బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియాకు గృహ నిర్బంధం నుంచి విముక్తి
x

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియాకు గృహ నిర్బంధం నుంచి విముక్తి

2018లో అక్రమాస్తుల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జియాకు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది షేక్ హసీనా సర్కారు. జియా రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు.


కోపం..ప్రతీకారంతో కాదు..ప్రేమ, శాంతితో దేశం పునర్నిర్మితమవుతుందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) చైర్‌పర్సన్ ఖలీదా జియా పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాని షేక్ హసీనా దేశం వీడిన తర్వాత జియా అన్న మాటలవి. గృహ నిర్భందంలో ఉన్న ఆమె బుధవారం విడుదలయ్యారు.

"నేను ఇప్పుడు విడుదలయ్యాను. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ధైర్యవంతులకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి దక్కిన ఫలితమిది. ఇక దేశాన్ని సంపన్న దేశంగా సంస్కరించాల్సిన అవసరం ఉంది’’ అని జియా పేర్కొన్నారు.

"యువతే దేశ భవిష్యత్తు. వారి కలల సాకారానికి ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌ నిర్మించాలి. దాని కోసం వారు తమ రక్తాన్ని చిందించారు. కోపం.. ప్రతీకారంతో కాదు.. ప్రేమ, శాంతితో దేశాన్ని పునర్నిర్మించుకుందాం."అన్నారు.

అక్రమాస్తుల కేసులో జియాకు జైలు శిక్ష ..

2018లో అక్రమాస్తుల కేసులో జియాకు 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది షేక్ హసీనా సర్కారు. జియా రెండేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించారు. మార్చి 25, 2020న హసీనా ప్రభుత్వం ఆమె శిక్షను సస్పెండ్ చేసింది. ఆరోగ్యం క్షీణించడంతో మానవతా కారణాలతో మార్చి 2020 నుంచి ఆమెను గృహనిర్బంధంలో ఉంచారు.

షేక్ హసీనా సోమవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయింది. ఈ నేపథ్యంలో మంగళవారం బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ జియాకు గృహనిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. 79 సంవత్సరాల జియా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది.

Read More
Next Story