ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై భారత్ తొందర పడుతోందా?
x

ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పై భారత్ తొందర పడుతోందా?

స్వేచ్చా వాణిజ్య ఒప్పందం.. లేదా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్.. లేదా ఎఫ్ టీ ఏ(FTA) పేరు ఏదైన భారత్- ఇంగ్లండ్ రెండు దేశాల మధ్య నలుగుతున్న ఒప్పందం


దాదాపు నాలుగేళ్లుగా బ్రిటన్- భారత్ మధ్య చర్చలకు కారణమైన అంశం ఎఫ్ టీ ఏ. అప్పట్లో ఒకసారి అన్ని ఓకే అనుకుని ఇక సంతకాలే అనుకున్న సమయంలో సువేల్లా బ్రేవర్మన్ స్టేట్ మెంట్ తో మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు మళ్లీ దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

బ్రిటన్, భారత్ రెండు దేశాలు కూడా సార్వత్రిక ఎన్నికల కోసం సమాయత్తం అవతున్నాయి. ఈ నెల చివరి వారంలో భారత్ లో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. తరువాత బ్రిటన్ లో కూడా ఎన్నికల సమరం ప్రారంభం అవుతుంది. ఈ లోపే ఎఫ్ టీ ఏ (FTA) ను పట్టాలెక్కించాలని నరేంద్ర మోదీ సర్కార్ భావిస్తోందట.

బ్రిటన్ తో దీనిపై సంతకం చేయించి ఎన్నికల్లో ప్రచారాస్త్రం గా వాడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే టెన్ డౌనింగ్ స్ట్రీట్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలోని వాణిజ్య వ్యవహరాలు చూస్తున్న యూకే వాణిజ్య కార్యదర్శి కెమీ బడెనోచ్ పై న్యూఢిల్లీ తీవ్రంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఓ అంతర్జాతీయ పత్రిక పలు వివరాలు ప్రచురించింది.

ఒప్పందం ఎందుకు అంటే..

బ్రిటన్ ప్రజలు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని అనుకుని, బ్రెక్సిట్ కు ఆమోదం తెలిపారు. దీంతో తమకున్న చాలా వ్యాపార అవకాశాలు కోల్పోయారు.వ్యాపారాలు చేయాలంటే యూరోప్ లోని ప్రతీ దేశంతోను విడిగా ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదీ చాలా కాలహరణం చేసే విషయం.. దీంతో అంతే మార్కెట్ ఉన్న భారత్ తో ఒప్పందం చేసుకుంటే లాభం ఉంటుందని అనుకున్న బోరిస్ జాన్సన్ ప్రభుత్వం ఎఫ్ టీ ఏ ను ముందుకు తెచ్చింది. అధికారికంగా ఈ చర్చలు 2022 లో ప్రారంభం అయ్యాయి.

భారత్ షరతులు..

బ్రిటన్ లో తయారైన వస్తువులు భారత్ లో విక్రయించాలంటే విపరీతమైన దిగుమతి సుంకాలు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని వస్తువులు, ఆహార పదార్థాలపై దాదాపు 150 శాతం మేర సుంకాలు ఉన్నాయి. వీటిని తగ్గించడానికి చర్చలు జరుగుతున్నాయి. అయితే భారత్ ఈ ఒప్పందం పై సంతకం చేయాలంటే పలు షరతులు విధించింది.

అందులో మొదట భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు, శ్రామికుల కోసం ప్రతి సంవత్సరం ఇంగ్లండ్ 50 వేల వీసాలు మంజూరు చేస్తోంది. అయితే వీటి సంఖ్య పెంచాలని కోరుకుంటోంది. శ్రామికులకు ఎలాంటి భద్రతా ప్రయోజనాలు అందకున్నా.. జాతీయ బీమా చెల్లించాలని అక్కడి చట్టాలు చెబుతున్నాయి.

దీనివల్ల వాటికి ఎలాంటి సామాజిక భద్రతా వారికి లభించదు. కానీ వారి పిల్లలకు మాత్రం 18 సంవత్సరాల లోపు వారికి ఉచిత విద్య మాత్రం అందించడానికి ఇది తోడ్పాటును అందిస్తోంది. దీనిని మార్చాలని భారత్ కోరుకుంటోంది.

వలసలు తగ్గిస్తాం.. కన్వర్జేటివ్ ప్రతిజ్ఞ

దేశంలోకి చట్టబద్దమైన, అక్రమ వలసలను నిరోధిస్తామని యూకే అధికార, విపక్ష పార్టీలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కన్వర్జేటివ్ పార్టీ ఈ వలసల పై కఠిన వైఖరిని అవలంభిస్తామని ప్రజలకు వాగ్ధానం చేసింది. అందువల్ల భారత్ కు అదనంగా వీసాలు మంజూరు చేసే విషయంలో ఎలా వ్యవహరిస్తుందో తెలియదు.

న్యూఢిల్లీకి అదనంగా వీసాలు మంజూరు చేయడానికి తీవ్రంగా ఒత్తిడి వస్తోందని ఆ మధ్య హోంమంత్రి సుయెల్లా బ్రేవర్మన్ ప్రకటించి, తన పదవిని సైతం పొగొట్టుకుంది. 2021 లో భారత్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులను నిరోధించడానికి ఏర్పాటు చేసుకున్న మైగ్రేషన్ అండ్ మొబిలిటి పార్ట్ నర్ షిప్ కూడా సరిపని చేయట్లేదని బ్రేవర్మన్ పనిలో పనిగా విమర్శించింది.

మరోవైపు భారత్ ఇదే అంశంపై ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. అక్కడి ప్రతిపక్ష నాయకుడు లేబర్ పార్టీ నాయకుడు అయిన షాడో ఫారిన్ తో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ న్యూ ఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రెండు దేశాల మధ్య చర్చలు తిరిగి ప్రారంభం అయినప్పటికీ ఇప్పటికి ఆశించిన పురోగతి సాధించలేదని అంతర్జాతీయ మీడియా చెబుతున్న అంశం. కానీ యూకే మంత్రులు, టోరీలు భారత్ పెడుతున్న డిమాండ్లను అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మరో వైపు ఇంగ్లండ్ అధికారికంగా మాంద్యంలోకి జారుకున్నట్లు నివేదికలు బయటకు వస్తున్నాయి.

అదే జరిగితే ఇప్పటికే తన పాపులారిటీ తగ్గించుకున్న రిషి సునాక్.. ఎన్నికల్లో ఎదురీత ఎదుర్కోవాల్సి వస్తుంది. మరో వైపు భారత్ కూడా మేం సాధించాం అని చెప్పుకోవడానికి ఒక ఒప్పందం కావాలి.. అందుకు ఇదీ ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి.

Read More
Next Story