‘నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేసింది’
x
పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్

‘నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేసింది’

పాక్ ఉప ప్రధాని వ్యాఖ్య.. తాము దాడులను తిప్పికొట్టామని, మధ్యవర్తిత్వం కోరలేదని వ్యాఖ్యలు..


తెలుగు రాష్ట్రాలలో పిట్టల దొరలని చూస్తూ ఉంటాం. వారు మాటలతో ఆకాశానికి నిచ్చెన వేసినట్లు చెబుతుంటారు. అలాగే ప్రపంచానికి ఓ పిట్టల దొర దేశం ఉంది. అదే మన దాయాదీ పాకిస్తాన్. నిజం ఒప్పుకోకపోవడం, కిందపడ్డ తానే గెలిచానని సంబరాలు చేసుకోవడం దాని నైజం. భారత్ చేతిలో ఎన్నిసార్లు తన్నులు తిన్నా... ఏమి కాలేదని చెప్పుకోవడం దాని అలవాటు. ఇప్పుడు మరోసారి అవే మాటలు మాట్లాడింది.

పహాల్గాం లో అమాయక టూరిస్టులలో హిందువులను గుర్తించి, వారి భార్యల ముందే భర్తలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హత్య చేసిన తరువాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇన్నాళ్లు యుద్ధంలో తామే గెలిచామని, తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పుకున్న పాక్ పాలకులు ఒక్కొక్క నిజం వారే మెల్లగా బయటపెడుతున్నారు. తాజాగా పాక్ ఉప ప్రధాని, విదేశాంగ వ్యవహరాలు చూసే ఇషాక్ దార్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా రావల్పిండి దగ్గరలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడి చేసిందని అంగీకరించారు. ‘‘36 గంటల్లో కనీసం 80 డ్రోన్లు పంపారు. పాక్ వాటిలో 79 ని కూల్చివేసింది’’ అని దార్ తెలిపారు.
‘‘మే 10 న తెల్లవారుజామున నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత్ దాడి చేసి తప్పు చేసింది. దీని ఫలితంగా పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగింది’’ అని ఇటీవల సంవత్సరాంతపు విలేకరులు సమావేశంలో చెప్పారు.
పాకిస్తాన్ ఏ దేశంతోనే మధ్యవర్తిత్వం ద్వారా సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోమని కోరలేదని అన్నారు. కేవలం అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ మాత్రం మధ్యవర్తిత్వం నెరిపారని దార్ అన్నారు.
రూబియో తనకు 8.17 నిమిషాలకు ఫోన్ చేశారని, భారత్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని చెప్పారని,పాకిస్తాన్ అంగీకరిస్తుందా అని అడిగినట్లు చెప్పారు. ‘‘పాకిస్తాన్ ఎప్పుడూ యుద్ధానికి వెళ్లాలని కోరుకోవడం లేదు’’ అని తాను సమాధానం ఇచ్చినట్లు దార్ చెప్పారు.
భారత్ తో పాకిస్తాన్ తరఫున మాట్లాడానికి సౌదీ విదేశాంగ మంత్రి తమను సంప్రదించారని, తరువాత కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మరోసారి రాఫెల్ పైటర్ జెట్లను కూల్చివేసినట్లు మరోసారి ఆయన ప్రకటించుకున్నారు. దీనికి ఎటువంటి ఆధారాలను మాత్రం వెల్లడించలేదు.
జర్థారీ ప్రకటన..
మే లో జరిగిన ఆపరేషన్ సిందూర్ పై పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్థారీ కూడా స్పందించారు. శనివారం ఒక బహిరంగ సభలో ప్రసంగించిన జర్ధారీ.. దాడులు ప్రారంభమైన తరువాత తరువాత సైనిక కార్యదర్శి తనకు ఫోన్ చేశారని పేర్కొన్నారు.
ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ.. యుద్ధం ప్రారంభమైందని, వెంటనే బంకర్ లోకి వెళ్లమని తనకు సూచించారని చెప్పారు. కానీ దానిని తాను నిరాకరించినట్లు వెల్లడించారు. సంఘర్షణ సమయంలో నాయకులు దాక్కోరని తను సైనిక కార్యదర్శికి చెప్పినట్లు వివరించారు.
భారత వైమానిక దాడుల తరువాత పాకిస్తాన్ అధికార స్థాయిలో తీవ్రమైన అలజడి చెలరేగిందనే సంగతి జర్ధారీ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. యుద్ధం గురించి తనకు నాలుగు రోజుల ముందుగానే తెలుసని కూడా జర్ధారీ వ్యాఖ్యానించారు.
ఇటీవల ఉపగ్రహ చిత్రాలు భారత్ ఆపరేషన్ సిందూర్ సందర్భంగా దెబ్బతిన్న నూర్ ఖాన్ ఎయిర్ బేస్ వైమానిక స్థావరంలో దెబ్బతిన్న పునర్మిణా కార్యకలాపాలు సూచిస్తున్నాయి. ఈ వ్యూహాత్మక కేంద్రం ఇస్లామాబాద్ కు దగ్గరగా ఉంది. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన కీలకమైన ఆస్తులు ఇక్కడ నిర్వహిస్తుంటారు.
Read More
Next Story