సైబర్ భద్రత–చట్ట అమలుపై భారత్, కెనడా సంయుక్త కార్యాచరణ
x

సైబర్ భద్రత–చట్ట అమలుపై భారత్, కెనడా సంయుక్త కార్యాచరణ

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లపై సమాచార భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయం


Click the Play button to hear this message in audio format

భద్రత, చట్ట అమలు, సైబర్ భద్రత, సమాచార భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్-కెనడా కలిసి ఒక జాతీయ పని ప్రణాళిక రూపొందించేందుకు అంగీకరించాయి. రెండు దేశాల మధ్య భద్రతా రంగంలో సహకారాన్ని క్రమబద్ధీకరించడం, ఆచరణాత్మక చర్యలు చేపట్టడం ఈ నిర్ణయ లక్ష్యం.

ఫిబ్రవరి 7న ఒట్టావాలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కెనడా జాతీయ భద్రతా-నిఘా సలహాదారు నథాలీ డ్రౌయిన్ మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ ప్రణాళికపై నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇరు దేశాలు తమ పౌరుల భద్రత కోసం ఇప్పటికే తీసుకుంటున్న చర్యల పురోగతిని సమీక్షించాయి. ఇకపై జాతీయ భద్రత, చట్ట అమలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఉమ్మడి పని ప్రణాళిక మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నాయి.


మాదకద్రవ్యాల నియంత్రణపై దృష్టి..

సమావేశంలో చట్టవిరుద్ధ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై సమాచారాన్ని వెంటనే పంచుకునే విధానం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఫెంటానిల్ వంటి మాదకద్రవ్యాల పూర్వగాములు, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లపై సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని అంగీకరించారు. ఇందుకోసం రెండు దేశాలు భద్రతా-చట్ట అమలు అనుసంధాన అధికారులను నియమించనున్నాయి.


సైబర్ భద్రత, వలసల అంశాలు..

సైబర్ భద్రతా విధానాలు, సైబర్ నేరాలపై సమాచార భాగస్వామ్యాన్ని అధికారికం చేయాలని నిర్ణయించారు. అలాగే మోసాలు, వలసల అమలు వంటి అంశాల్లో దేశీయ చట్టాలు, అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా సహకారం కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.


దౌత్య సంబంధాల సాధారణీకరణకు అడుగు..

2023లో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదం తీవ్రరూపం దాల్చింది. ఆ తర్వాత సంబంధాలు దెబ్బతిన్నాయి. తాజా భద్రతా ప్రణాళికను రెండు దేశాలు సంబంధాల పునరుద్ధరణ దిశలో కీలక అడుగుగా చూస్తున్నాయి.

ఇటీవల కెనడాలో జరిగిన ఎన్నికల తర్వాత కొత్త నాయకత్వం రావడం, ఇరుదేశాలు తిరిగి హైకమిషనర్లను నియమించుకోవడం వంటి పరిణామాలు సంబంధాల మెరుగుదలకు దోహదపడ్డాయి. త్వరలో కెనడా ప్రధాని భారత్ పర్యటనకు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

Read More
Next Story