, గగనతల లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన దీర్ఘశ్రేణి, రాడార్-గైడెడ్ క్షిపణి. వారి దేశీయ వెర్షన్ పరిధి 300-500 కి.మీ. కాగా వారు పాకిస్థాన్ కు ఇచ్చింది గరిష్టంగా 145 కిలో మీటర్ల పరిధిని కలిగి ఉన్నవి మాత్రమే. ఏప్రిల్ 26న పాక్ వైమానిక దళం పీఎల్-15ఈ, పీఎల్-10 క్షిపణులతో కూడిన జేఎఫ్-17ల విజువల్సును విడుదల చేసింది. పిఎల్ -15 ని మోహరించగల సామర్థ్యం ఉన్న సుమారు 70 యుద్దవాహక విమానాలు వారివద్ద ఉన్నాయి. ఆ రెండు దేశాలు సంయుక్తంగా జె-17 విమానాలను తయారు చేస్తున్నాయి. ఇందులో ఏదీ రహస్యం కాదు. కానీ అన్ని సైనిక చర్యలను నిలిపి వేయడానికి పాకిస్తాన్తో ఒప్పందం కుదిరిన రెండు రోజుల తరువాత పిఎల్ -15 పై భారత సైన్యం చేసిన ప్రకటన ఉద్దేశ్యమేమిటి?

పహల్గామ్ ఉగ్రదాడిని చైనా ఖండిస్తోందని, అన్నిరకాల ఉగ్రవాదాన్ని చైనా వ్యతిరేకిస్తుందని వారి విదేశాంగ మంత్రి వాంగ్ యీ చెప్పారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు అల్లకల్లోలంగా, పెనవేసుకొని ఉన్నాయి. ఆసియా ప్రాంతం లో శాంతి, సుస్థిరతలు కష్టపడి సాధించుకున్నామని, వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన భారత రక్షణ వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ తో స్పష్టంగా చెప్పారు. భారత్, పాకిస్థాన్ లు భౌతికంగా దూరంగా జరగలేని పొరుగు దేశాలు, అవి రెండూ చైనాకు పొరుగు దేశాలు. యుద్ధం అనేది భారత్ ఎంపిక కాదన్న ప్రకటనను చైనా అభినందిస్తున్నది, భారత్, పాకిస్తాన్ లు శాంతియుతంగా, సంయమనంతో ఉంటాయని, చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను సక్రమంగా పరిష్కరించుకుంటాయని, పరిస్థితి మరింత దిగజారకుండా అవి జాగ్రత్త పాటించాలని చైనా మనస్ఫూర్తిగా ఆశిస్తోంది. సంప్రదింపుల ద్వారా భారత్, పాకిస్తాన్ లు సమగ్రమైన, శాశ్వత కాల్పుల విరమణను సాధించా లని చైనా ఆశిస్తోంది. ఇది భారత్, పాకిస్తాన్ ల ప్రాథమిక ప్రయోజనాలకు సంబంధించినదని, అంతర్జాతీయ సమాజం ఉమ్మడి ఆకాంక్ష అని పేర్కొంది. భారత్- పాక్ ల మధ్య కాల్పుల విరమణకు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని చైనా చెబుతున్న తరుణంలో బీజింగ్ ను పక్కన పెట్టటం భారత్, పాక్ ల మధ్య శత్రుత్వంలో చైనా పాత్రపై తప్పుడు సంకేతాలు పంపుతుంది. ఒక సూత్రబద్దమైన వైఖరిని అవలంబిస్తున్న చైనాను శత్రు కూటమిలో చేర్చడం వల్ల భారత్ సాధించే దేమిటి? దక్షిణాసియా సంఘర్షణలలో మధ్యవర్తిగా చైనా పాత్ర ను, ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలకు దాని ప్రాధాన్యతను గుర్తించకపోతే ఎలా?

