పక్కా ముస్లిం గడ్డపై ఫక్తు హిందుస్థానీ పోటీ!  ఆల్ ది బెస్ట్ సవీరా..
x
dr Saveera Prakash

పక్కా ముస్లిం గడ్డపై ఫక్తు హిందుస్థానీ పోటీ! ఆల్ ది బెస్ట్ సవీరా..

పాక్ లో బూజు పట్టిన మూస పద్ధతుల్ని బద్దలు కొట్టడానికి 55 ఏళ్లు పట్టింది. ఇన్నేళ్ల తర్వాత మైనారిటీ హిందూ మహిళ ఒకరు ఎన్నికల్లో పోటీకి దిగారు. ఎవరామె? ఏమా కథ?


2024లో ప్రపంచ వ్యాప్తంగా భారత్ సహా 8 దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిల్లో మన దాయాది దేశమైన పాకిస్థాన్ ఒకటి. పాకిస్థాన్ రాజకీయ రంగంలో ఓ సంచలనం, చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం దేశంగా ప్రకటించుకున్న పాకిస్థాన్ లో ఓ హిందూ మహిళ పోటీకి దిగి చరిత్ర సృష్టించింది. ఆమె డాక్టర్ సవీరా ప్రకాశ్. ఆమె ఉండేది పాకిస్తాన్‌లో గిరిజనులు ఎక్కువగా ఉండే ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలోని బునెర్ జిల్లా. డాక్టర్ సవీరా ప్రకాశ్ ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరగబోయే ఎన్నికల్లో పోటీకి నామినేషన్‌ను దాఖలు చేశారు. ఓ మహిళ అదీ ఓ హిందూ మహిళ పోటీకి దిగడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అంటున్నారు.

పాకిస్థాన్ లో హిందువులు మైనారిటీలు...


పాకిస్థాన్ లో మెజారిటీ ప్రజలు ముస్లింలు. హిందువులు మైనారిటీలు. పైగా పాకిస్థాన్ తమది ముస్లిం దేశంగా ప్రకటించుకుంది కూడా. అటువంటి చోట మైనారిటీ-హిందూ-కమ్యూనిటీకి చెందిన విశిష్ట సభ్యురాలు డాక్టర్ సవీరా ప్రకాశ్ జనరల్ సీటులో పోటీకి దిగారు. పీకే-25 నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. నిర్దేశించిన గడువు ప్రకారం ఫిబ్రవరి 8న ఎన్నికలు జరిగితే బరిలో నిలుస్తున్న వారి జాబితాలో ఆమె పేరు ఉంటుంది. డాక్టర్ సవీరా ప్రకాశ్ జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీల రెండు రిజర్వు స్థానాలకు కూడా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆమెకు, ఆమె కుటుంబానికి 35 ఏళ్లుగా పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)తో రాజకీయ అనుబంధం ఉంది.

ఎవరీ డాక్టర్ సవీర్ ప్రకాశ్?

దేశ విభజన సమయంలో పంజాబ్ నుంచి వలస వెళ్లిన కుటుంబాల్లో సవీరా ప్రకాశ్ కుటుంబం ఒకటి. ఆమె తండ్రి వృత్తిపరంగా వైద్యుడు. క్రియాశీల రాజకీయవేత్త. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)తో అనుబంధం ఉంది. తండ్రి డాక్టర్ ఓం ప్రకాశ్ ప్రోత్సాహంతో ఆమె రాజకీయరంగంలోకి ప్రవేశించారు. సామాజిక సేవ కార్యకర్త కూడా. ఖైబర్ పక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌కు చెందిన రిటైర్డ్ వైద్యుడైన డాక్టర్ ఓం ప్రకాశ్ మానవతావాది. మానవాళికి సేవ చేయాలన్న తాపత్రం మెండు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఆరోగ్య కేంద్రాలకు సేవలు అందించారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆమె రాజకీయాల్లో ఉంటే మేలని చాలా మంది సూచించారు. ఆమె కూడా ఆసక్తి చూపారు. పీపీపీ కూడా టికెట్ ఇచ్చేందుకు ముందుకు అంగీకరించింది. డాక్టర్ సవీరా ప్రకాశ్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉంటే విధానపరమైన నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచవచ్చునని తండ్రి ఓం ప్రకాశ్ కూడా భావించారు. యువత ముందుకు రాకపోతే రాజకీయ సంస్కరణలు రావన్నది డాక్టర్ సవీరా నిశ్చితాభిప్రాయం.

అబోటాబాద్ మెడికల్ కాలేజీలో చదువు...

