Fraud | భారీగా తెలుగు టెక్కీలను తొలగించిన Apple
x

Fraud | భారీగా తెలుగు టెక్కీలను తొలగించిన Apple

185 మంది భారతీయ ఉద్యోగులకు ఉద్వాసన: జాబితాలో తెలుగువారే ఎక్కువ


ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్‌ (Apple) 185 మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థను తప్పుదోవ పట్టించినందుకు కాలిఫోర్నియా కుపెర్టినో హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న వీరిని విధుల నుంచి తొలగించారు. వీరిలో ఆరుగురిపై కేసులు కూడా నమోదయ్యాయి. తొలగించిన ఉద్యోగులలో పలువురు భారతీయులు (Indians) ఉండగా.. తెలుగువారే (Telugu) ఎక్కువగా ఉన్నారు. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాపిల్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మోసానికి ఎలా పాల్పడ్డారు?

సామాజిక బాధ్యతగా స్వచ్ఛంధ సంస్థల సేవాకార్యక్రమాలకు డబ్బును విరాళంగా ఇచ్చే ఉద్యోగులను యాపిల్ సంస్థ ప్రోత్సహిస్తుంది. ఉద్యోగులు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కొంత డబ్బు విరాళంగా ఇస్తే.. యాపిల్‌ సంస్థ ఆ డబ్బుకు మరికొంత మ్యాచింగ్‌ గ్రాంట్‌ కలిసి సదరు స్వచ్ఛంధ సంస్థకు విరాళంగా ఇస్తుంది. ఇక్కడే ఉద్యోగులకు దుర్బుద్ధి పుట్టింది. వారు కొన్ని స్వచ్ఛంధ సంస్థలతో చీకటి ఒప్పందం చేసుకున్నారు. USలోని కొన్ని తెలుగు సంఘాలతో కలిసి అవినీతికి పాల్పడ్డారు. విరాళాలు పొందిన సంఘాలు ఆ డబ్బును తిరిగి ఉద్యోగులకు తిరిగి చెల్లించాయి. ఇక యాపిల్‌ చెల్లించిన మ్యాచింగ్‌ గ్రాంట్‌లో కొంత శాతాన్ని కూడా ఉద్యోగులకు కమీషన్‌ ఇచ్చాయి.

ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో..Apple ఫైనాన్స్ విభాగం అమెరికా అంతర్గత ఆదాయ విభాగం (IRS)కి సమాచారం ఇచ్చింది. దర్యాప్తులో నిధుల దుర్వినియోగం జరిగిందని గుర్తించింది.

కార్పొరేట్ ఉల్లంఘనే..

అమెరికా న్యాయవాదులు ఈ ఘటనను కార్పొరేట్ విధానాల ఉల్లంఘన, అమెరికా పన్ను చట్టాల ఉల్లంఘనగా అభివర్ణించారు.

మూడేళ్లల్లో $152,000 మోసం..

సాంటా క్లారా కౌంటీ జిల్లా కార్యాలయ సమాచారం ప్రకారం.. ఆరుగురు వ్యక్తులు మూడేళ్లలో దాదాపు $152,000 మోసానికి పాల్పడ్డారని పేర్కొంది. వీరు American Chinese International Cultural Exchange (ACICE), Hop4Kids అనే రెండు స్వచ్ఛంద సంస్థలకు తాము విరాళాలు ఇచ్చినట్లు యాపిల్ సంస్థకు చూపారు. ఈ మోసం వెనక Siu Kei Kwan అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. ఇతను Hop4Kids CEOగా, ACICE అకౌంటెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

Read More
Next Story