ప్రపంచంలో పాకిస్థాన్ ఏకాకిగా మారిందని 150 కి పైగా దేశాలు భారత్ ను సమర్థిస్తున్నాయని మిలిటరీ విజయంతో పాటు ఒక బ్రహ్మాండమైన దౌత్య విజయం సాధించామని ప్రచారం మొదలు పెట్టారు. ఆపరేషన్ సింధూర్, తర్వాత భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. “యుద్దము యుద్దమంచు మది ఉబ్బగ నీకుము, మౌనియై అసంబద్దములైన మాటలాడకుము ఎవరెట్టు లాడినన్” అని చెప్పి సాధారణంగా యుద్దాన్ని నివారించే మాటలే వారు చెప్పారు.

ఎందుకోసమైనా గాని కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో అమెరికా కీలక పాత్ర పోషించింది, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని సులభతరం చేయడంలో అమెరికా చేసిన ప్రయత్నాలను విశదం గా చెప్పారు. ఇరు దేశాల నాయకులు లోకజ్ఞానం తోను, వివేకంతోనూ వ్యవహరించి కాల్పుల విరమణకు అంగీకరించారని మొదట చెప్పిన ట్రంప్; మరుసటి రోజు యుద్దాన్నివిరమించకపోతే మీ మీద ఆర్ధిక ఆంక్షలు, వాణిజ్య నిషేధాలు విధిస్తానని బెదిరించితే రెండు దేశాలు ఒప్పుకున్నాయని వెల్లడించారు. యుద్దం జరిగినా విరమించినా ఇరు దేశాలలోను తన ప్రాబల్యం తగ్గకుండా చూసుకోవటమే అమెరికా లక్ష్యం.

అమెరికా వేగిరపాటు తో చేసిన ప్రకటన వల్ల కలిగిన నష్ట నివారణ చర్యల్లో భాగంగా జమ్ముకశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తో నెలకున్న వివాదంలో మధ్యవర్తిత్వం వహిస్తానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతి పాదనను తిరస్కరిస్తున్నట్లు భారత్ పదే, పదే పునరుద్ఘాటిస్తున్నది. కాశ్మీర్ కు సంబంధించిన ఏ సమస్య నైనా భారత్, పాకిస్థాన్లు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటాయని ఇది భారత్ దీర్ఘకాలిక జాతీయ వైఖరి అని చెబుతు న్నారు. ఈ మాటలు ఆచరణలో పాటించడం జరుగుతుందా అనే అనుమానం దేశ ప్రజల్లో నెలకొన్నది.

ప్రధాని మోడీ 13 వ తరీఖు ఉదయం ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. తన పర్యటన కోసం మోడీ ఈ వైమానిక స్థావరాన్ని ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మన ఎస్-400 వ్యవస్థకు కీలకమైన వైమానిక రక్షణ కేంద్రంగా అది ప్రాచుర్యాన్ని పొంది వుంది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పిఆర్) తాము బాగా నష్టం కలిగించిన వైమానిక స్థావరాలలో ఒకటిగా అదంపూర్ ను పేర్కొంటోంది. దీనికి ఋజువుగా పాకిస్తాన్ వైమానిక దళం చైనీస్ ఉపగ్రహ చిత్రాలను చూపెడుతోంది. ఇప్పుడు మోడీ అక్కడికి వెళ్ళి ఆ ప్రచారాన్ని పూర్వపక్షం చేయాలనుకున్నారు. అదంపూర్ క్షేమంగా వుందని, పాక్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని అంతర్జాతీయ సమాజానికి ఆయన సంకేతం పంపుతున్నారు.

భారత్-పాక్ కాల్పుల విరమణలో ట్రంప్ పాత్ర ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. “ఎంతోమంది మరణానికి, విధ్వంసానికి దారితీసిన ప్రస్తుత దురాక్రమణను ఆపాల్సిన సమయం ఆసన్న మైందని అర్థం చేసుకునే శక్తి, వివేకం, ధైర్యసాహసాలు భారత్, పాకిస్థాన్ల బలమైన, అచంచలమైన శక్తిమంతమైన నాయకత్వానికి వున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.” అని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రంప్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చర్చల మధ్యవర్తిత్వంలో అమెరికా పాత్ర గురించి మరిన్ని వివరాలను అందించారు. గత 48 గంటల్లో, ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, అసిమ్ మాలిక్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్ లతో సహా భారత, పాకిస్థాన్ సీనియర్ అధికారులతో నేను, ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ చర్చలు జరిపాం" అని చెప్పారు. జేడీవాన్స్ స్పందిస్తూ'అధ్యక్షుడి బృందం, ముఖ్యంగా కార్యదర్శి రూబియో నుంచి గొప్ప కృషి జరిగినది. ఈ కాల్పుల విరమణకు సహకరించిన భారత్, పాక్ నేతలకు నా కృతజ్ఞతలు' అని పేర్కొన్నారు.