సవీర 2022లో అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ (MBBS)లో పట్టాతీసుకున్నారు. ఇప్పుడామె ఓపక్క రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే మరోపక్క సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్‌కు అంటే మన సివిల్స్ లాంటి పోటీపరీక్షలకూ ప్రిపేర్ అవుతున్నారు. మహిళల సామాజిక అభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తానని డాక్టర్ సవీరా ప్రకాశ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తన కృషి ప్రజాభివృద్ధికి తోడ్పడుతుందన్నది ఆమె గట్టి అభిప్రాయం. దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ భవిష్యత్ ను మార్చాలంటే రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం చాలా అవసరం అంటారు ఆమె.

మహిళల తలరాతలు మార్చేలా కృషి చేస్తా...

పీపీపీ విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మహిళలకు సురక్షితమైన పని పరిస్థితులు, వారి హక్కుల కోసం విద్యార్థి దశ నుంచే పాటుపడుతూ వస్తున్నారు. అణగారిన వర్గాల కోసం పని చేయాలనుకుంటున్నానని ప్రకాశ్ ‘డాన్‌’ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ.. “తాను ఎన్నికైతే, అభివృద్ధి రంగంలో మహిళలను తరతరాలు నిర్లక్ష్యం చేయడం, అణచివేయడం వంటి అంశాలను చట్టసభలో ప్రస్తావిస్తాను” అని చెప్పారు.

సవీర ఇంకా ఏమన్నారంటే "మానవత్వానికి సేవ చేయడం" తన రక్తంలో ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, నిస్సహాయతను ఓ డాక్టర్ గా తాను ప్రత్యక్షంగా అనుభవించానని, శాసనసభ్యురాలిగా ఎన్నికైతే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పారు.

ఆమె రాక రాజకీయ చిత్రపటంలో పెద్ద మలుపే...


డాక్టర్ ఓం ప్రకాష్ తన కుమార్తెను బునెర్ సెగ్మెంట్ నుంచి రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు. పీపీపీ సీనియర్ రాజకీయ నేతలు కూడా అదే సరైన నిర్ణయంగా భావించింది. ఈ నిర్ణయం ఈ ప్రాంత రాజకీయ భౌగోళిక పరిణామంలో పెద్ద మలుపుగా అభివర్ణిస్తున్నారు ఇప్పుడు స్థానికులు. రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించే ప్రయత్నాల్లో భాగంగా పాకిస్తాన్ ఎన్నికల సంఘం (PEC) ఇటీవల జనరల్ సీట్లలో 5 శాతం సీట్లను మహిళలకు కేటాయించింది. ప్రస్తుత ఎన్నికల్లో 28,600 మంది అభ్యర్థులుంటే వారిలో 3,000 మంది మహిళా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వారిలో డాక్టర్ సవీరా ప్రకాశ్ ఒకరు. పాకిస్తాన్ రాజకీయాల్లో అభివృద్ధి చెందుతున్న డైనమిక్స్, మహిళల భాగస్వామ్యానికి మహిళలు నామినేషన్లు వేయడం ఓ నిదర్శనం.

డాన్ పత్రిక ఏమి రాసిందంటే..

పాకిస్థాన్‌లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సవీరా ప్రకాశ్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఇలా ఓ మహిళ అదీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున పోటీకి దిగడం పెద్ద రాజకీయ పరిణామంగా, పోటీ చేస్తున్న మొదటి హిందూ మహిళగా ‘డాన్’ పత్రిక రిపోర్ట్ చేసింది. క్వామీ వతన్ పార్టీ (QWP)కి అనుబంధంగా ఉన్న స్థానిక రాజకీయ నాయకుడు సలీమ్ ఖాన్ ‘డాన్‌’తో మాట్లాడుతూ.. బునెర్ నుంచి జనరల్ సీటుకు నామినేషన్ పత్రాలను సమర్పించిన మొదటి మహిళ సవీరా అని చెప్పారు. బునర్‌కు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఇమ్రాన్ నోషాద్ ఖాన్ కూడా ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు, ఆమె రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా సవీరా ప్రకాశ్ ను హృదయపూర్వకంగా సమర్థించారు.

మూసపద్ధతుల్ని బద్దలు కొట్టిన సవీర..


పాకిస్థాన్ 16వ జాతీయ అసెంబ్లీ సభ్యులను ఎన్నుకునేందుకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగాలి. అయితే అవి జరుగుతాయా లేదా అనేది సందేహాస్పదంగా ఉంది. ప్రస్తుత పాలకులు ఎన్నికల్ని వాయిదా వేయవచ్చునన్న ఊహాగానాలు వస్తున్నాయి. ఏదిఏమైనా, పాక్ మూస పద్ధతులను బద్దలు కొట్టారు డాక్టర్ సవీరా. బునర్‌లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒక మహిళ ముందుకు రావడానికి దాదాపు 55 ఏళ్లు పట్టింది. ఆల్ ది బెస్ట్ డాక్టర్ సవీరా.

Read More
Next Story