
భారత్, పాక్ మత్స్యకారుల విడుదలకు రంగం సిద్ధం..
జాబితాను పంచుకున్న ఇరుదేశాలు..
పహెల్గాం(Pahelgam) ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్(India-Pak) దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నా.. తమ స్వాధీనంలో ఖైదీలుగా ఉన్న మత్స్యకారులను, పౌరుల విడుదలకు రంగం సిద్ధమైంది. సముద్ర సరిహద్దుల్లో స్పష్టమైన గుర్తింపులు లేకపోవడం వల్ల అరేబియా సముద్ర ప్రాంతంలో మత్స్యకారులు(Fishermen) అనుకోకుండా పాక్ జలాల్లోకి ప్రవేశించడం తరచుగా జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారిని అరెస్టు చేసి జైలు శిక్ష ఖరారు చేస్తారు. మత్స్యకారుల దీర్ఘకాల జైలు శిక్షలు వారి కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఇరు దేశాలు మానవతా కోణంలో ఆలోచించి ఖైదీల విడుదల ప్రక్రియను తేదీలను ఖరారు చేసుకున్నాయి. ఏటా జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకునే సంప్రదాయం భారత్–పాకిస్థాన్ మధ్య ఉంది.
ఇరుదేశాలు తమ తమ కస్టడీలో ఉన్న ఖైదీల జాబితాలను పరస్పరం దౌత్య మార్గాల్లో మార్పిడి చేసుకున్నాయి. 2008లో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా.. శిక్ష పూర్తి చేసిన ఖైదీలు, మత్స్యకారుల విడుదల జరుగుతోంది. అయితే పౌరసత్వ ధృవీకరణ ఆలస్యం కావడం వల్ల కొందరు ఖైదీలు జైళ్లలో ఎక్కువకాలం ఉండాల్సి వస్తోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సముద్ర సరిహద్దుల వద్ద సాంకేతిక సహాయం, స్పష్టమైన గుర్తింపులు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను మత్స్యకార సంఘాలు తెచ్చాయి.
ఎవరి అదుపులో ఎంతమంది?
381 మంది పాక్ పౌరులు అలాగే 81 పాక్‌కు చెందిన మత్స్యకారులు భారత్ అదుపులో ఉన్నారు. అలాగే పాకిస్తాన్ అదుపులో 49మంది భారత పౌరులు, 217 మంది భారత మత్స్యకారులు ఉన్నట్లు సమాచారం.
2008 ఒప్పందం కీలక ముఖ్యాంశాలు..
ఈ ఒప్పందం ద్వారా అన్యాయంగా జైల్లో ఉన్నవారిని గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. మానవతా విలువలు, అంతర్జాతీయ నైతిక ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశం ఉంది. కాగా
తమ ఖైదీలను త్వరగా విడుదల చేయాలని, వారిపై మానవహక్కుల ఉల్లంఘనలు జరగకుండా చూసుకోవాలని, కన్సులర్ యాక్సెస్ వెంటనే ఇవ్వాలని, న్యాయ సహాయం అందించే వీలును కల్పించాలని భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను కోరింది.
ఇప్పటివరకూ ఎంతమంది?
ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలితంగా 2014 నుంచి 2,639 మంది భారతీయ మత్స్యకారులు, 71 మంది భారతీయ పౌరులను పాకిస్తాన్ నుంచి విడుదలయ్యారు. ఇందులో 2023 నుంచి ఇప్పటివరకు పాకిస్తాన్ నుంచి స్వదేశానికి 478 మంది భారతీయ మత్స్యకారులు, 13 మంది భారతీయ పౌర ఖైదీలు ఉన్నారు.