భారత్ వర్గాలు చేసిన ప్రకటనల్లో ఈ విషయం ఎక్కడా ప్రస్తావించలేదు. పాకిస్తాన్ కోరినందువల్ల భారత్ ఈ ప్రతిపాదనను పరిశీలించి ఆమోదించింది అని మాత్రమే చెప్పారు. భారత్ వైఖరికి భిన్నంగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ “ఈ ప్రాంతంలో శాంతి కోసం అధ్యక్షుడు ట్రంప్ నిర్వహించిన క్రియాశీలక, నాయకత్వ పాత్ర కు ధన్యవాదాలు” అని తెలిపారు. ప్రాంతీయ శాంతి, సుస్థిరతల దృష్ట్యా తాము అంగీకరించిన ఈ పరిణామా ని క సహకరించిన అమెరికాను పాక్ అభినందిస్తున్నట్లు తెలిపారు. దక్షిణాసియాలో శాంతి కోసం విలువైన సహకారం అందించిన వాన్స్, రుబియో లకు షరీఫ్ వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్న, శాంతి, శ్రేయస్సు, సుస్థిరత దిశగా తన ప్రయాణాన్ని అడ్డుకున్న సమస్యల పరిష్కారంలో ఇది ఒక కొత్త ఆరంభంగా పాకిస్థాన్ భావిస్తోందని” ఆయన అన్నారు. యునైటెడ్ కింగ్ డం లోని పాకిస్తాన్ హై కమిషనర్ మొహమ్మద్ ఫైజల్ ఒక ఇంటర్వ్యూలో, భారత- పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అధ్యక్షుడు ట్రంప్ పాత్రను మీరు స్పష్టం చేయగలరా అని అడిగితె ‘దాని గురించి నాకు వివరాలు తెలీవు, కానీ అధ్యక్షుడు ట్రంప్ ను అనుమానించడానికి నాకు ఎటువంటి కారణం లేదు, ఆయన దీనిలో పాత్ర పోషించినట్లు స్వయంగా 'ట్వీట్' చేశారు. మన స్నేహితులు మనం శాంతిని పొందటానికి సహాయం చేస్తే అది చాలా మంచిదె కదా!” అన్నారు.

ట్రంప్ మరోసారి “ఇంతమంది మరణానికి, విధ్వంసానికి కారణమయ్యే దురాక్రమణను ఆపినందుకు భారత్, పాకిస్తాన్లను చూసి గర్వపడుతున్నాను. ఈ చారిత్రాత్మక, వీరోచిత నిర్ణయానికి రావడానికి అమెరికా మీకు సహాయం చేయగలిగినందుకు నేను గర్విస్తున్నాను. ఇప్పటివరకు చర్చించ నప్పటికీ, ఈ రెండు గొప్ప దేశాలతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను" అని పేర్కొన్నారు.

ట్రంప్ ఎన్నికల వాగ్దానాలలో యుద్దాలను ఆపివేస్తానన్నది ఒక ముఖ్యమైన మాట. తననో శాంతి దూతగా గుర్తించాలని, నోబెల్ శాంతి అవార్డు పొందాలని ఆయన కోరికలట. రష్యా-ఉక్రైన్ వివాదాన్నిగాని, ఇజ్రాయల్-పాలస్తీనా మారణ కాండను గానీ ఆయన ఆపలేకపోయాడు. ఇప్పుడు ఒక అణు యుద్దాన్ని నివారించి మానవ జాతిని కాపాడాననే ఖ్యాతి కొట్టేయడం కోసం తన మాట వినే పాకిస్తాన్ భారత్ లను అదిరించీ, బెదిరించీ ఈ కాల్పుల విరమణ ప్రకటించారని ఒక బలమైన అభిప్రాయం వుంది. ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తోందని భారత విదేశాంగ కార్యదర్శి శనివారం రాత్రి టెలివిజన్ ప్రసంగం లో ఆరోపించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ప్రసంగంలో కాల్పుల విరమణ ఉల్లంఘనల గురించి ప్రస్తావించలేదు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది. కాల్పుల విరమణ ను ఉల్లంఘించింది భారత దేశమేనని, పాకిస్తాన్ సాయుధ దళాలు పరిస్థితిని "బాధ్యతతో సంయమనం తో" చక్క దిద్దాయని తెలిపింది. కాల్పుల విరమణను విశ్వసనీయంగా అమలు చేయడానికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని వారు పేర్కొన్నారు

