‘‘పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతను కాపాడండి’’
x
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో మోదీ

‘‘పశ్చిమాసియా ప్రాంతీయ భద్రతను కాపాడండి’’

ప్రధాని మోదీని కోరిన ఇరాన్ అధ్యక్షుడు


Click the Play button to hear this message in audio format

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం, ప్రపంచ ముడి చమురు రవాణాకు ఎదురవుతున్న ఆటంకాలు, హర్ముజ్ జలసంధి మూసివేత, పెట్రోలియం మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తో ఫోన్ లో మాట్లాడూ, వాటిని ఖండించారు.

ఇరుపక్షాలు దౌత్యపరంగా మాట్లాడుకోవాలని సూచించారు. కీలక నౌకా మార్గాలను "తెరిచి, సురక్షితంగా" ఉంచాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్ (BRICS) ప్రస్తుత అధ్యక్ష దేశంగా ఉన్న భారత్, ఇరాన్‌పై జరుగుతున్న "దురాక్రమణలను" అరికట్టడం, ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటంలో తన "స్వతంత్ర పాత్రను" ఉపయోగించుకోవాలని పెజెష్కియన్ మోదీని కోరారు.

ఈ ప్రాంతంలో "విదేశీ జోక్యం లేకుండా" శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడానికి పశ్చిమ ఆసియా దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ భద్రతా చట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఇరాన్ అధ్యక్షుడు భారత్ ప్రధాని నరేంద్రమోదీ ముందు ప్రతిపాదించినట్లు టెహ్రన్ నుంచి విడుదల అయిన ప్రకటన తెలియజేసింది.
ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడానికి అమెరికా సైనిక దాడి చేసిందన్న వాషింగ్టన్ వాదనలను పెజెష్కియన్ తిరస్కరించినట్లు ఇరాన్ ప్రకటనలో పేర్కొంది. దివంగత సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ అణ్వాయుధాలను 'దృఢంగా వ్యతిరేకించారని'వాటి అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా పరిపాలనా, మతపరమైన ఆదేశాలు జారీ చేశారని అధ్యక్షుడు మోదీతో అన్నారు.
మరోవైపు, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీతో చర్చలు జరిపారు. పశ్చిమ ఆసియాలోని సంఘర్షణ, విస్తృత ప్రాంతంపై దాని ప్రభావాల గురించి ఇరువురు నేతలు సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్లు సమాచారం. 'X'లో ఒక పోస్ట్‌లో, తాను పెజెష్కియన్‌కు ఈద్, నౌరూజ్ శుభాకాంక్షలు తెలియజేశానని, ఈ పండుగ కాలం పశ్చిమ ఆసియాకు శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశానని మోదీ తెలిపారు.
"ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పు కలిగించే, ప్రపంచ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించే, ఈ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించాను. నౌకాయాన స్వేచ్ఛను పరిరక్షించడం, షిప్పింగ్ మార్గాలు తెరిచి, సురక్షితంగా ఉండేలా చూసే ప్రాముఖ్యతను పునరుద్ఘాటించాను," అని ప్రధానమంత్రి తన పోస్ట్ లో పేర్కొన్నారు.
"ఇరాన్‌లో ఉన్న భారత పౌరుల భద్రత, రక్షణకు ఇరాన్ అందిస్తున్న నిరంతర మద్దతును అభినందించినట్లు" అని ఆయన అన్నారు. గత 10 రోజుల్లో మోదీ, పెజెష్కియన్‌ల మధ్య జరిగిన ​​రెండవ ఫోన్ సంభాషణ ఇది. పశ్చిమ ఆసియా గ్యాస్ కేంద్రాలపై తాజా దాడుల గురించి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇద్దరు నాయకుల మధ్య ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. టెహ్రాన్ శాంతియుత అణు కార్యకలాపాల "ధృవీకరణ, పర్యవేక్షణ" కోసం, ఐక్యరాజ్యసమితి సమావేశాల సందర్భంగా సహా ప్రపంచ నాయకులతో చర్చలలో పాల్గొనడానికి ఇరాన్ నిరంతరం సిద్ధంగా ఉందని అధ్యక్షుడు పునరుద్ఘాటించారని టెహ్రాన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ల చర్యలను ఆయన "అత్యంత అమానవీయమైనవి, అనైతికమైనవి"గా అభివర్ణించి, వాటిని తీవ్రంగా ఖండించారని ఆ ప్రకటన పేర్కొంది. "విదేశీ జోక్యం లేకుండా ప్రాంతీయ సహకారం ద్వారా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించే లక్ష్యంతో, పశ్చిమ ఆసియా దేశాలతో కూడిన ఒక ప్రాంతీయ భద్రతా చట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా అధ్యక్షుడు ప్రతిపాదించారు," టెహ్రన్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
"ఈ ప్రాంతంలో యుద్ధం, సంఘర్షణను అంతం చేయడానికి, అమెరికా, ఇజ్రాయెల్‌ల దురాక్రమణలను తక్షణమే నిలిపివేయడం ఒక ముందస్తు షరతు అని ఆయన నొక్కిచెప్పారు," అని అది పేర్కొంది. బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహించడాన్ని ప్రస్తావిస్తూ, ఇరాన్‌పై దురాక్రమణలను అరికట్టడంలో ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, స్థిరత్వాన్ని పరిరక్షించడంలో ఆ కూటమి స్వతంత్ర పాత్ర పోషించాలని పెజెష్కియన్ పిలుపునిచ్చారని ఆ ప్రకటన తెలిపింది.
Read More
Next Story