
పాక్ సైనికాధిపతి అసిమ్ మునీర్
‘‘మగాడివైతే, తల్లిపాలు తాగితే యుద్ధభూమికి రా’’
పాకిస్తాన్ సైన్యాధిపతికి టీటీపీ సవాల్
పాకిస్తాన్ సైనికాధిపతి, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ కు తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఛాలెంజ్ విసిరింది. ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాకు పాక్ సైన్యాన్ని పంపవద్దని హెచ్చరికలు జారీ చేసింది.
ఈ మధ్య పాక్ జనరల్ ఓ వేడుకలో మాట్లాడుతూ భారత్ తో పాటు తాలిబన్లను బెదిరించారు. తమతో పెట్టుకుంటే తమ సత్తా చూపిస్తామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. తమది అణ్వాయుధ దేశమని మరోసారి చెప్పుకున్నారు.
టీటీపీకి చెందిన అగ్రశ్రేణి కమాండర్ అసిమ్ మునీర్ ను బెదిరిస్తూ వీడియోను విడుదల చేసింది. ఇందులో పాక్ సైనికులు ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలోకి అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. యుద్ధ భూమి నుంచి పారిపోని ఉన్నతాధికారులను పంపాలని కూడా వ్యంగ్యస్త్రాలు విసిరారు.
అక్టోబర్ 8న ఆప్ఘనిస్తాన్ సరిహద్దులో టీటీపీ జరిపిన దాడి దృశ్యాలను కూడా టీటీపీ విడుదల చేసింది. ఈ దాడిలో 22 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. ఇందులో పాకిస్తాన్ సైన్యానికి చెందిన ఆయుధాలు, సామాగ్రి ని టీటీపీ స్వాధీనం చేసుకున్నట్లు కూడా వీడియోలలో కనిపించింది. టీటీపీ జరిపిన దాడిలో కేవలం 11 మంది సైనికులు మరణించారని పాకిస్తాన్ అధికారులు తెలిపారు. ఇందులో ఒక మేజర్, ఒక లెప్టినెంట్ కల్నల్ ఉన్నారు.
తల్లిపాలు తాగితే యుద్ధభూమికి రా..
ఒక క్లిప్ లో టీటీపీ సీనియర్ నాయకుడు కాజిమ్ మాట్లాడుతూ.. ‘‘ నువ్వు మగాడివైతే మమ్మల్ని ఎదుర్కో’’ అని చెబుతున్నట్లు ఉంది. అదే క్లిప్ లో ‘‘నువ్వు తల్లి పాలు తాగితే మాతో పోరాడు’’ అని కూడా తీవ్ర హెచ్చరికలు చేశారు. అక్టోబర్ 8 న పాక్ సైన్యం పై జరిగిన దాడిలో కాజిమ్ దే కీలకపాత్ర. ఈ ఉగ్రవాద కమాండర్ పై పాక్ పది కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించింది. కాజిమ్ ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలోని కుర్రం జిల్లాకు చెందినవాడు.
పాక్- తాలిబన్ ఘర్షణలు..
పాక్ సైన్యంపై దాడులకు ప్రతీకారంగా ఆ దేశ వైమానిక దళం తాలిబన్లపై దాడులు చేసింది. దీనితో పదుల సంఖ్యలో ఆప్ఘన్లు మరణించారు. టీటీపీకి ఆప్ఘన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ వాదిస్తోంది.
కొన్ని రోజుల తీవ్ర ఘర్షణ తరువాత ఖతార్, టర్కీ దేశాల మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం ఆప్ఘన్లు సాయుధ గ్రూపులను అరికట్టడంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను తాలిబన్ల ప్రభుత్వం ఖండించింది.
ఎప్పటిలాగే భారత్ పై ఏడుపు..
పాక్ ప్రస్తుతం అంతర్గత సంక్షోభాలను ఎదుర్కోంటోంది. టీటీపీ ఖైబర్ ఫంక్తూన్ ఖ్వాలో పాక్ సైన్యం తీవ్రాతితీవ్రంగా దాడులు చేస్తోంది. మరో వైపు బలూచ్ వీరులు కూడా పాక్ కు నిద్రలేని రాత్రులు మిగిలితెస్తున్నారు. ఇన్ని సంక్షోభాలు ఉన్నప్పటికీ పాక్ సైనిక జనరల్ మాత్రం భారత్ ను బెదిరించే ప్రయత్నం చేశారు.
అక్టోబర్ 18 న అబోటాబాద్ లోని ( లాడెన్ ను అమెరికా నేవీ సీల్స్ హతమార్చిన పట్టణం) పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో మాట్లాడుతూ.. పాక్ ను ఎవరైన లక్ష్యంగా చేసుకుంటే పాకిస్తాన్ బలమైన ప్రతిస్పందన చేస్తుందని హెచ్చరించారు. భారత్, తాలిబన్లపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని ప్రొత్సహించడానికి ఆప్ఘనిస్తాన్ భూభాగాన్ని ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.
Next Story