ఇంతకీ ట్రంప్ భారత్ కు ఏమైనా అనుకూలంగా వ్యవహరిస్తారా ? మోడీ తో ఆయన మిత్రత్వం మన దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనేది పెద్ద ప్రశ్న. పాకిస్థాన్ కు ఐ ఎం ఎఫ్ ఇచ్చే రుణాన్ని నిలిపి వేయమని భారత్ కోరింది. కాని పాకిస్థాన్ ఒక బిలియన్ డాలర్ల తొలివిడత రుణం పొందింది. అమెరికా మద్దతు లేకుండా ఇది సాధ్యం కాదు. పాకిస్థాన్ కు తుర్కీయే డ్రోన్లు,మిస్సయిల్స్ అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ యుద్ద సమయంలో తుర్కీయేకు 30.4 కోట్ల డాలర్ల క్షిపణులు విక్రయించడానికి అమెరికా సమ్మతించింది. యుద్దం వల్ల భారత్ కూడా ఆర్ధిక ఇబ్బందులకు లోనవుతుంది. తాజాగా ఎన్ అర్ ఐ లు అమెరికా నుండి పంపే నిధులపై ట్రంప్ 5% పన్ను ప్రకటించారు. దానివల్ల భారత్ కు ఆ ఆదాయం కూడ తగ్గిపోతుంది. అలాగే వాణిజ్య యుద్దంలో భాగంగా విధించిన సుంకాలలో భారత్ కు ప్రత్యేక రాయితీలు ఏమీ ఇవ్వలేదు. ఇంకా వాణిజ్య ఒప్పందమూ కుదరలేదు. అక్రమ వలసల పేర అమెరికా నుండి ఎందరో భారతీయులను పంపించి వేయటమూచూసాము. ఇవన్నీ గమనిస్తే ట్రంప్ భారత్ ప్రయోజనాలకోసం నిలబడతాడని విశ్వసించలేము.

అమెరికా సెప్టెంబర్ 24 లో పాకిస్థాన్ కు 18 కొత్త ఎఫ్ -16 సి / డి యుద్ధ విమానాల ను అమ్మే ఒక ఒప్పందంపై సంతకం చేసింది. గతంలో కొనుగోలు చేసిన 34 యుఎస్ ఎఫ్-16 ఎ/బి విమానాల ఆధునీకరణకు మరొక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ట్రంప్ ప్రభుత్వం ఫిబ్రవరి 2025 లో[ రాయిటర్స్ నివేదిక ప్రకారం,] " పాకిస్తాన్లో యుఎస్ మద్దతు కలిగిన అణ్వాయుధ కార్యక్రమం కోసం 397 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. అది యుఎస్ అందించిన ఎఫ్ -16 యుద్ధ విమానాల నిర్వహణకు కూడ ఉపయోగపడుతుంది. ఆ యుద్ద విమానాలను పాకిస్తాన్ ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మాత్రమే ఉపయోగించాలనీ, భారతదేశానికి వ్యతిరేకంగా దాన్ని వాడకూడదని షరతు వున్నది. కానీ పాక్ ఈ దాడులలో ఎఫ్-16 విమానాలను వాడిందని భారత్ వాటిని కూల్చివేసిందని వార్తలు వచ్చాయి.

