‘నిఖిల్ గుప్తా’ను అమెరికాకు అప్పగించండి: కోర్టు తీర్పు
x
ఖలిస్తాన్ ఉగ్రవాదీ పన్నూ

‘నిఖిల్ గుప్తా’ను అమెరికాకు అప్పగించండి: కోర్టు తీర్పు

ఖలిస్తాన్ తీవ్రవాదీ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నాడనే ఆరోపణపై జైలులో ఉన్న భారత సంతతికి చెందిన వ్యక్తిని యూఎస్ కి అప్పగించాలని కోర్టు తీర్పు చెప్పింది.


నిషేధిత సిఖ్ ఫర్ జస్టిస్ అధినేత, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ను అమెరికాలో హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న నిఖిల్ గుప్తాను అమెరికా కు అప్పగించాలని చెక్ కోర్టు ఆదేశించింది. దీనిపై నిఖిల్ పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది.

నిఖిల్ గుప్తా, ఖలిస్తాన్ ఉగ్రవాది పన్నూను చంపడానికి కుట్ర పన్నాడని, దీని వెనక భారత ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉందని అమెరికా ప్రభుత్వం ఆ దేశ కోర్టులో అభియోగాలు నమోదు చేసింది. అమెరికా అభ్యర్థనపై నిఖిల్ గుప్తాను గత ఏడాది జూన్ 30న చెక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. అనంతరం గుప్తాను తమకు అప్పగించాలని ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చింది. ప్రస్తుతం అతను ప్రేగ్ జైలులో ఉన్నాడు.

" కోర్టు నిర్ణయాన్ని అన్ని పక్షాలకు అందించిన తరువాత ఫైల్ ను చెక్ న్యాయ శాఖ మంత్రికి అందిస్తాం, నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించాలా వద్దా అనేది న్యాయశాఖ మంత్రి పావెల్ బ్లాజెక్ నిర్ణయిస్తారు " అని చెక్ న్యాయశాఖ ప్రతినిధి వ్లాదిమిర్ సెప్కా చెప్పారు.

కోర్టు నిర్ణయం పై అభ్యంతరాలుంటే తీర్పు, న్యాయశాఖ మంత్రిత్వ శాఖ కు చేరిన రోజు నుంచి మూడు నెలల లోపు వారి నిర్ణయాన్ని సమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ఆయన అన్నారు. అయితే న్యాయశాఖ మంత్రి నిర్ణయంపై కాలపరిమితి లేదని చెప్పారు. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించకుండా అడ్డుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను న్యాయపరంగా ఉపయోగించుకోవచ్చని సెప్కా పేర్కొన్నారు.

నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించకూడదని న్యాయశాఖ మంత్రిని కోరతానని ఆయన తరుఫున వాదిస్తున్న న్యాయవాదీ చెప్పారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తానని, రాజ్యాంగ ధర్మాసనానికి కేసును నివేదిస్తామని చెప్పినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

అంతకుముందు చెక్ రిపబ్లిక్ లో కస్టడీలో ఉన్నప్పుడు గుప్తా, మానవ హక్కుల ఉల్లంఘనలకు గురయ్యారని, కస్టడీని ఏ కారణం లేకుండా పొడిగిస్తున్నారని న్యాయవాదీ ఆరోపించారు. కోర్టుకు ప్రభుత్వం సమర్పించిన పత్రాలలో గుప్తా, చివరిసారిగా 2017లో యూఎస్ లో ఉన్నట్లు పేర్కొన్నారు.

నిఖిల్ గుప్తా వ్యవహరంపై భారత ప్రభుత్వం కూడా అప్పట్లోనే స్పందించింది. దీనిపై అత్యున్నత స్థాయి కమిటీని నియమించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. భారత్ ఇలాంటి వ్యవహరాలను ఎప్పుడు ప్రొత్సహించదని పేర్కొంది.

Read More
Next Story