‘బ్యాట్’ లేకుండానే సెంచరీ చేసిన ఇమ్రాన్ ఖాన్, అయితే..
x

‘బ్యాట్’ లేకుండానే సెంచరీ చేసిన ఇమ్రాన్ ఖాన్, అయితే..

పాకిస్తాన్ లో ఎన్నికల రాజకీయాలు పోయి, పదవీ పంపకాలు మొదలయ్యాయి. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎలా చేస్తారు ఇదే అక్కడ క్వశ్చన్ మార్క్.


ఎన్ని పార్టీలు కలిసి ముఠాలుగా ఏర్పడుతాయనేది, ఎవరు ప్రధాని పీఠం అధిష్టిస్తారనేది పాక్ లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మరోవైపు మాజీ ప్రధాని ఇమ్రాన్ పార్టీ పీటీఐ నీడను సైతం ఇక సైన్యం ఆదేశ రాజకీయాల్లోకి అనుమంతించదు. గత ఏడాది ఆగష్టు నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులోనే ఉన్నాడు. అతడి పై దాదాపు 150 దాకా కేసులు నమోదు అయ్యాయి. అయినప్పటికీ అతను బలపరిచిన అభ్యర్థులు దాదాపు 97 స్థానాల్లో గెలుపొందారు. అయినప్పటికీ కూడా వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు. వీరికి సైన్యం నుంచి ఎటువంటి సహకారం అందదు. ఇది పాక్ లో సర్వసాధారణ విషయం.

పాకిస్తాన్ ఎన్నికల సంఘం ఆదివారం 264 ఎంపీ స్థానాల్లో ఫలితాలు వెల్లడించింది. దీనిలో పీటీఐ గుర్తు ను నిషేధించినప్పటికీ ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సైన్యాన్ని ఎదురించి మరీ విజయబావుటా ఎగరవేశారు. 2022 ఏప్రిల్ లొ ఇమ్రాన్ ఖాన్ అధికారం నుంచి దిగిపోయారు.

అయినప్పటికీ ఆయనకు ప్రజాదరణ ఉంది అని మరోసారి రుజువయింది. అయితే చాలా ప్రాంతాల్లో పీటీఐ కార్యకర్తలు దౌర్జన్యాలకు దిగారనే పాక్ ఎన్నికల సంఘం అక్కడ రీ పోలింగ్ నిర్వహించింది. అయితే మిగిలిన పార్టీల కార్యకర్తలు చేయకుండా కేవలం ఇమ్రాన్ ఖాన్ పార్టీ మాత్రమే ఇలా చేసిందా. దీనివెనక ఎవరి ప్రమేయం ఉంది. దీని కోసం బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు.

బిగుసుకుంటున్న సంకెళ్లు

సైన్యానికి ఎదురుతిరిగిన ఏ నేత కూడా పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకోలేదని అక్కడి చరిత్ర చూస్తే తెలుస్తోంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. అతడి పై దేశద్రోహం సహ తను చేసుకున్నపెళ్లి కూడా చెల్లదని అక్కడ కేసులు నమోదు అయ్యాయి. చాలా వాటిల్లో శిక్షలు కూడా పడ్డాయి. ఫిబ్రవరి 8 న జరిగిన ఎన్నికలకు ముందే చాలా వాటిల్లో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు. మిలిటరీ అధికారులకు జడుసుకుని చాలా మంది నాయకులు పీటీఐను విడిచిపెట్టి వెళ్లిపోయారు. పీటీఐలో నే ఉన్న, ఉంటామని చెప్పిన అనేకమంది నాయకులను సైన్యం జైలులో తోసింది.

నవాజ్ షరీఫ్ అరంగ్రేటం

పాకిస్తాన్ ఎప్పుడు ఎవరు పీఠం ఎక్కాలన్నా వెనకనుంచి సైన్యం మద్ధతు ఉండాల్సిందే. ఇప్పుడు పాకిస్తాన్ ఘోరమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీనిని బయటపడేసే సత్తా ఉన్న నేత కోసం సైన్యం అన్వేషించగా పాక్ కు మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన నవాజ్ షరీఫ్ కనిపించాడు.