పాకిస్థాన్ వైమానిక దళం (పీఏఎఫ్) 161 జేఎఫ్-17 థండర్ విమానాలను నడుపుతోంది. ఇందులో వివిధ మోడల్స్ ఉన్నాయి, వీటిని చైనా సరఫరా చేసింది. జెఎఫ్ -17 ఎగుమతి కోసం చైనా రూపొందించిన చౌకైన, యుద్ధవిమానం .అది రష్యా ఇంజిన్ పై ఆధారపడి వుంటుంది. దాని ఆయుధ వ్యవస్థ అత్యాధునికమైనదికాదు. వీటిని చైనా వాడదు. చైనా తన గగనతల రక్షణ అవసరాలకు తగిన జె-20, జె-10సి, జె-16 వంటి అధునాతన యుద్ధ విమానాలను అభివృద్ది చేసుకుంది.ఈ దాడులలో పాకిస్థాన్ జెఎఫ్-17 విమానాలు వాడగా, వాటిని ఇండియా కూల్చివేయటం జరిగినది. దీనితో అటు అమెరికా, ఇటు చైనా రెండింటి సాంకేతికతను మించిన భారతీయ గగన తల రక్షణ చక్రం సుదర్శన చక్రం అని గొప్పగా ప్రచారం జరిగినది.

ట్రంప్ భారత్,పాకిస్థాన్ రెండింటినీ గొప్ప దేశాలుగా వర్ణించడం, ఇద్దరి నాయకులను వివేకవంతులుగా కీర్తించ టం, తమను పాకిస్థాన్ వంటి ఒక ఉగ్రవాద దేశంతో సమానంగా చూడటం భారత పాలకులకు మింగుడు పడటం లేదు. అత్యంత మిత్ర దేశంగా అమెరికా ప్రపంచ వ్యూహంతో పెనవేసుకుని సాగుతున్నా, కనీసం క్వాడ్ దేశాలైనా తనకు బాహాటంగా సమర్ధన ఇవ్వకపోవటం వారికి మనసులో కినుక కలిగిస్తోంది. దీనిని కప్పి పుచ్చటానికి అనేక దేశాలు మన వెనుక ఉన్నాయి అనే భ్రమను దేశంలో వ్యాపింప చేస్తున్నారు.

పాకిస్థాన్ ను దౌత్యపరంగా ఒంటరిని చేశామని చెబుతున్నారు కానీ వారికి ఇరాన్, టర్కీ, సౌదీ అరేబియా , చైనాలతో విదేశీ సంబంధాలు ముఖ్యమైనవి. పర్షియన్ గల్ఫ్ తో జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలలో విస్తృతమైన సహకారం దానికి ముఖ్యం. యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర పాశ్చాత్య దేశాలతో విస్తృత ద్వైపాక్షిక సంబంధాలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ఈ స్థితిలో గణనీయమైన మార్పులు ఏమీ రాలేదు. అయా దేశాలతో వారి సంబంధాలు క్షీణించిన దాఖలా ఏమీ లేదు.

ప్రపంచ శక్తులు పహల్గామ్ దాడిని ఖండించాయి, అవి భారతదేశం యొక్క ఆత్మరక్షణ హక్కును కూడా ఆమోదించాయి. అయితే భారత్ పాకిస్థాన్ పై చేసిన సైనిక దాడిని సమర్థించాయా అంటే స్పష్టంగా చెప్ప లేము. యునైటెడ్ కింగ్‌డమ్, రష్యా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, జపాన్, సౌదీ అరేబియా, యుఎఇ మరియు ఖతార్ వంటి కీలక గల్ఫ్ దేశాలు భారతదేశానికి సంఘీభావం ప్రకటించాయి. అయితే వీరందరూ కూడా యుద్ద విరమణ చర్యలను ఆహ్వానించారు. “ఈ యుగం యుద్దాల యుగం కాదు అలాగే ఇది ఉగ్ర వాదుల యుగమూ కాదు” అన్న మోడీ పలుకులను అనుసంధానిస్తూ అన్ని ప్రాంతాల లోనూ, అన్ని రకాల ఉగ్రవాదాన్ని అంతరింప జేయటమే ఈ యుగస్వరం కావాలి. (ముగింపు).

Read More
Next Story