నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్ట్
x
కేపీ శర్మ ఓలి

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి అరెస్ట్

జెన్ జీ ఉద్యమం అణచివేతపై కేసులు


Click the Play button to hear this message in audio format

గత నేపాల్ ను కుదిపేసిన జెన్ జెడ్ (Gen Z) ఉద్యమంపై మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలిని అక్కడి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. నిరసనలపై విచారణ కమిషన్ నివేదికను బాలేంద్ర షా నేతృత్వంలోని నూతన ప్రభుత్వం అమలు చేసిన ఒక రోజు తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

సీపీఎన్-యూఎంఎల్ ఛైర్మన్ కూడా అయిన ఓలీని, ఖాట్మండ్ కు తూర్పున 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న భక్తపూర్ జిల్లాలోని గుండు ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మాజీ హోం మంత్రి, నేపాలీ కాంగ్రెస్ నాయకుడు రమేష్ లేఖక్‌ను కూడా భక్తపూర్ జిల్లాలోని సూర్యవినాయక్ మున్సిపాలిటీలోని కటుంజేలో ఉన్న ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ 8, 9 తేదీలలో జరిగిన జెన్ జెడ్ ఉద్యమాన్ని అణచివేయడంలో ప్రమేయం ఉన్నారనే ఆరోపణలపై ఓలీ, లేఖక్ ఇద్దరినీ అరెస్టు చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
ఈ ఘటనలో దాదాపు రెండు డజన్ల మంది యువకులతో సహా 76 మంది మరణించారు. జెన్ జెడ్ ఉద్యమం చుట్టూ జరిగిన ఘటనపై విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్, ఓలీ, లేఖక్‌లతో పాటు ఇతరులపై క్రిమినల్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. బాలేంద్ర షా నేతృత్వంలోని నేపాల్ నూతన ప్రభుత్వం, శుక్రవారం జరిగిన తన తొలి కేబినెట్ సమావేశంలో, విచారణ కమిషన్ చేసిన సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ అరెస్ట్ లపై ప్రస్తుత హోంమంత్రి స్పందించారు. "చట్టానికి ఎవరూ అతీతులు కారు" అని సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. "మేము మాజీ ప్రధాని కేపీ ఓలీ, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌లను అదుపులోకి తీసుకున్నాము. ఇది ఎవరిపైనా ప్రతీకారం కాదు, కేవలం న్యాయానికి నాంది మాత్రమే" అని ఆయన అన్నారు. "ఇప్పుడు దేశం ఒక కొత్త దిశగా ప్రయాణిస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆయన ట్వీట్ చేశారు.
ఓలీ, లేఖక్ ఇద్దరినీ భద్రకాళిలోని ఖాట్మండ్ జిల్లా పోలీస్ సర్కిల్‌లో నిర్బంధంలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని విచారణ కమిషన్ సిఫార్సు చేసింది. శనివారం సెలవు కావడంతో, వారిని ఆదివారం ఖాట్మండ్ జిల్లా కోర్టులో హాజరుపరుస్తారని జిల్లా పోలీస్ సర్కిల్‌లోని ఒక సీనియర్ పోలీస్ అధికారి పీటీఐకి తెలిపారు.
అరెస్ట్ చేసిన తరువాత కేపీ ఓలీని వైద్య పరీక్షల కోసం త్రిభువన్ యూనివర్శిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇది చట్టపరమైన దర్యాప్తు ప్రక్రియలో భాగమని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ పరిస్థితిపై చర్చించేందుకు సీపీఎన్-యూఎంఎల్ లలిత్‌పూర్‌లోని తమ కేంద్ర కార్యాలయంలో పార్టీ సచివాలయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Read More
Next Story