ఐదుగురు జర్నలిస్టులను హతమార్చిన ఇజ్రాయెల్
x
అనాస్ అల్ షరీఫ్

ఐదుగురు జర్నలిస్టులను హతమార్చిన ఇజ్రాయెల్

అంతా ‘అల్ జజీరా’ కు చెందిన వారే, మరణించిన వారిలో హమాస్ ఉగ్రవాది ఉన్నాడన్న ఐడీఎఫ్


గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో ఐడీఎఫ్ జరిపిన దాడుల్లో అల్ జజీరాకు చెందిన ఐదుగురు జర్నలిస్టులు మృతి చెందారు. చనిపోయిన విలేకరులలో ఒకరు హమాస్ కు చెందిన తీవ్రవాదని ఇజ్రాయెల్ ప్రకటించింది.

ఆసుపత్రి ప్రధాన ద్వారం వెలుపల మీడియా కోసం ఏర్పాటు చేసిన టెంట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు జర్నలిస్టులతో పాటు ఇద్దరు పాలస్తీనా వాసులు మరణించారు.
దాడి జరిగిన కాసేపటికే ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. అనాస్ అల్ షరీఫ్ లక్ష్యంగా దాడు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. జర్నలిస్ట్ ముసుగులో హమాస్ ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది.
‘‘అనాస్ అల్ షరీఫ్ హమాస్ ఉగ్రవాద సంస్థలోని ఒక ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడు. ఇజ్రాయెల్ పౌరులు, ఐడీఎఫ్ దళాలపై రాకెట్ దాడులు చేయడానికి బాధ్యత వహించాడు’’ అని ఐడీఎఫ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
మరణించిన మిగిలిన వారిలో కరస్పాండెంట్ మహ్మద్ ఖ్రీఖే, కెమెరామెన్ మోమెన్ అలీవా, మొహ్మద్ నౌఫాల్, ఇబ్రహీం జహెర్ ఉన్నారు. అనాస్ నార్తర్న్ గాజా నుంచి కరస్పాండెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడని తెలిసింది.
చివరి మాటలు..
‘‘నా మాటలు మీకు చేరితే ఇజ్రాయెల్ నన్ను చంపడంలో, నా గొంతు నిశ్శబ్దంగా మార్చడంలో విజయం సాధించిందని తెలుసుకోండి’’ అని ఆయన స్నేహితుడు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇవి ఆయన చివరి మాటలని చెప్పారు.
‘‘గాజా నగరంలో జర్నలిస్టులు పనిచేస్తున్న టెంట్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో అల్ జజీరా జర్నలిస్ట్ అనాస్ అల్ షరీఫ్ తో సహ అతని నలుగురు సహచరులు మరణించారు’’ అని ఖతార్ కేంద్రంగా పనిచేస్తున్న అల్ జజీరా ఓ ప్రకటనలో తెలిపింది. గాజాలో 22 నెలలుగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు 200 మంది జర్నలిస్టులు మరణించారు.
దాడిని ఖండించిన మీడియా..
దాడి తరువాత జర్నలిస్టుల రక్షణ కమిటీ(సీపీజే) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విశ్వసనీయమైన సాక్ష్యాలను అందించకుండా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్రవేసే ఇజ్రాయెల్ తీరు, ఉద్దేశ్యాలపై, పత్రికా స్వేచ్ఛ పట్ల గౌరవం గురించి తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది’’ అని సీపీజే ప్రాంతీయ డైరెక్టర్ సారా కుదా అన్నారు.
జర్నలిస్టులు కూడా పౌరులేని అని వారిని ఎల్లప్పుడూ లక్ష్యంగా చేసుకోవద్దని అన్నారు. హత్యలకు ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని ఆమె అన్నారు.
గాజాలో తన కరస్పాండెంట్ అనాస్ అల్ షరీఫ్ హత్యకు గురయ్యారని అల్ జజీరా నుంచి వచ్చిన వార్తలు ఆందోళన కలిగించాయని నేషనల్ ప్రెస్ క్లబ్ వాషింగ్టన్ డీసీ నుంచి ఒక ప్రకటన వెలువరించింది.
‘‘ప్రజలకు సమాచారం అందించకుండా పనిచేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ హత్యకు గురికావడం ఒక న్యూస్ రూమ్ కంటే చాలా ఎక్కువ నష్టం’’ అని నేషనల్ క్లబ్ అధ్యక్షుడు మైక్ బాల్సామె అన్నారు.
‘‘జర్నలిస్టలు లక్ష్యంగా చేసుకోకుండా పనిచేయగలగాలి. సంఘర్షణ ప్రాంతాల్లోని అన్ని పార్టీలు అంతర్జాతీయ చట్టం ప్రకారం విలేకరులను రక్షించడానికి తగు ఏర్పాట్లు చేయాలి. వారి బాధ్యతలను గౌరవించాలి’’ అన్నారు.
Read More
Next Story