ఇజ్రాయెల్‌లో హంగ్‌ పార్లమెంట్‌.. నెతన్యాహుకు గట్టి పోటీ!
x

ఇజ్రాయెల్‌లో హంగ్‌ పార్లమెంట్‌.. నెతన్యాహుకు గట్టి పోటీ!

అరబ్ పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం


Click the Play button to hear this message in audio format

ఇజ్రాయెల్‌ పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ దక్కకపోవడంతో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు నేతృత్వంలోని కూటమికి, ఆయనను గద్దె దించాలనుకుంటున్న ప్రతిపక్ష కూటమికి అవసరమైన 61 స్థానాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో అరబ్‌ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనపై ప్రతిపక్ష నేతలు చర్చలు జరుపుతున్నారు.

మొత్తం 120 స్థానాలున్న ఇజ్రాయెల్‌ పార్లమెంటులో ఇప్పటివరకు లెక్కించిన ఓట్ల ప్రకారం.. నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీకి 20.8 శాతం, గడి ఐసెన్‌కాట్‌ నేతృత్వంలోని యషార్‌ పార్టీకి 16.1 శాతం ఓట్లు వచ్చాయి. నెతన్యాహు కూటమికి 53 స్థానాలు, ప్రతిపక్ష కూటమికి 48 స్థానాలు, అరబ్‌ పార్టీలకు 19 స్థానాలు వస్తాయని అంచనాలు వెలువడ్డాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో అరబ్‌ పార్టీల మద్దతు కీలకంగా మారింది.
అయితే, అరబ్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపక్ష ఆలోచనను నెతన్యాహు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి ప్రభుత్వం ఏర్పడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. మరోవైపు, నెతన్యాహుకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష నేత ఐసెన్‌కాట్‌ మాత్రం కొన్ని షరతులతో అరబ్‌ పార్టీలతో కలిసి పనిచేసే అవకాశాన్ని తోసిపుచ్చలేదు. ఇజ్రాయెల్‌ను యూదుల దేశంగా, హమాస్‌ను తీవ్రవాద సంస్థగా గుర్తించడం వంటి షరతులను ఆయన ముందుకు తెచ్చారు.
ఈ ఎన్నికల్లో దాదాపు 78 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1999 తర్వాత ఇదే అత్యధిక పోలింగ్‌గా నమోదైంది. నెతన్యాహు కూటమి బలం తగ్గినప్పటికీ, ఆయన పార్టీనే అతిపెద్ద పార్టీగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైనిక సేవ నుంచి అల్ట్రా ఆర్థడాక్స్‌ యూదులకు మినహాయింపులు ఇవ్వడం, నెతన్యాహు ప్రభుత్వంలోని అతివాద పార్టీలతో పొత్తు వంటి అంశాలు ఓటర్లలో అసంతృప్తికి కారణమయ్యాయి.
మరోవైపు, అరబ్‌ పార్టీలకు పెరిగిన మద్దతు ఇజ్రాయెల్‌ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. అయితే, ప్రతిపక్షంలోని కొన్ని పార్టీలు అరబ్‌ పార్టీలతో పొత్తుకు సిద్ధంగా లేకపోవడం ఐసెన్‌కాట్‌కు సవాలుగా మారింది. ఏ కూటమికీ మెజారిటీ రాకపోతే మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
ప్రస్తుతం గైర్హాజరు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తుది ఫలితాల అనంతరం అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో ఇజ్రాయెల్‌లో తదుపరి ప్రభుత్వం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది, అరబ్‌ పార్టీల మద్దతు ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఓట్ల లెక్కింపు గురువారం సాయంత్రం వరకూ కొనసాగుతుందని కేంద్ర ఎన్నికల కమిటీ మేనేజర్ ఎలాడ్ నావే తెలిపారు. సైనిక సిబ్బంది, దౌత్యవేత్తల నుంచి వచ్చిన సుమారు ఐదు లక్షల ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఇజ్రాయెల్ చట్టాల ప్రకారం నవంబర్ నాలుగులోగా అధికారిక ఫలితాలను ధృవీకరించుకోవాల్సి వచ్చింది.
ఇజ్రాయెలీలు యుద్ధం పట్ల విముఖతను ప్రదర్శించారు. లికుడ్ పార్టీకి గత ఎన్నికల్లో 23.4 శాతం రాగా ప్రస్తుతం అది కాస్త తగ్గింది. కానీ 2023 అక్టోబర్ 7న హమాస్ నేతృత్వంలో దాడి వల్ల కలిగిన దు:ఖాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో ప్రత్యర్థులు విఫలం అయ్యారు. కానీ ఇప్పటికీ లికుడ్ పార్టీనే దేశంలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది.

అరబ్ పార్టీల భాగస్వామ్యం..

పార్లమెంట్ లో ఏ పార్టీకి మెజారిటీ రానందున 14.9 శాతం సాధించిన అరబ్ పార్టీల భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఊహగానాలు జోరుగా సాగుతున్నాయి. ఎవరూ ముందుకు రాకపోతే ఏడాది ప్రారంభంలో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో విఫలం అయినందునే 2019 నుంచి 2022 మధ్యకాలంలో ఇజ్రాయెలో ఏకంగా ఐదుసార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి.

అరబ్ లు ఏంటీ...

1948 లో ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత ఉండిపోయిన పాలస్తీనియన్ల వారసులే ఆ దేశ అరబ్ పౌరులు. పాలస్తీనియన్ల ఆశయానికి వారు సంఘీభావం తెలిపారు. వీరిని అక్కడ యూదులు ఇంకా అనుమానపు దృష్టితో చూస్తారు. అక్టోబర్ 7 నాటి దాడిలో అరబ్ పౌరులు కూడా ఉన్నారు.
2021 లో అప్పటి ప్రభుత్వంలో అరబ్ పార్టీ యునైటెడ్ అరబ్ లిస్ట్ ప్రధాన కార్యాలయంలో రాత్రంతా ఆనందకరమైన వాతావరణం నెలకొంది. కొంతమంది ఇజ్రాయెలీలకు అది అసౌకర్యంగా కాకపోయిన ఒక అసాధారణమైన విషయంగా కనిపించింది.
Read More
Next Story