ఫ్రాన్స్ తో రూ. 64 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న భారత్
x
రాఫెల్ ఫైటర్ జెట్

ఫ్రాన్స్ తో రూ. 64 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకున్న భారత్

ఐదేళ్ల తరువాత రానున్న యుద్ధ విమానాలు


భారత నావికాదళం కోసం దాదాపు 64 వేల కోట్ల వ్యయంతో 26 నావికా వేరియంట్ రాఫెల్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడానికి భారత్- ఫ్రాన్స్ సోమవారం అంతర్ ప్రభుత్వ ఒప్పందం పై సంతకం చేశాయి.

ఈ ఒప్పందం వర్చువల్ ఈవెంట్ లో కుదిరినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ లో మోహరించడానికి భారతదేశం ఫ్రెంచ్ రక్షణ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ నుంచి జెట్ లను కొనుగోలు చేస్తోంది.

సంతకాల కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యహరాల క్యాబినేట్ కమిటీ (సీసీఎస్) ఈ సేకరణకు ఆమోదం తెలిపిన మూడు వారాల తరువాత ఈ మెగా ఒప్పందం కుదిరింది.

నిబంధనల ప్రకారం.. ఒప్పందంపై సంతకం చేసిన ఐదు సంవత్సరాల తరువాత జెట్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. జూలై 2023 లో రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రెంచ్ ప్రభుత్వం, కంపెనీ ప్రతినిధులతో వరుస చర్చలు జరిపిన తరువాత ప్రస్తుతం ఈ ఒప్పందం తుది రూపానికి వచ్చింది.

ఈ ఒప్పందం ప్రకారం భారత నావికాదళం రాఫెల్( మెరైన్) జెట్ ల తయారీదారు దసాల్ట్ ఏవియేషన్ నుంచి ఆయుధ వ్యవస్థలు, విడి భాగాలతో సహా అనుబంధ పరికరాల కూడా పొందనుంది.

ఇంతకుముందు వైమానిక దళంలో..

భారత్ ఇంతకుముందు 36 రాఫెల్ యుద్ధ విమానాలను వైమానిక దళం కోసం కొనుగోలు చేసింది. వీటి విలువ 59,000 వేల కోట్లు. ఈ యుద్ధ విమానాలు 4.5 ప్లస్ ప్లస్ జనరేషన్ కు చెందిన అత్యాధునికమైనవి.

భారత్ కు ఫ్రాన్స్ గత కొన్ని దశాబ్ధాలుగా నమ్మకమైన సైనిక భాగస్వామిగా ఉంది. ఈ దేశం నుంచి ఇంతకుముందు మిరాజ్ యుద్ధ విమానాలను భారత్ కొనుగోలు చేసింది. ఇవి కార్గిల్ వార్ తో పాటు బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై దాడి సందర్భంగా తమ శక్తిని ప్రదర్శించాయి.

లిబియా వార్ లో ప్రస్తుతం భారత్ వాడుతున్న రాఫెల్ రకం యుద్ధ విమానాలు మంచి పనితీరును కనపరిచాయి. శత్రువు రాడార్ వ్యవస్థలను జామ్ చేసి మరీ దాడులు చేయగలవు. ముఖ్యంగా బియాండ్ రేంజ్ దాడులకు ఇవి ప్రసిద్ధి గాంచాయి.

ప్రస్తుతం వైమానికదళం నిర్వహిస్తున్న రాఫెల్ రకం విమానాలకు, నేవీ కోసం కొనుగోలు చేయబోయే విమానాల నిర్వహణకు పెద్దగా తేడా లేదు. అందుకోసం భారత్ మెరైన్ వెర్షన్ కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉంది. ఈ బిడ్ కోసం అమెరికా సహ అనేక దేశాల ఆయుధ కంపెనీలు ప్రయత్నించినప్పటికీ నేవీ మాత్రం రాఫెల్ (ఎం) వెర్షన్ వైపు మొగ్గు చూపడంతో ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది.

Read More
Next Story