ఇండో-పాక్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టిక్కెట్ ధర అన్ని లక్షలా..
టీ 20 ప్రపంచ కప్ - 2024 సీజన్ మొదలవుతోంది. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడటానికి టికెట్ ధర ఎంతో చెబితే నోరెళ్లబెడతారు?
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ - 2024 పోటీలు జూన్ 2 నుంచి 29వరకు జరగనున్నాయి. ఈ పోటీలకు అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 9న న్యూయార్క్‌లోని నన్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టిక్కెట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా..టికెట్ ధర చూసి జడుసుకుంటున్నారు.
టికెట్ల ధరలివి..
డైమండ్ క్లాస్ సీట్లకు టికెట్ ధరను 20 వేల డాలర్లుగా నిర్ణయించారు. అంటే సుమారు రూ.16.6 లక్షలు అన్నమాట. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్రంగా మండిపడ్డారు.
'భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ కేటగిరీ ఒక్కో సీటుకు 20 వేల డాలర్ల రేటు ఉండడం చూసి షాక్ అయ్యా. అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నది ఆటను విస్తరించడం, అభిమానులను అలరించడం కోసమే తప్ప అడ్డగోలుగా టికెట్ చార్జీలు పెట్టి లాభాలు ఆర్జించడానికి కాదు. మామూలు టికెట్ ధర కూడా 2,750 డాలర్లు (సుమారు రూ.2.29 లక్షలు) పెట్టడం దారుణం. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ (మోసగాళ్ల కౌన్సిల్)' అని ఎక్స్ లో పోస్టు చేశారు.