ఇంతకుముందే అవినీతి ఆరోపణలపై ఆయనపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అక్కడి కోర్టులు నిషేధం విధించాయి. పైగా ఆయన ప్రవాసంలో ఉన్నారు. అయిన సైన్యం ఇవేవీ పట్టించుకోకుండా తిరిగి ఆయనను ఇస్లామాబాద్ కు రప్పించింది. ఆయన ఆధ్వర్యంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్( నవాజ్) 76 స్థానాల్లో గెలుపొందింది. అక్కడ మెజారిటీ స్థానాలు పొందిన అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇమ్రాన్ పార్టీ పై నిషేధం ఉండడం, పోటీ చేసిన వారంతా స్వతంత్రులు కావడంతో ఇది సాధ్యమైంది.

ప్రచారానికి కూడా అనుమతించని సైన్యం

పీటీఐని పోటీ చేయకుండా నిషేధించిన సైన్యం, ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సైతం ప్రచారానికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంది. పాకిస్తాన్ లో ఉన్న మిగిలిన రెండు పార్టీలైన పీఎంఎల్, పీపీపీ తో పోల్చితే పీటీఐ నాయకులు తక్కువ ఖర్చు, ప్రచారంతో 97 స్థానాలు గెలుచుకున్నారు. నిజానికి వారు 107 స్థానాలు దాకా గెలుచుకున్నారు. కానీ రాత్రికి రాత్రి లెక్క మారిపోయింది. అయితే కొన్ని సంస్థలు 93 మాత్రమే అని నివేదికలు ఇచ్చాయి.

18 స్థానాల్లో తుది ఫలితాలు మార్చారని పీటీఐ నాయకులు ఆరోపిస్తున్నారు. లేకుంటే మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసేవాళ్లమని ప్రకటించారు. సింధ్ పార్టీ అయిన పీపీపీ మాత్రం అక్కడ ఉన్న వాటిలో మెజారిటీ వాటా అంటే 54 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. మిగిలిన 37 స్థానాల్లో స్వతంత్రులు, చిన్న చిన్న పార్టీలు గెలుపొందాయి. ఈ ఫలితాలు నిజంగా నవాజ్ షరీఫ్ ఇబ్బంది కలిగించేవే. ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిందే.

సైన్యం వెనక నుంచి మద్దతు తెస్తుంది

పాకిస్తాన్ పాలించడానికి ఇప్పుడు అక్కడున్న రెండు పార్టీలను ఏకం చేయడానికి సైన్యం తెరవెనక ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశంలో బలమైన కూటమిగా ముద్ర పడ్డ సైన్యం, ఐఎస్ఐ పీఎంఎల్, పీపీపీ నాయకులతో సమావేశం అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించే ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు కొన్ని చిన్న పార్టీలు సైతం ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది. మరోవైపు పీటీఐ బలపరిచిన స్వతంత్రులు కూడా పార్టీల్లోకి వెళ్లే అవకాశం ఉంది.

మతతత్వ పార్టీలకు శిక్ష వేసిన పాక్ ప్రజలు

సైన్యం నీడలో అనేక దారుణాలు చేస్తున్న ఇస్లామిక్ అతివాద పార్టీలకు పాకిస్తాన్ ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారు. జమియత్ ఏ ఉలేమా ఏ ఇస్లాం కేవలం మూడు సీట్లకే పరిమితం అయింది. మరికొన్ని అసలు ఖాతానే తెరవలేదు. అయితే పాక్ లో ఏ ప్రభుత్వం కూడా పూర్తి కాలం దేశాన్ని పాలించలేదు. ఒక్క ప్రధాని కూడా కనీసం ఐదు సంవత్సరాలు ఆ పదవిలో లేడు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది కావచ్చు. అయితే ఇమ్రాన్ అనే దెయ్యం పాక్ సైన్యాన్ని వెంటాడుతునే ఉంటుంది. జైలు గోడల మధ్య నుంచి కూడా.

Read More
Next Story