
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోక పోయినా గ్రీన్ ల్యాండ్ ను లాగేస్తా: ట్రంప్
అమెరికా పక్కన రష్యా, చైనా ఉండటానికి వీల్లేదన్నా యూఎస్ అధ్యక్షుడు
ప్రపంచంలో ఎవరూ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయిన ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
రష్యా, చైనా ప్రాబల్యం తగ్గించాలంటే ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్న గ్రీన్ ల్యాండ్ తమకు కావాల్సిందే అన్నారు. వాషింగ్టన్ డీసీలో వైట్ హౌజ్ లో ఆయన ఆయిల్ నిర్వాహాకులతో జరిగిన సమావేశంలో మాట్లాడారు.
తాను ఎలాగైన గ్రీన్ ల్యాండ్ ను స్వాధీనం చేసుకుంటానని అన్నారు. ఇది ప్రస్తుతం నాటో కూటమిలో భాగమైన డెన్మార్క్ ఆధీనంలో ఉంది. ఇక్కడ 57 వేల మంది నివసిస్తున్నారు. ఈ ద్వీపానికి సెమీ అటానమస్ హోదా ఉంది.
ట్రంప్ ఏమన్నారు..
‘‘గ్రీన్ ల్యాండ్ వారికి నచ్చినా.. నచ్చకపోయినా మేము దానిపై ఏదో ఒకటి చేయబోతున్నాం. ఎందుకంటే మనం అలా చేయకపోతే రష్యా, చైనాలు గ్రీన్ లాండ్ ను స్వాధీనం చేసుకుంటాయి. మనకు రష్యా, చైనాలు పొరుగువారిగా ఉండరాదు’’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు.
‘‘మేము రష్యా, చైనాకు గ్రీన్ లాండ్ వెళ్లాలని కోరుకోవడం లేదు. అంటే గ్రీన్ లాండ్ ను మేము తీసుకోకపోతే రష్యా, చైనా లు మన పక్కింటి పెరడులో ఉంటాయి. అది జరగదు’’ అని ట్రంప్ పేర్కొన్నారు.
తాను సులభమైన మార్గంలో అలా చేయాలనుకుంటున్నానని, కానీ అలా కుదరని పక్షంలో కఠిన మార్గం ఎంచుకుంటామని ఆయన తనదైన శైలిలో హెచ్చరించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యన్, చైనా నౌకల నుంచి ముప్పు ఉందని, అమెరికా భద్రతకు హమీ ఇవ్వడానికి గ్రీన్ ల్యాండ్ పై తమకు నియంత్రణ అవసరమని ట్రంప్ మొండిగా వాదిస్తున్నారు.
అధికారుల సమావేశం..
డెన్మార్క్, గ్రీన్ ల్యాండ్, యూఎస్ అధికారులు గురువారం వాషింగ్టన్ లో సమావేశం అయ్యారు. ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి సైనిక ప్రయోగం సహ అనేక ఛాయిస్ లను పరిశీలిస్తున్నామని వైట్ హౌజ్ పేర్కొంది.
ఈ అధికారుల మధ్య వచ్చే వారం మరోసారి సమావేశం జరగనుంది. యూఎస్ అధ్యక్షుడు గురువారం న్యూయార్క్ టైమ్స్ తో మాట్లాడుతూ.. గ్రీన్ ల్యాండ్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నానని, ఎందుకంటే వారు పొందలేని అనేక అంశాలను ఒక పత్రంపై సంతకం చేయడం ద్వారా అమెరికా అందిస్తుందని అన్నారు.
డెన్మార్క్ ప్రధాని హెచ్చరిక
గ్రీన్ ల్యాండ్ ను అమెరికా బలవంతంగా స్వాధీనం చేసుకుంటే అది నాటో ముగింపుకు దారీ తీస్తుందని డానిష్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడరిక్ సన్ హెచ్చరించారు. గ్రీన్ ల్యాండ్ వాసులు అమెరికాలో భాగం కావడానికి ఇష్టపడటం లేదని అన్నారు.
‘‘యూఎస్ మరోక నాటో దేశంపై దాడి చేయాలని అనుకుంటే అది అప్పుడే అంతం అవుతుంది’’ అని ఆమె అన్నారు. గ్రీన్ ల్యాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం అయినప్పటికీ అక్కడ కేవలం 57 వేలమంది మాత్రమే నివసిస్తున్నారు. దానికి స్వంత సైన్యం లేదు. డెన్మార్క్ దాని రక్షణ, విదేశీ వ్యవహరాలు చూస్తుంది. అమెరికాకు ఇప్పటికే అక్కడ ఓ సైనిక బేస్ ఉంది.
Next Story

