యూరోప్ లో రామ్ లల్లా ప్రతిష్టాపన ఉత్సవాలు...
x

యూరోప్ లో రామ్ లల్లా ప్రతిష్టాపన ఉత్సవాలు...

జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమాన్ని దేశమంతా పెద్ద పండగలా జరుపుకుంది. మరీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరప్ లో ఎలా జరిగింది..


-కొవ్వూరు గణపతి రెడ్డి , గోథెన్ బర్గ్ (స్వీడెన్) నుంచి


జనవరి 22న అయోధ్య రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రతి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతే కాదు, భారత్ నుంచి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరప్ లో కూడా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన ను అక్కడి హిందువులుగా పండగగా జరుపుకున్నారు. మైనస్ డిగ్రీల చలిలో రామభజనలు, కీర్తనలు, ప్రత్యేక పూజలు చేస్తూ తాము కూడా అయోధ్యలోనే ఉన్నట్లు ఉత్సవం జరుపుకున్నారు. అక్కడి సామాజిక మాధ్యమాలన్నీ రామ నామంతో తడిసి పారవశ్యం పొందాయి. ఆ తేదీన స్వీడెన్ లోని గోథెన్ బర్గ్ హిందూ ఆలయంలో ఘనంగా వేడుక జరిగింది. సుమారు నాలుగు వందల మంది హిందువులు అక్కడ చేసి రామ్ లల్లా అయోధ్యో త్సవాన్ని జరుపుకున్నారు.

జైశ్రీరాం తెలుగు కండువా

చిత్రమేమిటంటే ఈ వేడుకలో తెలుగు లో రాసిన జైశ్రీరాం కండువా కనిపించడం. స్వీడెన్ లో తెలుగు కండువా ఏమిటి?

తెలుగు కండువా ధరించిన అన్మోల్ మెహతా విద్యార్థి. గోథెన్ బర్గ్ విశ్వవిద్యాలయంలో ఎమ్మె్స్సీ చదువుతున్నాడు. ఆలయ కార్యక్రమాల్లో చరుకుగా పాల్లొంటాడు. ఆయన తెలుగు రాదు. తాను ధరించింది తెలుగులో జైశ్రీరాం అని రాసిన కండువా అని మాత్రం తెలుసు. " గోథెన్ బర్గ్ లో చాల ామంది తెలుగు వారు ఉన్నారు. వాళ్లు చాలా తెలుగు కండువాలను పంచారు. నాకు ఒకటి ఇచ్చాాారు," అని అన్ మోల్ చెప్పాడు.

స్వీడెన్ లో తెలుగు వాళ్లు చాలా మందే ఉన్నారు. చదువుకుంటున్నవాళ్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, ఆటోమొబైల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నవాళ్లు ఉన్నారు. స్వీడెన్ లో రెండో పెద్ద పట్టణమయిన గోధెన్ బర్గ్ లో కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాళ్లంతా తెలుగు పండగలపుడు కలుస్తుంటారు.



తెలుగు వాళ్లు బహూకరించిన జైశ్రీరాం కండువా కప్పుకున్న అన్మోల్ మెహతా, గోథెన్ బర్గ్




అది సరే మళ్లీ అయోధ్య విషయానికి వస్తే...


గోథన్ బర్గలో గోటా నది ఒడ్డున నిర్మించిన రెండుస్థుల హిందూ ఆలయం


సాధారణంగా యూరప్ లోని చాలా దేశాలలో వారి స్థానిక భాషలను మాత్రమే ప్రోత్సహిస్తారు. ఇంగ్లీష్ ను అంతగా పట్టించుకోరు. అందుకే భారతీయుల గమ్యస్థానం యూరప్ కాదు. అందులో ఉత్తర ధృవాలకు దగ్గరగా ఉన్న నార్డిక్ దేశాల్లో( నార్వే, స్వీడన్, డెన్మార్క్ ఫిన్లాండ్) భారత ఉపఖండ దేశాల నుంచి వెళ్లిన వాళ్లు చాలా తక్కువగా కనిపిస్తారు. అందుకే అక్కడక్కడ మాత్రమే హిందూ దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. వాటిలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఉన్నవే ఎక్కువ.

సాధారణ రోజుల్లో మాత్రం అక్కడి దేవాలయాల్లో హనుమాన్ చాలీసా పారాయణ, రామాయణ కావ్యం పఠనం జరుగుతాయి. కానీ జనవరి 22న జరిగిన బాల రాముడి ప్రతిష్ట సందర్భంగా యూరప్ లో ఉన్న హిందూ దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. స్వీడన్‌లోని హిందూ దేవాలయంలో పనిచేస్తున్న హరిద్వార్‌కు చెందిన హిమాన్షు శర్మ మాట్లాడుతూ.. పవిత్రమైన అక్షింతలు అయోధ్య వచ్చాయని చెప్పగానే భక్తులు ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా ఆలయానికి చేరుకున్నారని చెప్పారు. భజనలు, కీర్తనలు చేసి తమ భక్తిని ప్రకటించుకున్నారని వివరించారు.


ఆలయ నిర్మాణానికి కారణమయిన రవీందర్ రాజ్ (నల్ల జంపర్ ), అరుణ్ శర్మ (కుర్తా)లను ఈ ఫోటోల చూడవచ్చు.


స్వీడన్ లో హిందూ దేవాలయ స్థాపకులలో ఒకరైన రవీందర్ రాజ్ మాట్లాడుతూ" జనవరి 22 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు శుభదినం. వందల సంవత్సరాలుగా హిందూ సమాజం ఏం కోరుకుందో అదే నేడు నెరవేరింది. హిందువులు ఎప్పుడు వారి సంతోషాలను తమ కుటుంబం లేదా తమ వరకే పరిమితం చేసుకునే వారు. కానీ తొలిసారిగా ఆ ఆనందం అందరితో కలిసి పంచుకున్నారు. ప్రపంచంలో ఉన్న ఏ సమాజంలో నైనా హిందూవులు చాలా సులభంగా కలిసిపోతారు. ఎక్కడైన మనం జీవించగలం. ఈ ఆలయం ప్రారంభం సందర్భంగా కూడా ఎవరిని నిందించడం చేయలేదు. ఇది హిందువుల విశ్వాసాలకు సంబంధించింది" అని ఆయన అభిప్రాయపడ్డారు.రవీందర్ రాజ్ ఇక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు.


స్వీడన్ లోని దేవాలయానికి రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా దాదాపు వందమంది భక్తలు వస్తారని ఏర్పాట్లు చేస్తే ఆ రోజు ఏకంగా నాలుగువందల మంది భక్తులు దేవాలయాన్ని సందర్శించారు.



సనాతన ధర్మంగా భావించే హిందూ సంస్కృతిలో ఒకప్పుడు దేవాలయాలు బాంకులుగా, విద్య బోధన, వైద్యశాలలు, నృత్యం, సంగీతం, యోగా వంటి వాటికి కేంద్రంగా భాసిల్లాయి. తద్వారా సామాజిక పురోగతికి రథ చక్రాల్లా పనిచేసేవి. అందుకే అయోధ్యలో జరిగింది కేవలం రాముడి ప్రతిష్టాపన కాదు.. మన సంస్కృతికి తిరిగి ప్రాణం పోయడం లాంటిదని, దేవాలయాలకు రాజకీయాలకు సంబంధంలేదని రవీందర్ రాజ్ అంటున్నారు. ఇదీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు.

సోమవారం పని దినం అయినప్పటికీ రామ్ లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ఎంతమంది ప్రజలు వచ్చారు. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారని చెప్పారు.


ఐరోపాలో ఎక్కువ మంది హిందువులు..

ఐరోపాలో దాదాపు ఇరవై లక్షల మంది హిందువులు జీవిస్తున్నారని నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ లెటర్స్ సభ్యుడు, బెర్గెన్ విశ్వ విద్యాలయంలో ఫ్రొపెసర్ అయిన జాకబ్ సన్ అంటున్నారు. వారిలో ఎక్కువ మంది యూకేలో జీవిస్తున్నారని అంచనా వేశారు. తరువాత నెదర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీలో రెండు లక్షల చొప్పున, జర్మనీ 1,30,000, స్విట్జర్లాండ్ లో 50,000 నార్డిక్ దేశాలలో 83000, స్పెయిన్ లో 33000, బెల్జియంలో 10000, ఆస్ట్రియాలో 5 వేల వరకు మంది నివసిస్తున్నారని చెప్పారు. వీరంతా గుజరాత్, శ్రీలంకలోని తమిళ హిందువులని ఆయన చెబుతున్నారు. 21 శతాబ్దంలో యూరప్ కు వచ్చిన వారంతా కూడా పరిశోధన, ఐటీ వంటి నైపుణ్య రంగాలకు చెందిన వారని వివరించారు.

Read More
Next Story